టీడీపీకి ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/చిత్తూరు/విశాఖపట్నం: ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు చోట్ల పరాజయాన్ని మూటగట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణం గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి జయకేతనం ఎగురవేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయన విజయం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థి మాధవ్ ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో ముందంజలో కొనసాగుతున్నారు.
విజయం ముంగిట గోపాల్‌రెడ్డి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయన తన సమీప ప్రత్యర్థి, టీడీపీ కేజే రెడ్డిపై 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే, విజయానికి అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ గోపాల్ రెడ్డికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో 1,55,711 ఓట్లు పోలయ్యాయి.
మొదటి ప్రాధాన్య త ఓట్ల ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. కేజే రెడ్డికి 41,037, గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్లను మినహాయిస్తే మిగిలిన 1,35,772 ఓట్లలో 67,887 ఓట్లను ‘మ్యాజిక్ ఫిగర్’గా నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు గోపాల్ రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బుధవారం తుదిఫలితం వెలువడనుంది.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండపల్లి
తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై ఆయన గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడంతో యండపల్లి విజయం సునాయాసమైంది. చిత్తూరు జిల్లాకు చెందిన యండపల్లి మొదటగా 2011లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్సీగా నెగ్గారు. ఆయన 3,500 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
విజయానికి చేరువలో మాధవ్
ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి 1,08,945 ఓట్లు పోలవగా వాటిలో మాధవ్‌కు 42,863 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి అవధానుల అజయ్‌శర్మకు 37,818 ఓట్లు లభించాయి. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు 11,519, నోటా ఓట్లు 430 మినహాయించి మిగిలిన 97,426 ఓట్లకుగాను 48,714 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి శర్మపై 5,045 ఓట్ల మెజారిటీ వచ్చినప్పటికీ మాధవ్ కోటా ఓట్లను సాధించలేకపోయారు. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపును చేపట్టారు. బుధవారం తుది ఫలితం వెలువడనుంది.