నన్ను దెబ్బ కొట్టేందుకే వెన్ను పోటు
- ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఓటమిపై ఫిర్యాదుకు సిద్ధమైన మంత్రి నారాయణ
- ఓటమికి నారాయణే పూర్తి బాధ్యుడని ఎదురు దాడికి సిద్ధమైన మరో వర్గం
- అన్నీ ఆయనే చూసుకుని నెపం తమ మీదకు వేస్తే ఎలా అని మండిపాటు
- హై కమాండ్‌కు ఫిర్యాదులు చేసుకోవడానికి సిద్ధమైన వైరి వర్గాలు
- రెండు స్థానాల ఓటమిపై చంద్రబాబు, లోకేష్ అసహనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అగ్గి రాజేశాయి. తన ప్రాబల్యాన్ని దెబ్బ కొట్టడానికి పార్టీలోని ఒక సామాజికవర్గం వెన్నుపోటు పొడిచిందని మంత్రి నారాయణ సీఎం చంద్రబాబునాయుడుకు తన వాదన వినిపించడానికి సిద్ధమయ్యారు. మంత్రి నారాయణ ఒంటెత్తు పోకడ, మితిమీరిన విశ్వాసం, చంద్రబాబు నాయుడు వద్ద తాను ఏం చెబితే అది జరుగుతుందనే వ్యవహార తీరు కొంప ముంచాయని ఒక వర్గం ఎదురు దాడికి సిద్ధమైంది. స్థానిక సంస్థల కోటాలో సమష్టిగా పనిచేసి విజయం సాధించామనీ, పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల విషయంలో అన్నీ తానై వ్యవహరించిన మంత్రే ఈ ఓటమికి బాధ్యుడని మరో వర్గం హై కమాండ్‌కు తమ వాదన వినిపించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
పార్టీ నేతలు పట్టించుకోలేదు
పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల శాసన మండలి ఎన్నికలను మూడు జిల్లాల్లో పార్టీ నేతలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ మద్దతుదారులు చెబుతున్నారు. జిల్లా మంత్రిగా ఇక్కడా, ఇన్‌చార్జి మంత్రిగా చిత్తూరు జిల్లాలోను నారాయణ కష్టపడి పనిచేశారనీ, కానీ మిగిలిన వారు సహాయ నిరాకరణ చేశారని వాదిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఈ ఎన్నికల గురించి సీరియస్‌గా తీసుకోక పోవడంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందనే మంత్రి మద్దతుదారులు వాదిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక, వారిని గెలిపించే బాధ్యతను సీఎం చంద్రబాబునాయుడు మంత్రి నారాయణకు ఇవ్వడం వల్లే పార్టీలోని ఒక సామాజిక వర్గంలోని నేతలంతా చేతులెత్తేసి పనిచేసినట్లు నటించారని ఆ వర్గం ఆరోపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలకు మంత్రి పనికి రారని చూపించడానికే అంతా కలిసి ఈ రకంగా దెబ్బకొట్టారని మంత్రి మద్దతుదారులైన నాయకులు సమీక్షించుకుంటున్నారు. మంత్రి వ్యవహారతీరు వల్లే ఈ ఎన్నికల్లో అధికారంలో ఉండీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వారు అంటున్నారు. ఈ ఫలితాలు సీఎం దగ్గర మంత్రి నారాయణ పరపతి, పలుకుబడికి గండి కొట్టడం ఖాయమని ఈ వర్గం భావిస్తోంది.
నారాయణే బాధ్యుడు
తూర్పు రాయలసీమ, పట్టభద్రుల నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ నిర్వహణ వరకు అన్నీ మంత్రి నారాయణ ఇష్ట్రపకారమే జరిగినందువల్ల ఈ రెండు స్థానాల్లో ఓటమికి కూడా ఆయనే బాధ్యుడని మంత్రి వ్యతిరేకవర్గం వాదిస్తోంది. పార్టీలో సభ్యత్వం కూడా లేని పట్టాభిని కేవలం తనకు కావాల్సిన వ్యక్తి అని అభ్యర్థిని చేయించారని ఆ వర్గం చెబుతోంది. నె ల్లూరు జిల్లాలో కాస్త చదువుకున్న వ్యక్తికి పట్టాభి అంటే ఏమిటి? ఆయన వ్యవహార తీరు ఎలా ఉంటుందనే విషయం తెలుసుననీ, అలాంటప్పుడు ఎలా ఓట్లు పడతాయనే వాదన ఈ వర్గం లేవదీసింది. పార్టీ వైపు నుంచి ఎన్నికల నిర్వహణకు కొన్ని బృందాలు పనిచేస్తుంటే, నారాయణ సంస్థల ఉద్యోగులు సమాంతరంగా మరో విధానంలో పనిచేశారని వారు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల పనుల్లో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారని వారు చెబుతున్నారు. మూడు జిల్లాల్లో పోలింగ్ బూత్‌ల ఖర్చులకు నియోజక వర్గానికి రూ 5 లక్షల చొప్పున అది కూడా చివరి రోజు ఇచ్చారని, ఓటర్లు , పార్టీ శ్రేణులు ఎంతో ఆశించాయని వారు అంటున్నారు. నారాయణ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏ ఇతర విద్యా సంస్థను బతకనివ్వడం లేదనీ, ఈ అంశం కూడా పట్టాభి, వాసుదేవనాయుడు ఓటమిలో కీలకంగా పనిచేసిందని వారు అంచనా వేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు రెండు సార్లు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దేశాయ్‌శెట్టి హనుమంతరావు పోటీ చేసి ఓడిపోయారనీ, ఈ సారి ఆయన దగ్గర డబ్బులు లేవనే కారణంతో టికెట్ ఇవ్వకపోవడం కాపు సామాజికవర్గంలో వ్యతిరేక తెచ్చిందని మంత్రి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది.
ఈసారి దేశాయ్ శెట్టికి టికెట్ ఇచ్చి ఉంటే విజయం సాధించి ఉండే వారనీ, మంత్రి ఏకపక్షంగా పట్టాభిని, సీఎం జిల్లాకు చెందిన వాసుదేవనాయుడును ఎంపిక చేయించారని వారు చెబుతున్నారు. తాము వేలాది ఓట్లు చేర్పించామని నారాయణే స్వయంగా ప్రకటించారనీ, ఆ ఓట్లు ఎందుకు పడలేదని వారు వాదిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేసినందువల్లే పీడీఎఫ్ అభ్యర్థులు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డికి తమ అభ్యర్థులు ఆ మాత్రమైనా పోటీ ఇవ్వగలిగారని మంత్రి వ్యతిరేక వర్గం వాదిస్తోంది.
బాబు, లోకేష్ ఆరా
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలు రెండు ఓడిపోవడంపై సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూడు జిల్లాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలను ఆరా తీశారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణలో తమ ప్రమేయం లేకుండా చేసి ఇప్పుడు తమను తప్పు పడితే ఎలా అని చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయం కుండబద్ధలు కొట్టారని తెలిసింది. మొత్తం మీద ఈ రెండు స్థానాలు కోల్పోవడంపై చంద్రబాబు, లోకేష్ తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం.