గుట్టలు హాంఫట్ | granite mafia in Karimnagar district | Sakshi
Sakshi News home page

గుట్టలు హాంఫట్

Published Sat, Sep 3 2016 3:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

గుట్టలు హాంఫట్

గుట్టలు హాంఫట్

- కరీంనగర్ జిల్లాలో 800 గుట్టల్ని మింగేసిన గ్రానైట్ మాఫియా
- ఏటా రూ. వెయ్యి కోట్ల దందా!

- గుట్టలు, వాటి చుట్టూ ఉన్న అడవులు మాయం.. గ్రామాల్లోకి వస్తున్న జంతువులు
- వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంట పొలాలు
- వందల సంఖ్యలో చెరువుల పూడ్చివేత
- నిత్యం బాంబుల మోత.. దుమ్మూధూళి
- శ్వాసకోశ వ్యాధులతో జనం సతమతం
- గ్రానైట్ లారీలతో దెబ్బతింటున్న రోడ్లు
- దేవుడి గుట్టలనూ వదలని వైనం
- అక్రమ తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో నష్టం
- మామూళ్ల మత్తులో అధికారులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
రాష్ట్రంలో మైనింగ్ మాఫియా గుట్టలను మింగేస్తోంది.. విచ్చలవిడిగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోంది.. గ్రానైట్ కోసం అక్రమంగా గుట్టలను తవ్వేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది.. గ్రానైట్ తిమింగలాల దెబ్బకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 800కుపైగా గుట్టలు మాయమైపోయాయి. వేలాది ఎకరాల్లోని పంట పొలాలు నాశనమయ్యాయి. కాకతీయులు గుట్టల చుట్టూ తవ్వించిన ఎన్నో చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. గుట్టలు, వాటి చుట్టూ ఉన్న అడవిలో ఉండే వన్యప్రాణులన్నీ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీలతో జరుగుతున్న విధ్వంసం మాటలకు అందనిది.

వేల కోట్ల దందా
కరీంనగర్ జిల్లాలో 618 గ్రానైట్ క్వారీలకు అనుమతులున్నాయి. అనధికారికంగా మరో 200కుపైగా గుట్టల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ టాంబరిన్ రెడ్, కాఫీ బ్రౌన్, మాఫిల్ రెడ్ అనే మూడు రకాల గ్రానైట్ లభిస్తోంది. వాటిని చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా నుంచి ఏటా ఎగుమతయ్యే గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉంటుంది. అక్రమంగా మరో రూ.500 కోట్ల విలువైన గ్రానైట్ తరలిపోతోందని అంచనా. 2006-2014 మధ్య 8 ఏళ్లపాటు రాయల్టీ రూపంలో సర్కారుకు వచ్చిన ఆదాయం రూ.వెయ్యి కోట్ల పైమాటే. ఇది రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్ నుంచి వస్తున్న ఆదాయంలో 75 శాతం కావడం గమనార్హం.

భారీగా పర్యావరణ విధ్వంసం
గుట్టలు పచ్చని ప్రకృతికి, వన్యప్రాణులకు నిలయాలు.  కాకతీయులు గుట్టల చుట్టూ నివాస ప్రాంతాలకు దగ్గరలో పెద్ద సంఖ్యలో చెరువులు తవ్వించారు. వర్షాలు పడినప్పుడు గుట్టలపై నుంచి చేరే నీటితో అవన్నీ కళకళలాడుతుండేవి. కానీ క్వారీల్లో చేస్తున్న బ్లాస్టింగ్‌లు, తవ్వకాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. గుట్టలు తరిగిపోయి, చెట్లన్నీ కొట్టివేయడంతో వన్యప్రాణులన్నీ చెల్లాచెదురయ్యాయి. బాంబుల రసాయనాలతో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు పగుళ్లు బారుతున్నాయి. తవ్వకాల వ్యర్థాలను కుంటలు, చెరువుల్లో పడేస్తుండడంతో.. సుమారు 40కిపైగా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. మరో వంద వరకు కుంటలు కాలుష్యంతో నిండిపోయాయి. దీంతో సమీపంలోని పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో దాదాపు 10 వేల ఎకరాల మేర పొలాలు ధ్వంసమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక గుట్టలపై ఆధారపడి బతుకున్న వారి జీవనాధారం తీవ్రంగా దెబ్బతిన్నది. క్వారీలతోపాటు గ్రానైట్‌ను చెక్కే పరిశ్రమల కారణంగా విపరీతంగా దుమ్మూ ధూళి రేగి గ్రామాలపై కమ్ముకుంటోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలంతా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

దేవుడి గుట్టలనూ వదల్లేదు
జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా గుట్టలను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములేకాదు ఇనాం, లావణి, అసైన్డ్, వక్ఫ్‌బోర్డ్, దేవుడి మాన్యం వంటి భూములనూ వదలడం లేదు. గంగాధర మండలంలోని ఒద్యారం, గట్టుభూత్కూర్, సర్వారెడ్డిపల్లి, కోట్ల నర్సింహులపల్లి, అచ్చంపల్లి, గర్శకుర్తి, కాచిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు, సుల్తానాబాద్ మండలం, కేశవపట్నం, వెల్గటూర్, హుస్నాబాద్ మండలాల్లో విలువైన గ్రానైట్ గుట్టలు ఉన్నాయి. సర్వారెడ్డిపల్లి, కోట్ల నర్సింహులపల్లి గ్రామాల్లోని 230, 236, 236/1, 236/3, 199 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పెద్దమ్మగుట్ట, పెద్దగుట్ట, చెక్కగుట్ట, కాకుల గుట్టలున్నాయి. ఇవే సర్వే నంబర్లలో గుట్టల కింద ఉన్న మరో 40 ఎకరాల ప్రభుత్వ భూములను దళిత, బడుగు, బలహీన వర్గాలకు పంపిణీ చేశారు. క్వారీల నిర్వహకులు వారిని భయపెట్టి, కబ్జాచేసి ఆ భూముల్లో గ్రానైట్ తవ్వకాలు చేపట్టారు. గట్టుభూత్కుర్‌లోని 1152, 1154 సర్వే నంబర్లను అనుకుని 10 ఎకరాల లావణి, ఇనాం భూములను ఆక్రమించుకున్నారు. ఒక్క ఒద్యారంలోనే సుమారు 150 వరకు గ్రానైట్ క్వారీలున్నాయంటే అక్కడ విధ్వంసం ఏమేరకు జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక్కడి గుట్టలు పూర్తిగా తరిగిపోవడంతో.. భూగర్భంలోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ గ్రామం పరిధిలో 98, 99,100 సర్వే నంబర్లలో ఉన్న వక్ఫ్‌బోర్డు భూములు, 94/ఎ, 94/బి, 95/ఏ, 95/బి సర్వే నంబర్లలోని 9 ఎకరాల సీలింగ్ భూముల్లోనూ తవ్వేస్తున్నారు. ముప్పిడిపల్లిలోని పందికుంటను ఆక్రమించుకుని గ్రానైట్ వ్యర్థాలతో నింపేశారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గుట్టలపై దేవాలయాలు, దేవతా విగ్రహలు ఉండడంతో ప్రజలంతా వాటిని దేవుడి గుట్టలుగా పిలుచుకుంటారు. గ్రానైట్ మాఫియా వాటిల్లోని రామస్వామిగుట్ట, మల్లన్న గుట్ట, మైసమ్మ గుట్టలపై ఉన్న దేవతా విగ్రహాలను తొలగించి తవ్వకాలు చేపట్టింది. ఇలా గుట్టలపైనున్న ఆలయాలతోపాటు చారిత్రక ఆనవాళ్లు, సాంస్కతిక రూపాలు ధ్వంసమవుతున్నాయి.

భారీగా అక్రమాలు..
2008-2011 మధ్య గ్రానైట్ అక్రమ రవాణా వల్ల రూ.792 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని విజిలెన్స్ రికార్డులే చెబుతున్నాయి. పెద్ద పెద్ద బ్లాకులుగా ఉన్న గ్రానైట్ రాళ్ల కొలతను తక్కువగా చూపి వందల కోట్లు పన్ను ఎగవేస్తున్నారు. ఇందుకోసం మైనింగ్ అధికారులకు, తనిఖీ అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నారు. కరీంనగర్ నుంచి కాకినాడ షిప్పింగ్ పోర్టు వరకూ ఉన్న ఆర్టీఏ, ఇతర మైనింగ్ అధికారులకు ప్రతినెలా ఒక్కో లారీ సుమారు రూ.లక్ష వరకూ చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంటే ఈ 300 లారీలపై వసూలవుతున్నది రూ.3 కోట్ల పైమాటే.  రైల్వేస్టేషన్లు, పోర్టుల్లో విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. ఆ మూడేళ్లలోనే సుమారు రూ.792 కోట్ల విలువైన గ్రానైట్ అక్రమంగా తరలిపోయిందని విజిలెన్స్ నిర్ధారించింది. ఆయా గ్రానైట్ సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు ఇప్పటికీ గ్రానైట్ యజమానులు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు.

రోడ్లన్నీ నాశనం
గ్రానైట్ లారీల కారణంగా కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్, మంచిర్యాల, గోదావరిఖని నుంచి వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దాంతోపాటు పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజూ సుమారు 300 వరకు లారీలు గ్రానైట్‌ను తరలిస్తుండగా... అందులో 90 శాతానికిపైగా ఓవర్‌లోడ్‌తోనే ప్రయాణిస్తుంటాయి. దీంతో రోడ్లు పాడైపోతున్నాయి. పలు చోట్ల వంతెనలు దెబ్బతింటున్నాయి. ఈ విధ్వంసం వల్ల ఏటా రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని అధికారులే పేర్కొంటున్నారు. అక్రమ తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతోంది.

విధ్వంసానికి ప్రతీక ఇది
ఇది హుస్నాబాద్ మండలంలోని మన్నెగుట్ట. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్ట గిరిజనులకు ఉపాధితోపాటు, శివారు గ్రామాల రైతులకు ఊట నీరిచ్చే కల్పతరువు. 2011లో గ్రానైట్ వ్యాపారుల కళ్లు మన్నెగుట్టపై పడ్డాయి. అప్పటి వరకు ప్రకృతి సౌందర్యంతో పచ్చగా ఉన్న పల్లెలు, గిరిజన తండాలు గ్రానైట్ క్వారీల దెబ్బకు నాశనమవుతున్నాయి. క్వారీలో వినియోగించే బాంబుల రసాయనాలు, రాతి పొడితో సమీపంలోని బూరుగులొద్ది కుంట, తిమ్మాయి చెరువుల నీళ్లు కలుషితమయ్యాయి. వాటిలోని చేపలు చచ్చిపోతుండడంతో.. మత్స్యకారులు చేపలు పెంచడం మానేశారు. ఇక పేలుళ్ల శబ్దాలకు అడవీ జంతువులు భయపడి.. రైతుల పొలాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి.

అన్ని రకాలా నష్టమే..
‘‘గ్రానైట్ మైనింగ్ వల్ల జల వనరులు దెబ్బతింటాయి. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. ఒకవైపు చెరువుల మరమ్మతులకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ చెరువుల వద్ద గ్రానైట్ తవ్వకాలకు అనుమతివ్వడంతో ప్రజాధనం వృథా అవుతోంది. గుట్టలపై నివసించే వన్యప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. అవి ఇళ్లలోకి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గుట్టలపై లభించే సీతాఫలాలు, పూలు అమ్ముకుని బతికే వారికి జీవానోపాధి కరువైంది. కరీంనగర్ జిల్లాలో అసాధారణ వాతావరణ మార్పులకు గ్రానైట్ పేరిట జరుగుతున్న విధ్వంసమే కారణం..’’
- ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, తెలంగాణ  భూమి రక్షణ సమితి కన్వీనర్

అడవి జంతువుల బారిన పడుతున్నం
‘‘మా పొలాల శివారులో మన్నెగుట్టకు క్వారీ ఏర్పాటు చేయడంతో అడవిలో ఉండే ఎలుగుబంట్లు పశువుల వద్ద వస్తున్నాయి. అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. క్వారీతో కుంటల్లోని నీళ్లు కలుషితమై పశువులు, నెమళ్లు చనిపోతున్నాయి. గట్టు నుంచి వచ్చే నీళ్లతో బావుల్లో ఊట పెరిగేది. ఇప్పుడు గుట్టలు పోతే మా బావుల్లోకి నీళ్లు రావు. క్వారీలను నిలిపేయాలి..’’
- పొన్నబోయిన శ్రీనివాస్, రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement