మడకశిర ప్రాంతంలో గ్రానైట్ తరలిస్తున్న వాహనాలు , కలర్ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ బ్లాక్‌లు
సాక్షి, అనంతపురం: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అత్యంత విలువైన ఖనిజాన్ని రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేస్తున్నారు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొరే అన్న చందంగా అక్రమ రవాణా సాగుతోంది. క్వారీలపై గనులశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. గ్రానైట్ అక్రమ రవాణాతో ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టపోతోంది.
పర్మిట్లు నిల్.. రవాణా ఫుల్..
జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 340 క్వారీలకు గనులశాఖ అధికారులు అనుమతులను మంజూరు చేశారు. వీటిలో 150కిపైగా కిపైగా గ్రానైట్ క్వారీలు, 144 రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకొవాలనే అన్న సామెతను గ్రానైట్ అక్రమార్కులు తూ చ తప్పకుండా పాటిస్తున్నారు. ఎలాంటి పర్మిట్లు తీసుకోకుండానే అత్యంత విలువైన గ్రానైట్‌ను జల్లా సరిహద్దు దాటించేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలర్ గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో గ్రానైట్ బ్లాక్‌లకు రాయల్టీ చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటకకు తరలిస్తున్నారు. క్వారీ నిర్వహకులు గ్రానైట్‌ను తరలించే సమయంలో భూగర్భ గనుల శాఖ అధికారులతో అనుమతులు పొందాలి. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.2350, బ్లాక్ గ్రానైట్‌కు రూ.3000లతో రాయల్టీ చెల్లించాలి. అయితే క్వారీ నిర్వహకులు మాత్రం తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రోడ్డు మెటల్ క్వారీల్లో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. పెనుకొండ, రాయదుర్గం ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీల్లో తీసుకున్న పర్మిట్లకు క్వారీల్లో తవ్వుకున్న ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి లక్షల కూబ్యిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వుకుంటున్నారు.
మడకశిర కేంద్రంగా అక్రమ రవాణా
గ్రానైట్ అక్రమ రవాణ మడకశిర కేంద్రంగా సాగుతోంది. మడకశిర నియోజకవర్గంలోని అత్యధిక గ్రానైట్ క్వారీలు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అధీనంలో ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ రవాణా మొత్తం ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.. గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ రవాణా సాగించారు. ఇప్పుడు సైతం అదే పంథానే కొనసాగిస్తున్నారు. మొత్తం క్వారీలన్నీ ఆయన అధీనంలో ఉండడం.. క్వారీలకు 4,5 కిలో మీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండడం ఆ నేతకు బాగా కలిసొచ్చింది. అత్యంత విలువైన గ్రానైట్‌ను రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక మడకశిర ప్రాంతం నుంచే దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం సాగుతోంది. మడకశిర జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ సైతం కొరవడింది. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా రవాణా సాగిస్తున్నారు. గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంతోపాటు గనులశాఖ విజిలెన్సు కార్యాలయం జిల్లాలోనే ఉన్నా అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం
వెహికల్ ట్రాకింగ్ సిస్టాన్ని అమలులోకి తీసుకువచ్చి గ్రానైట్ అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం. గ్రానైట్ రవాణా సమయంలో క్వారీ నిర్వహకులు రిజిస్టర్ వెహికల్ నంబర్ ఇస్తేనే పర్మిట్లు జారీ చేసేలా చర్యలు చేపడతాం. రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ రవాణా సాగిస్తే వెహికల్‌ను సీజ్ చేయడంతోపాటు క్వారీల లీజును సైతం రద్దు చేస్తాం. – చంద్రమౌళి, గనులశాఖ డీడీ
Comments
Please login to add a commentAdd a comment