బొమ్మనహాల్ మండలంలోని క్వారీలో సాగిస్తున్న తవ్వకాలు
ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వారీ శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలోనిది. దీంతోపాటు ఇక్కడ మరో రెండు రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. వీటికి అత్యంత దగ్గరలోనే కర్ణాటక ప్రాంతం ఉంది. ఈ క్వారీల నుంచి ప్రతిరోజూ రోడ్డు మెటల్‌తోపాటు గ్రానైట్ రవాణా చేస్తున్నారు. అయితే తీసుకున్న పర్మిట్ల కన్నా ఎక్కువ రవాణా చేస్తున్నారు. ఒక్క పర్మిట్‌పై పదుల సంఖ్యల్లో వాహనాలు అక్రమంగా గ్రానైట్ రవాణా సాగిస్తూ ప్రభుత్వ అదాయానికి గండికొట్టి జేబులు నింపుకొంటున్నారు.
అనంతపురం టౌన్: జిల్లావ్యాప్తంగా అధికారికంగా 320 క్వారీలకు గనులశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 70కిపైగా గ్రానైట్ క్వారీలు, 250 రోడ్డుమెటల్ క్వారీలు ఉన్నాయి. వీటిని అనుక్షణం పర్యవేక్షించి అక్రమ క్వారీలపై కొరడా ఝుళిపించాల్సిన భూగర్భగనుల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్ యూనిట్లు నడుస్తున్నా చర్యలు తీసుకోలేదు. మామూళ్ల మత్తులో నిద్రపోతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు పొందుతూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్రమంగా గ్రానైట్ రవాణా సాగిస్తున్నారు. ఒక్క పర్మిట్‌తో పదుల సంఖ్యలో వాహనాల్లో అత్యంత విలువైన గ్రానైట్‌ను జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు. ఇక్కడి గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండటంతో రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దు దాటించేస్తున్నారు. మడకశిర, శెట్టూరు, గోరంట్ల, పెనుకొండ, బొమ్మనహాల్ ప్రాంతాలు కర్ణాటక ప్రాంతానికి దగ్గర్లోనే ఉండటంతో వారి అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. కర్ణాటక సరిహద్దులో దాదాపు 18కిపైగా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొడ్డిదారిన గ్రానైట్ తరలిస్తున్నారు. తీసుకున్న పర్మిట్లకు తరలిస్తున్న గ్రానైట్‌కు ఎక్కడా పొంతన లేదు. బొమ్మనహాల్ మండలంలో ఎలాంటి లీజు అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వి అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నేమకల్ ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీలకు పర్మిట్లను జారీ చేయరాదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా గనులశాఖ అధికారులు పర్మిట్లు ఇచ్చేస్తున్నారు.
గనులశాఖ అధికారులకు మామూళ్ల మత్తు
గనులశాఖ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో గ్రానైట్‌ను పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ అదాయానికి గండికొడుతున్నా ఈ ఏడాది కాలంలో అలాంటి వాహనాన్ని ఒక్కదాన్ని కూడా వారు సీజ్ చేయకపోవడంతో వాటికి మరింత బలం సమకూరింది.
విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలు
బొమ్మనహాల్ మండలంలో అత్యధికంగా 22 రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. వీటిలో చాలా వాటికి పర్యావరణ అనుమతులు లేవు. అనుమతులు లేని క్వారీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిట్లు జారీ చేయకూడదు. అయితే అధికారులు క్వారీలను పర్యవేక్షించకుండా పర్మిట్లు ఇచ్చేస్తున్నారు. ఓ క్వారీ నిర్వాహకుడు లీజుకు తీసుకున్న క్వారీ కాకుండా మరోచోట తవ్వకాలు చేపట్టాడు. లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డు మెటల్ తవ్వేసుకున్నాడు. ఇటీవల విజిలెన్సు అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు
గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులకు సైతం హక్కులను కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెం.18ని సైతం విడుదల చేసింది. వారు కూడా అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలి. బొమ్మనహాల్ క్వారీలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలను సీజ్ చేస్తాం.
– వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌చార్జ్ గనులశాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment