గ్రానైట్ మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం
– విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి వైజాగ్‌కు బదిలీ
– ఇటీవల ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన ఓ ఎమ్మెల్యే
– తాడిపత్రిలో తిరిగి రెచ్చిపోనున్న గ్రానైట్ మాఫియా
– ఇక జీరో బిజినెస్‌తో దందా కొనసాగింపు
అధికార పార్టీ నేతల పంతం నెగ్గింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికారులను నాయకులు తమ మునివేళ్లతో ఆడిస్తారనేందుకు తాజా ఉదాహరణ ఇది. చెప్పినట్లు వినకపోయినా.. తమ ఆగడాలకు అడ్డొచ్చినా జిల్లాను దాటించేందుకూ వెనుకాడబోమని ఈ బదిలీ ఉదంతంతో చెప్పకనే చెప్పినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు పాలనలో పారదర్శకత పాటిస్తారా? నాయకుల చెప్పుచేతల్లో కాకుండా పేదల పక్షాన నిలబడతారా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని వైజాగ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొన్ని నెలలుగా తాడిపత్రి గ్రానైట్ మాఫియా, అక్కడి ఓ పెద్ద మనిషి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రిపై ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఏకంగా సీఎం వద్ద పంచాయితీ పెట్టి మరీ ఏడీని బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌రెడ్డి బదిలీతో తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా తిరిగి రెచ్చిపోనుంది. తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్ క్వారీలు లేవు. మడకశిర, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల క్వారీల నుంచి రవాణా అవుతోంది. ఆయా జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నా.. తాడిపత్రికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందుకు ఆయా ప్రాంతాలతో పోలిస్తే గ్రానైట్ ధర ఇక్కడ కాస్త తక్కువగా ఉండటమే. ఇదే జీరో బిజినెస్‌కు కూడా కారణమవుతోంది.
ప్రతాప్‌రెడ్డి రాకతో మాఫియాకు చెక్
మైనింగ్ విజిలెన్స్ ఏడీగా 2015 ఆగస్టు 21న ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్తలోనే గ్రానైట్ మాఫియా ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాయల్టీ లేకుండా వచ్చిన లోడు, ఒకే బిల్లుపై 5 నుంచి 10 లోడ్లు తిరుగుతుంటే భారీగా జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా రూ.40 లక్షల మామూళ్లు అడుగుతున్నారని ఆయనపై ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రతాప్‌రెడ్డి ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేయలేదని వ్యాపారులు తెలిపారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డులు పరిశీలించారు. 2015కు ముందు ఏటా రూ.కోటి మాత్రమే పెనాల్టీ రూపంలో ఆదాయం వచ్చేది. 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రావడంతో ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చారు.
వెళ్లిపోవాలని బెదిరింపులు
ప్రతాప్‌రెడ్డి బదిలీకి అన్నివిధాల ప్రయత్నించారు. చివరకు బెదిరింపులకూ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని, ఆగస్టు 2న ఉన్నతాధికారులకు ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో మాఫియాకు అండగా నిలిచే పెద్దమనిషి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రతాప్‌రెడ్డి సెలవుపై వైజాగ్ వెళ్లారు. నంద్యాల ఎన్నికల తర్వాత ఆ పెద్దమనిషి ఏకంగా భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో పాటు ముఖ్యమంత్రిని కలిసి బదిలీకి పట్టుబట్టారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే రెండురోజుల ముందు కూడా ఓ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో ఏడీ ఓ రాజకీయ పార్టీకి అంగా ఉంటున్నారని, నెలకు రూ.40లక్షల మామూళ్లు అడుగుతున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అవాస్తవాలని తెలినప్పటికీ.. రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దమనిషి సిఫార్సుకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. నిజాయితీ అధికారిపై బదిలీ వేటు వేసింది.
మళ్లీ మొదలు కానున్న దందా
తాజా బదిలీతో తాడిపత్రిలో మాఫియా దందా షురూ కానుంది. తాడిపత్రిలో 600 పైగా గ్రానైట్ మిషన్లు ఉన్నాయి. వీటికి 20–30మంది ట్రాన్స్‌పోర్టర్లు ఉన్నారు. వీరు తమ లారీలను ఏర్పాటు చేసి గ్రానైట్ రాళ్లను సరఫరా చేస్తున్నారు. ఒకలోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి, బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో పదుల సంఖ్యలో 5–6లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు ‘మాఫియా’నే చూస్తుంది. తద్వారా రోజూ కనీసం రూ.30లక్షలు గ్రానైట్ ద్వారానే అందనుంది. మైనింగ్ అధికారులు కూడా మాఫియాకు మద్దతుగా ఉండటంతో ఇకపై గ్రానైట్ అక్రమ దందా యథేచ్ఛగా సాగనుంది.
నిజాయితీపై వేటు!
Published Fri, Sep 22 2017 10:12 PM | Last Updated on Fri, Sep 22 2017 11:13 PM
Advertisement