మంత్రిని శాసిస్తున్న గ్రానైట్ మాఫియా !
- ఓవర్‌లోడ్ జరిమానా 1+5 నుంచి 1+1కు తగ్గించిన కేటీఆర్
- ఆ మేరకు చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ
- కేటీఆర్ సూచనలు గ్రానైట్ మాఫియా బేఖాతర్
- కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వైనం
- అధికారంలో ఏ పార్టీ ఉన్నా గ్రానైట్ మాఫియాదే రాజ్యం
- గతంలోనే చెక్‌పోస్టులను ఎత్తేయించుకున్న వైనం
- రాత్రి పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ కు రైట్‌రైట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రానైట్ మాఫియా జిల్లాను శాసిస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గ్రానైట్ మాఫియాదే రాజ్యం అన్నట్లుగా తయారైంది. వందల సంఖ్యలో గుట్టలను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి, ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గ్రానై ట్ మాఫియా ఓవర్‌లోడ్ పేరుతో సర్కారు ఖజానాకు గండి కొట్టిన మొత్తాన్ని జరిమానాతోసహా రూ.792 కోట్లు చెల్లించాల్సిందేనంటూ మైనింగ్ విజిలెన్సు అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. జరిమానా చెల్లించే వరకు పర్మిట్లు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయిస్తే ఉలిక్కిపడ్డ కొందరు గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు.
రాష్ట్ర మున్సిపల్, ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు గ్రానైట్ వ్యాపారులు ప్రయత్నించినట్లు సమాచారం. ఇసుక, గ్రానైట్ అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్న కేటీఆర్ తొలుత గ్రానైట్ వ్యాపారులకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. కొంద రు మంత్రులు, అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతల విజ్ఞప్తి మేరకు గ్రానైట్ వ్యాపారులకు అపాయిట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రానైట్ సంక్షోభం ఏర్పడిందని, విజిలెన్సు అధికారులు నిర్ధారించిన 1+5 జరిమానా చెల్లించలేమని ఆ మొత్తాన్ని తగ్గించాలని గ్రానైట్ వ్యాపారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ జరిమానా మొత్తాన్ని 1+1(సుమారు రూ.262 కోట్లు)కు కుదించారు. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అసలు జరిమానా మొత్తాన్ని చెల్లించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపని గ్రానైట్ వ్యాపారులు మంత్రి నిర్ణయాన్ని బేఖాతర్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ఏకంగా స్టే తెచ్చుకోవడం విశేషం. ఈ విషయంలో గ్రానైట్ వ్యాపారులకు మైనింగ్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులే సహ కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పట్టపగలే ఓవర్‌లోడ్‌కు రైట్‌రైట్ !
గ్రానైట్ ఓవర్‌లోడ్, ఇసు క అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్ చేసిన ఆదేశాలు జిల్లాలో అమలు కావడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరీంనగర్ పట్టణ నడిబొడ్డునుంచి నిత్యం వందలాది వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళుతున్నా.. అధికారులు పెద్దగా పట్టించుకోవం లేదు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు సైతం నామమాత్రంగా మారాయి. ఈ విషయంలో కొందరు అధికారులు గ్రానైట్ వ్యాపారులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా ఒక్కో లారీకి లక్షలాది రూపాయలు అమ్యామ్యాలు తీసుకున్నట్లు సమాచారం.