‘నెట్’లో పడొద్దు | don't spent more time on internet | Sakshi
Sakshi News home page

‘నెట్’లో పడొద్దు

Published Mon, Nov 24 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM

‘నెట్’లో పడొద్దు

‘నెట్’లో పడొద్దు

ఇంటర్నెట్‌లో విహారం
శ్రుతిమించుతున్న వినియోగం
సమాచార సిండ్రోమ్ బారిన యువతరం
నిద్రలేమి, మానసిక ఇబ్బందులతో సతమతం
సామాజిక వెబ్‌సైట్లతో సరికొత్త సమస్యలు

 
వాట్సప్.. ఫేస్‌బుక్.. ట్విట్టర్.. వైబర్.. లైన్.. టాక్‌రే.. స్కైప్.. ఇవన్నీ యువతరం నిత్యం పఠిస్తున్న మంత్రాలు. టూజీ పాతబడిన తర్వాత.. త్రీజీ, ఫోర్‌జీ, ఆండ్రాయిడ్‌ల ఆగమనంతో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం.. సామాజిక మాధ్యమాలతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయింది. పట్నం, పల్లె తేడా లేదు.. పదిహేనేళ్ల పిల్లాడి నుంచి పండు ముసలి దాకా అందరి చేతుల్లో సెల్‌ఫోన్ హల్‌చల్ చేస్తోంది. ఇక స్మార్ట్‌ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింత విస్తృతమైంది. ఈ తరహా ఆధునిక విజ్ఞానం ఎంతటి మేలు చేస్తుందో.. అతిగా వాడితే అంతటి హానీ చేస్తోంది. యువతీయువకులు గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లోనే గడిపేస్తున్నారు. దీంతో  పలు మానసిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.       

జిల్లాకేంద్రానికి చెందిన 25ఏళ్ల ఓ యువకుడు నిత్యం 8గంటలు సామాజిక సంబంధాల సైట్స్, మొబైల్ చాటింగ్‌లో గడిపేవాడు. రాత్రి 2గంటలైనా కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, మొబైల్‌తో గడిపేవాడు. దీంతో నిద్రలేమి, ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొన్నాడు. తన ఫేస్‌బుక్ షేరింగ్‌లకు లైక్స్ ఎక్కువగా రాకపోవడం కూడా అతన్ని మానసికంగా కుంగదీసింది. అలా ఇంటర్నెట్ వలలో చిక్కి.. సమాచార సిండ్రోమ్ బారిన పడ్డాడు. తల్లిదండ్రులు గుర్తించి సరైన సమయంలో మెడికల్ కౌన్సెలింగ్ ఇప్పించడంతో కుదుటపడ్డాడు.  ఇలాంటి సమస్యలను చాలామంది యువతీయువకులు ఎదుర్కొంటున్నారు. నేటియువతలో చాలామందిని ఇంటర్నెట్ ఫోబియా పట్టుకుందని.. దీంతో సమాచార సిండ్రోమ్ బారిన పడుతున్నారని మానసిన వైద్య నిపుణులు చెబుతున్నారు. అవసరం మేరకు వినియోగిస్తే పర్వాలేదు గానీ.. శ్రుతిమించితే ఏదైనా అనర్థమేనని హెచ్చరిస్తున్నారు.
 
బోర్ కొట్టిందంటే చాలు
ప్రస్తుతం సెల్‌ఫోన్ లేని వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రతీ మనిషి ఒక రోజు కనీసం అర గంట నుంచి ఆరు గంటలపాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో దానిపై ఆధారపడక తప్పడం లేదు. ఇది కాస్త శ్రుతిమించడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. కాస్త బోర్ కొట్టిందంటే చాలు సెల్‌ఫోన్ బయటకు తీసి ఇంటర్నెట్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో గంటలు గడిపేస్తున్నారు. వినియోగానికి అనుగుణంగా నెట్‌వర్క్ కంపెనీలు కాల్ రేట్లు తగ్గిస్తూ.. తక్కువ నగదుకు ఇంటర్నెట్‌లో సేవలు అందిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ ఉన్నవారైతే వాటిని మురిపెంగా చూసుకుంటున్నారు. చిన్నపిల్లలు సైతం సెల్‌పోన్ వినియోగానికి అలవాటు పడుతున్నారు.
 
నిద్రలేమి పెద్ద సమస్య
మనిషి సగటున ఎనిమిది గంటలైనా నిద్రపోవాలనేది వైద్యులు చేప్పే మాట. కానీ నేడు యువత, ఉద్యోగులు ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మెలకువగా ఉండేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేని రోజుల్లో సాయంత్రం ఆరు గంటలకు భోజనం చేసి 7 గంటలకు నిద్రపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి ఆ రోజు దినచర్యను ప్రారంభించేవారు. ప్రసుత్తం ఎక్కువ మంది ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోతున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. రాత్రి 11-12 గంటల దాకా చాటింగ్ చేస్తున్నవారు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తహీనత బారిన పడుతున్నారని వైద్యుల అంచనా.
 
తెల్లవారకముందే సందేశాలు
త్రీజీ సేవలు అందుబాటులోకి రావడంతో వినియోగం మరింతగా పెరిగిపోయింది. తెల్లవారకముందే వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక సైట్లలో గుడ్‌మార్నింగ్‌లు చెప్పేసుకుంటున్నారు. వారి అభిప్రాయాలు, అనుభూతులు, చిత్రాలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇంతవరకు పర్వాలేదు. కానీ.. అసలు సమస్య మొదలయ్యేది అక్కడే. గంటల కొద్దీ చాటింగ్ చేయడం, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
 
ఏదైనా షేర్ చేయడమే
ప్రస్తుతం కుర్రకారు తీరు పూర్తిగా మారి పోయింది. కొత్తగా జీన్ ప్యాంట్ కొన్నాను, కొత్త డిజైన్, బ్రాండెడ్ ఐటం బాగుందా.. అంటూ తాము కొన్న వాటిని ఫొటో తీసి వెంటనే సామాజిక వెబ్‌సైట్‌లలో షేర్ చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా,  ప్రయాణం చేస్తున్నా, పని చేస్తున్నా సెల్ఫీలు తీసుకుని షేర్ చేస్తున్నారు. కేవలం లైక్‌ల కోసమే పోస్టింగ్‌లు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తర్వాత తన షేరింగ్‌కు ఎన్ని లైకులు వచ్చాయో చూసుకుంటున్నారు. అనుకున్నంత స్పందన రాకపోయినా, తమను స్నేహితులుగా అంగీకరించక పోయినా బాధపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ‘సమాచార సిండ్రోమ్’ వ్యాధి బారిన పడే పరిస్థితులు నెలకొంటాయని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వీడియో గేమ్స్
పిల్లలు, పెద్దలకు వీడియో గేమ్స్ ప్రియంగా మారాయి. నిద్ర, చదువులను మానుకుని మరి.. గేమ్స్ ఆడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం వేలాది వేలాది గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్‌లో కూడా సరికొత్త గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది పగలు పాఠశాలలకు వెళ్లడంతో చిన్నారులకు సమయం దొరకడం లేదు. దీంతో రాత్రిళ్లు ఎక్కువ సమయం గేమ్స్ ఆడడానికే కేటాయిస్తున్నారు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెద్దలూ గేమ్స్ మాయలో పడుతున్నారు. ఇటీవల క్యాండీక్రస్ పేరుతో ఓ గేమ్ అందరిలోనూ ‘సెగ’ పుట్టిస్తోంది. రిక్వెస్ట్‌లు, లాక్‌లు, స్టేజీ సతమతం చేస్తున్నాయి.
 
అవసరం ఉన్నంత మేరకే
యువతతోపాటు పెద్దలూ సరదా కోసమంటూ చాటింగ్‌లో ఊబిలోకి దిగుతున్నారు. ఫేస్‌బుక్‌లో అవసరం ఉన్నా.. లేకపోయినా వచ్చిన ప్రతి లైక్‌కు రిప్లయిలిస్తూ.. 60 శాతం అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు సమస్యలు ప్రారంభమవుతాయి. ఆదిలోనే వీటిని అరికడితే మంచిది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలి.
 
స్వీయ నియంత్రణ ఉండాలి
ఫేస్‌బుక్ ఉపయోగించడం తప్పుకాదు. ట్విట్టర్స్‌ను ఫాలో అవడం నేరం కాదు. కానీ దాన్ని ఉపయోగించే తీరే యువతను ప్రభావితం చేస్తోంది. రోజు మొత్తంలో కాసేపైతే పర్వాలేదు కానీ.. అదే జీవితమైతే మాత్రం అనర్థం పొంచి ఉన్నట్లే. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిది. దీంతో సమస్యలను అరికట్టవచ్చు. సరదా.. వ్యసనంగా మారిన తర్వాత ప్రమాదాలకు దారి తీస్తాయని గుర్తించాలి.
 
తల్లిదండ్రులకు సూచనలు
పిల్లలను తల్లిదండ్రులు ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
వారి సంతోషాలు, బాధలను గుర్తించాలి.
ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అప్రమత్తమై వారితో మాట్లాడి వారి సమస్య ఏమిటో గుర్తించి పరిష్కరించాలి.
అధిక సమయం ఇంటర్నెట్, ఫేస్‌బుక్ చాటింగ్‌లో ఉన్నారని తెలిస్తే వారికి ప్రేమగా నచ్చజెప్పాలి.
చిన్నపిల్లలను ఈ సాంకేతిక మాయాజాలంలోకి తీసుకరాకపోవడమే మంచిది. అవసరం మేరకే వినియోగించుకునేలా చూడాలి.
 
మానసిక సమస్యలు

సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌లను అతిగా వినియోగించడం వల్ల నిద్రలేమి, ఎసిడిటీ, అనవసరంగా ఆందోళన పడటం తదితర శారీరక, మానసిక సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం జీవన విధానంపై పడుతుంది. మనిషికి కనీసం రోజుకు ఎనిమిది గంటలు నిద్ర అవసరం. టీవీలు, చాటింగ్‌లు తగ్గించుకుని రాత్రిళ్లు త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే మేలు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు పాటించడం మంచిది.
- డాక్టర్ బి. కేశవులు, మానసిక వైద్యనిపుణుడు, నిజామాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement