సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ప్రజలు ‘నెట్’లోకంలో మునిగితేలుతున్నారు. గంటలకొద్దీ డిజిటల్ ప్రపంచంలో విహరిస్తూ ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారు. ఆధునిక సాంకేతికతను అవసరానికి మించి వాడుతూ శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, సోషల్ మీడియా... ఇలా డిజిటల్ మాధ్యమాలతో రోజుకు ఏడు గం టల చొప్పున ఏడాదికి సరాసరిన 1,800 గంటలపాటు కుస్తీ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ మార్కెటీర్ అనే సంస్థ ఇటీవల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా సుమారు 50 వేల మంది అభిప్రాయాలు సేకరించి అధ్యయన వివరాలు ప్రకటించింది.
చేతిలో నిరంతరం స్మార్ట్‌ఫోన్‌తో దర్శనమిచ్చే యువత... ఖాళీ సమయాల్లో డిజిటల్ మాధ్యమాలతో కుస్తీ పడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి సెల్‌ఫోన్ టచ్ చేస్తూ అప్‌డేట్స్ చూసుకుంటున్నట్లు అధ్యయనం తెలి పింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్ తమ జీవితంలో విడదీయరాని భాగంగా మారిందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. టీనేజర్లలో 50% మంది డిజిటల్ ఎడిక్షన్‌కు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే డిజిటల్ అడిక్షన్‌తో పలు శారీరక, మానసిక సమస్యలతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది.
డిజిటల్ వర్రీ..
క్షణం తీరికలేకుండా స్మార్ట్‌ఫోన్‌తో గంటలతరబడి కాలక్షేపం చేస్తున్న మెట్రో నగరవాసులకు కొత్త చిక్కులొచ్చాయి. నిరంతరాయంగా వాట్సాప్‌లో చాటింగ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటిలో అప్‌డేట్స్ కోసం రెప్పవాల్చకుండా స్మార్ట్‌ఫోన్ వైపు దృష్టిసారిస్తుండడంతో మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు తేలింది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌ను చేతిలో పట్టుకొని సరిగా కూర్చోకుండా చాటింగ్ చేయడం, అధిక సమయం చాటింగ్‌లోనే గడిపేస్తుండటంతో వెన్నెముక డిస్క్ లు ఒత్తిడికి గురై పలువురు వెన్నునొప్పులతో బాధపడుతున్నట్లు పేర్కొంది. చాటింగ్ సమయం లో భుజం, తల, మెడ కండరాలు అధికంగా ఒత్తిడికి గురై బిగుసుకుపోవడంతోనే ఇవి తలెత్తుతున్నాయని, ఛాతీ కండరాలూ పలుమార్లు బిగుసుకుపోతున్నట్లు వైద్యులను ఉటంకిస్తూ పేర్కొంది.
చిన్నారులూ బాధితులే....
అధిక గంటలు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడే చిన్నారులు సైతం మెడ, వెన్నునొప్పులతో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్‌లో గేమ్స్ ఆడే సమయంలో సోఫాలు, మంచాలు, కుర్చీల్లో సరిగా కూర్చోకపోవడం వల్ల శారీరక కదలికలు లేక జీవనక్రియల్లో సమతౌల్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించింది
అనర్థాలివే: మెడ నొప్పులు, వెన్నెముక డిస్క్‌లు ఒత్తిడికి గురై నొప్పులతో సతమతమవడం, నరాలు బిగుసుకుపోవడం, చేతివేళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, స్పర్శకోల్పోవడం, జీవన క్రియలు మందగించ డం, వెన్నునొప్పులు, నిద్రలేమి, తుంటికండరాలు పట్టేయడం.
శ్రుతి మించితే వైద్యులను సంప్రదించాల్సిందే.
చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ వినియోగం దురలవాటు గా మారితే తప్పకుండా సైకియాట్రిస్ట్‌లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫోన్ హాబీ ఇటీవలి కాలంలో 5 రెట్లు పెరిగిందని సైకాలజిస్టులు చెబు తున్నారు. పిల్లలకు ఫోన్లను సరదా కోసం ఇస్తున్న తల్లిదండ్రులు... అది వారికి దురలవాటుగా మారి నప్పుడే కళ్లు తెరుస్తున్నారని చెబుతున్నారు. చాలా మంది మాట్లాడటం కంటే ఫోన్ చాటింగ్‌కే ప్రాధాన్యతనిస్తున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫోన్ హాబీ శ్రుతి మించి దురలవాటుగా మారితే చిన్నారుల మెదడు కణాలూ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామం, ఆటల ద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఆటలకు దూరమై ఫోన్లు, ట్యాబ్లెట్లతో కుస్తీపట్టే చిన్నారులు తీవ్ర ఆవేశకావేశాలకు గురవడంతోపాటు వారిలో క్రమంగా హింసా ప్రవృత్తి పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు.
ఇలా చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం
►స్మార్ట్‌ఫోన్లు వినియోగించే సమయంలో తరచూ బ్రేక్ తీసుకోవాలి. శరీర కదలికలు ఉండేలా చూసుకోవాలి.
►మెడను వంచకుండా స్మార్ట్‌ఫోన్ తెరను చూడాలి.
►నొప్పులు అధికమైతే న్యూరోసర్జన్‌లు, ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment