అతుక్కుపోతే.. అంతే సంగతులు?
టీనేజర్లు, పెద్దవాళ్లు రోజుకు ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే టీవీలు చూడటం, వీడియోగేములు ఆడటం వంటివి చేయాలి. ఎక్కువ సమయాన్ని ఔట్‌డోర్ గేమ్స్ ఆడుతూ, పుస్తకాలు చదువుతూనో గడపాలి.
సాక్షి: కంప్యూటర్, వీడియో గేమ్స్‌ను ఎక్కువ సేపు ఆడుతూ.. చైనాలోని టీనేజర్లు ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ అలవాటు ప్రమాదకరస్థాయికి చేరిందని తెలిపింది. సరైన వేళకు తినడం, నిద్రపోవటం కూడా మర్చిపోయి గంటలకొద్ది వీడియోగేమ్స్, టీవీలు చేసే టనేజర్లపై వివిధ దుష్ర్పభావాలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోయే టీనేజర్లకు కూడా ఇది వర్తిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ విధంగా ప్రమాదకరస్థాయిలో ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు బానిసైన టీనేజర్లకు చైనాలోని డాక్టర్లు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పరిచి..నెలల కొద్ది ఎలాంటి మీడియాను వారికి అందుబాటులో ఉంచకుండా ఉంచి.. డ్రాకోనియన్‌థెరపీ ద్వారా వారిని తిరిగి మూములుగా తయారుచేస్తున్నారు.
ఇటీవల కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలో 8-10 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలు.. రోజుకి సుమారు 8 గంటలసేపు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీ..ఇలా వివిధ రకాల మీడియా ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారని తేలింది. టీనేజర్లు,పెద్దవారయితే రోజుకు 11 గంటల సమయాన్ని వీటి ముందు గుడుపుతున్నారని వెల్లడైంది. రెండేళ్లలోపు పిల్లలను టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ముందు ఉంచకూడదు. ఈ కాలంలో వారి మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పసిపిల్లలు తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునేంత బాగా, ఎలక్ట్రానిక్ స్క్రీన్‌ల ద్వారా నేర్చుకోలేని అధ్యయనం పేర్కొంది. ఎలక్ట్రానిక్ మీడియాను ఎక్కువగా ఉపయోగించటం వల్ల పిల్లల ప్రవర్తన, ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావాలుంటాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రభావాలు:
⇒టీవీలో హింసాత్మక కార్యక్రమాలు, వయలెంట్ వీడియో గేమ్‌లు ఎక్కవ సేపు ఆడే పిల్లలపై వీటి ప్రభావంగా ఎక్కువగా ఉంటోందనీ, క్రమక్రమంగా వారి ప్రవర్తన క్రూరంగా, హింసాత్మకంగా మారి, స్నేహితులు, ఉపాధ్యాయులతో దురుసుగా ప్రవరిస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొంది.
⇒అధిక సమయం టీవీ ముందు కూర్చోవటంతో బద్దకం, స్థూలకాయం వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువ.
⇒ఎక్కువ సమయం టీవీ చూడటం, వీడియో గేములు ఆడటం కారణంగా చదవటం, హోమ్‌వర్క్ చేయటం వంటి కార్యక్రమాలపై ప్రభావంపడి చదువులో వెనకడిపోయే ప్రమాదముంది.
⇒ఎక్కువగా ఎలక్ట్రానిక్ స్క్రీన్‌కు అతుక్కుపోయే పిల్లలు మల్టీటాస్కింగ్ నేచర్‌కు అలవాటుపడుతున్నారు. అయితే ఈ స్వభావం ఒకే విషయంపై దృష్టిపెట్టే లక్షణాన్ని కోల్పోయేటట్టు చేస్తుందని, ఇది భవిష్యత్తులో జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లును ఎదుర్కొనేందుకు ఇబ్బందిగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
⇒ఎలక్ట్రానిక్ స్క్రీన్ ద్వారా ఎక్కువగా కమ్యూనికేషన్ నెరిపే పిల్లలు ఒంటరితనాన్ని ఫీలయ్యే అవకాశంగా అధికంగా ఉండి డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదముందని అధ్యయనం పేర్కొంది.
⇒స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్..ఇలా స్క్రీన్లకు అతుక్కుపోయే టీనేజర్లకు చేతివేళ్లు, మణికట్టు నొప్పులు రావటం, కళ్లు, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో తరచూ బాధపడుతంటారని అధ్యయనం తెలిపింది.