కందుకూరు రూరల్ : ఇంట్లో బుజ్జిగాడు అన్నం తినాలంటే సెల్ ఫోన్‌లో ఒక ఫన్నీ వీడియో.. చిట్టిది ఏడుస్తూ మారాం చేస్తుంటే స్మార్ట్ ఫోన్‌లో ఓ డీజే సాంగ్.. పిల్లలు అరిచి గోల చేస్తుంటే యూట్యూబ్‌లో ఏదో ఒక జంతువుల వీడియో చూపించడం.. ఇలా చిన్నతనంలో పిల్లలను ఆడిచేందుకు చేసిన అలవాటే ప్రస్తుతం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ముద్దుముద్దుగా మాట్లాడుతూ.. బుడిబుడి అడుగులు వేస్తూ.. స్కూల్‌కు వెళ్లే పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఫోబియా పట్టుకుంది. నాన్నా.. ఒకసారి ఫోన్ ఇవ్వవా...! అన్నయ్యా నీ ఫోన్‌లో ఒక గేమ్ ఆడుకొని ఇస్తా..! మమ్మీ.. నీ సెల్‌లో టెంపుల్ రన్ ఆడుకొని హోంవర్క్ చేసుకుంటానే.. బయటకు వెళ్లను ఇంట్లోనే ఉంటా..! అంటూ పిల్లలు మారాం చేయడం తల్లిదండ్రులందరికీ అనుభవమే. ఇలా ఫన్నీ వీడియోలతో సెల్ ఫోన్ వాడటం మొదలుపెడుతున్న పిల్లలు క్రమంగా యూట్యూబ్‌లో అశ్లీల దృశ్యాల వరకు వెళ్తూ పక్కదారి పడుతున్నారు.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. రోజూ స్కూలుకు వెళ్లి ఇళ్లకు వచ్చిన వెంటనే పిల్లలు సెల్‌ఫోన్ కావాలని నానాయాగీ చేస్తున్నారు. దొరికితే స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ లేదా టీవీల్లో కార్టూన్ చానల్స్ చూడటంలో నిమగ్నమవుతున్నారు. ఇవి ప్రస్తుతం పిల్లల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. దీని కారణంగా ఫిజికల్ గేమ్స్‌కు దూరమవుతున్నారు. కనీసం ఇంటి పక్కన ఉన్న స్నేహితులతోనైనా ఆడుకోలేని పరిస్థితుల్లో చిన్నారులు ఉన్నారు. ఇల్లు విడిచి ఆటల్లో మునిగిపోయిన చిన్నారులను వెతికి తీసుకువచ్చే రోజులు పోతున్నాయి. నేడు పిల్లలను బటయకు వెళ్లి ఆడుకోమని తల్లిదండ్రులు చెప్పినా ఇంట్లో నుంచి కదలని పరిస్థితి. పల్లెల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. అందులో ఆటల్లో మునిగి తేలుతున్న చిన్నారులు, ప్లే గ్రౌండ్ మరిచిపోయి ప్లేస్టోర్‌కే పరిమితమవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతున్న క్రమంలో స్కూల్ పిల్లలు, యువతీయువకులు క్రీడా మైదానాన్ని మరిచిపోతున్నారు. అతిగా వినియోగిస్తే ముప్పు అని విశ్లేషకులు చెతున్నప్పటికీ తల్లిదండ్రులు కూడా పెడచెవిన పెట్టడం ఆందోళన కలిగించే అంశం.
వీడియో గేమ్స్‌పైనే ఆసక్తి
ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ నిండా వివిధ రకాల ఆటలు ఉంటున్నాయి. వీలైనన్ని గేమ్స్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. చిన్న పిల్లలకు చదువు కంటే ప్లేస్టోర్‌లోని ఆటలపైనే ఎక్కువ అవగాహన ఉంటోంది. చోటా బీమ్, హంగ్రీబర్డ్, క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్ వే సర్ఫ్, టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్‌ను చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడుకున్నారు. ఇక బోటింగ్, ట్రాఫికర్ రేసర్, టక్ ఫ్రూట్, డోరా, బబుల్ షూట్, కార్‌రేస్ లాంటి ఆటలు ఆడటం వల్ల పిల్లల్లో అనవసరమైన కసి పెరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గేమ్స్‌పై దృష్టి కేంద్రీకరించడంతో తామే స్వయంగా ఈ ఆటలు ఆడుతున్నామనే అనుభూతికి పిల్లలు లోనవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారనో, గోల చేస్తున్నారనో సెల్‌ఫోన్ ఇవ్వడం వల్ల అది వారికి వ్యసనంగా మారుతోంది.
సాంఘిక జీవనానికి దూరమవుతున్నారు
స్మార్ట్ ఫోన్ల రాకతో తల్లిదండ్రులకు వాటితోనే పనైపోయింది. గేమ్స్ ఆడుతూ, వీడియోలు చూస్తూ పిల్లలకు అవే అలవాటు చేస్తున్నారు. పిల్లలు గోల చేసినా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే ఇంట్లో ఉన్న మనుషులను సైతం పిల్లలు మర్చిపోతున్నారు. కనీసం బంధువులు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనివల్ల మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. పిల్ల లు ఏడ్చినా, గోల చేసినా.. ఆరోగ్యకరమైన ఆటలకు దగ్గర చేయాలి. అంతే తప్ప స్మార్ట్ ఫోన్లకు అలవాటు చేస్తే అరోగ్యం దెబ్బతినడంతోపాటు మానసికంగా కుంగిపోతారు.– పి.పాపారావు, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
మానసికంగా ఇబ్బంది పడతారు
ప్రస్తుతం టచ్ ఫోన్ పట్టుకుంటే చాలు పిల్లలు నేరుగా గేమ్స్ లేదా యుట్యూబ్‌లోకి వెళ్తున్నారు. యుట్యూబ్‌లో అశ్లీల వీడియోలు అధికంగా ఉంటున్నాయి. యాప్ ఓపెన్ చేయగానే అలాంటి బొమ్మలు, దృశ్యాలు కన్పిస్తుండడంతో చిన్నారులు వాటిపై ఆసక్తి చూపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఫోన్లు తీసుకొచ్చి ఏంటి ఇవి వస్తున్నాయని తల్లిదండ్రులనే అడుగుతున్నారు. గేమ్స్ ఆడటం వల్ల పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. పిల్లల రుగ్మతలు మానసిక నిపుణులకు కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. – ఇ.ఆనందరావు, హెచ్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment