స్మార్ట్‌ఫోన్.. ఈ పేరు ఎత్తగానే పిల్లలు మంచి క్రేజీగా ఫీలవుతారు. ఆన్‌లైన్ గేమ్స్.. ఈ పేరు వింటే ఎగిరి గంతేస్తుంటారు. స్మార్ట్‌ఫోన్ కనిపిస్తే చాలు చటుక్కున చేతిలోకి తీసుకోవడం నేటి పిల్లలకు పరిపాటి. ఆన్‌లైన్‌లో గేమ్స్ డౌన్‌లోడ్ చేయడం, గంటల తరబడి ఆడుకోవడం.. ఏ ఇంట్లో చూసినా ఇదే తంతు. ఒక్కప్పుడు టీవీలు, కంప్యూటర్లలోనే ఆడగలిగిన వీడియోగేమ్స్.. కాలక్రమంలో అనేక రకాలుగా రూపాంతరం చెంది క్రమంగా మామూలు ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లలోకి దూరిపోయి ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారిపోయాయి.
చాలామంది పిల్లలకు వీడియో గేమ్స్ ఆడటం ఇటీవల కాలంలో ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రధానంగా 10 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. అది ఎంత తీవ్రంగా మారిందంటే తల్లిదండ్రులు వీడియో గేమ్స్ ఆడనివ్వడం లేదని అలిగి ప్రాణాలు తీసుకునేంతలా..! వీడియో గేమ్స్‌కి ఇప్పుడు పిల్లలు బానిసలుగా మారిపోతున్నారని ప్రపంచంలోని అనేక రీసెర్చ్ సంస్థలు చేసిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సైతం పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బ్రిటన్, అమెరికా, భారత్ దేశాల్లో చాలా మంది పిల్లలు వీడియో గేమ్స్ వ్యసనాల బారిన ఇప్పటికే పడ్డారని, మరికొంతమంది ఆ వ్యసనానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారుతుండటంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రముఖంగా ఉంది.వారి అల్లరిని తట్టుకోలేక తల్లిదండ్రులు సైతం పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు కోరిన వీడియో గేమ్‌లను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి మరీ ఈ విషయంలో వారికి సహకరిస్తున్నారు. అయితే వీడియో గేమ్స్‌కు ఎక్కువగా అలవాటు పడుతున్న పిల్లల్లో మానసిక ప్రవర్తన ప్రతికూలంగా మారుతుందని సైకియాట్రిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో గేమ్స్‌కి బానిసలుగా మారుతున్న పిల్లలు చదువుతో పాటు ఇతర విషయాలపై అసలు శ్రద్ధ పెట్టడం లేదని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు వారికి ఉన్నఫళంగా మొబైల్ ఇవ్వకుండా మానేస్తే పిల్లలు విపరీత చర్యలకు పాల్పడుతున్నారు. అయితే ఫోన్ ఇవ్వాలనే ఆలోచన మాకు లేకపోయినా వారి అల్లర్లను తట్టుకోలేకే వారికి ఫోన్లు ఇస్తున్నామని కొందరు తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. దీనివల్ల పిల్లలకు ఇబ్బందులు వస్తాయని తెలిసినా తప్పడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలను మొబైల్ ఫోన్లు, అందులో ఉండే గేమ్స్‌కి దూరంగా ఉంచడం ఎలా? ఇది చాలామంది తల్లిదండ్రులను వేధించే ప్రశ్న. కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే పిల్లలను వీడియో గేమ్స్‌కి బానిసలుగా కాకుండా చూడవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
అతిగా ఆడితే నష్టమే..
వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడే పిల్లలు మానసిక సమస్యలు, డిప్రషన్‌తో బాధపడుతున్నట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.వీటికి ట్రీట్‌మెంట్ అంటే ఇతర వ్యసనాల కంటే భిన్నంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీరికి ఇంటర్నెట్‌ను పరిమితంగా వాడుకోవడం నేర్పించాలి. టెక్నాలజీతో మానవాభివృద్ధికి ఎన్నిరకాల ఉపయోగాలు ఉంటాయో అంతవరకే వాటిని ఉపయోగిస్తూ గేమ్స్ డేటా వంటివాటిని పరిమితంగా వాడుకుంటేనే బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్ల్లలు అదే పనిగా వీడియో గేమ్స్ ఆడుతుండటాన్ని గమనిస్తే అది ఒక వ్యసనంగా వారికి మారుతున్నట్లు గుర్తించాలి. పూర్తిగా పరిసరాలను మర్చిపోయి అందులో లీనమైపోవడం ఒక రకమైన మానసిక సమస్యగా పరిగణించాలంటున్నారు నిపుణులు. రోజంతా సెల్‌ఫోన్ల ముందు కూర్చొని గేమ్స్ ఆడుతున్న పిల్లల్లో మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలు ఎప్పుడు చూసినా అదే పనిగా ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో గేమ్స్ ఆడటాన్ని మానసిక సమస్యలుగా పరిగణించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ సమయం వీడియో గేమ్స్‌కు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఇంకా మతిమరుపు వంటి రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి. తదేకంగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల కంటి చూపుపై ఒత్తిడి పెరిగి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అలాగే వీడియో గేమ్స్‌లో చూపెడుతున్న మితిమీరిన యాక్షన్, అశ్లీల దృశ్యాలు చిన్నారులను పెడదోవ పట్టించే అవకాశాలున్నాయి. అతిగా వీడియో గేమ్స్ ఆడటం వల్ల చిన్నవయసులోనే రక్తపోటు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడడం వల్ల మూర్ఛ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యసనం వల్ల అనారోగ్యమే కాకుండా..పిల్లల్లో హింసా ప్రవృత్తి, దూకుడుతనం ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంకా..జీవక్రియ వేగం పెరగటం, చేతులకు ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ‘ లాంటి సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
‘గేమ్స్’ బాధితుల కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్
భారత్‌లో గేమ్స్ మార్కెట్ నాలుగు రకాలుగా విస్తరించింది. అవి పీసీ గేమ్స్, ఆన్‌లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్, కన్సల్ గేమ్స్. వీటికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. 2018 నాటికి ఇవి 40 బిలియన్ డాలర్లు దాటింది. గ్లోబల్ మార్కెట్‌లో ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లను మించి వ్యాపారం జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ మార్కెట్‌లో అమెరికా, యూరప్ దేశాలతో పాటు జపాన్ ప్రథమ స్థానంలో ఉండగా, చైనా, భారత్‌ల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. పర్సనల్ కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో మేరియన్ టెట్రిస్ వంటి సాధారణ స్థాయి గేమ్స్ అందరినీ అలరించాయి. అప్పట్లో గ్రాఫిక్స్ పరిమితంగా ఉండేవి. కాలక్రమంలో మెరుగైన గ్రాఫిక్స్‌తో 2డీ, యానిమేషన్స్ ఇలా రూపాంతరం చెందాయి. నేడు ఫొటో రియలిస్టిక్, 3డీ గేమ్స్ వచ్చాయి. కంప్యూటర్‌లో ఉండే బీప్ అనే శబ్దంతో ఆరంభమై నేడు మ్యాజిక్, సౌండ్స్‌తో అలరిస్తున్నాయి. ఈ పాత గేమ్స్‌లో ఆటను కొద్దిసేపు గమనిస్తే చాలు గెలవడం తేలిగ్గానే ఉండేది. ఇప్పటి గేమ్స్ అలా కాదు. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆడినా కంప్లీట్ కావు. ఒక్క అమెరికాలోనే కోటి మందికి మించి ఇంటర్నెట్ గేమ్స్‌కు బానిసలుగా మారిపోయారు. కొరియాలో అయితే ఇలాంటి వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లు విచ్చలవిడిగా వెలిశాయి. చైనా, జపాన్, తైవాన్‌లోనూ ఈ గేమింగ్ విపరీతంగా కనిపిస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఇంటర్నెట్ ఎడిక్షన్ డిజార్ట్ సమస్య ఉన్న దేశాలు చాలానే ఉన్నాయి.
గేమ్స్ ఆడనివ్వడం లేదని ఇటీవల పిల్లలు పాల్పడిన దుశ్చర్యలు
- ఎక్కువ సేపు సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నాడని తండ్రి మందలించడాన్ని తట్టుకోలేక గతేడాది ఢిల్లీలో ఓ బాలుడు (15) తన తండ్రి పడుకున్నప్పుడు గొంతునులిమి చంపేశాడు
- గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో కోపం తట్టుకోలేక గతేడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లో ఓ బాలుడు తన తల్లిదండ్రులను కత్తితో తీవ్రంగా గాయపర్చాడు
- వీడియో గేమ్ ఆడుకుంటుండగా తన సోదరి సెల్‌ఫోన్ లాక్కుందనే కోపంతో ఆమెపై బ్లేడుతో ఓ బాలుడు దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో జరిగింది
- సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నాడని తండ్రి మందలించడంతో బెంగళూరులోని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు ఇంటి నుంచి సెల్‌ఫోన్ తీసుకుని పారిపోయాడు
తల్లిదండ్రులు ఏం చేయాలి?
- కొన్ని ఈ పేరెంటింగ్ టిప్స్ ద్వారా పిల్లల ఆలోచనలను మార్చవచ్చు.
- ఇంటికి కొన్ని నియమాలను రూపొందించాలి. ఉదాహరణకు ఎంతసేపు మొబైల్ వాడాలో పిల్లలకు పక్కాగా చెప్పాలి. పిల్లలతో మాట్లాడి ఇంటర్నెట్‌లో వాళ్లేం చూస్తున్నారో తెలుసుకోవాలి. వారి మీద వారికి తెలియకుండా నిఘా వేసి ఉంచాలి. ఎక్కువ సేవు గేమ్స్ ఆడుతున్నట్లు గానీ కనిపిస్తే వెంటనే వారికి అర్థమయ్యేటట్లు చెప్పి గేమ్స్ నుంచి వారి ఆలోచనలను వేరే అంశాలపైకి మరలేలా చర్యలు తీసుకోవాలి. ఏవో వీడియోలు, వెబ్‌సైట్లు చూసే బదులు సోషల్ మీడియాలో స్నేహితులతో గానీ బంధువులతో గానీ మాట్లాడమని సూచించాలి. ఏది కనిపిస్తే దానిపైన క్లిక్ చేయడం ప్రమాదకరమని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి.
- వారాంతాల్లో ఎక్కువ సమయం పిల్లలతో గడిపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే పిల్లలు గేమ్స్ అంటూ పక్కదారి పట్టబోరని పలు పరిశోధనాత్మక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
- పిల్లలకు సరిపడని వెబ్‌సైట్లు ఫోన్‌లో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చాలి. ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ప్రమాదకరమని తెలియజేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా, పిల్లలకు నేర్పే ముందు తల్లిదండ్రులు తమ అలవాట్లను మార్చుకోవాలి.
- పక్కి రాకేష్ పట్నాయక్, సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment