ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మహబూబ్‌నగర్ : కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధనకు అవకాశం లేని పరిస్థితి. అన్ని తరగతుల బోధన ఆన్‌లౌన్‌లోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఒకప్పుడు మొబైల్ పట్టుకుంటే తప్పు అని చెప్పే తల్లిదండ్రులే.. నేడు ఫోన్ చూడక తప్పదూ అనే ధోరణి నెలకొంది. ఆన్‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్‌లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఫోన్‌లు వారి చేతికి ఇచ్చి వారి పనులు వారు చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో విద్యార్థులు ఏం చూస్తున్నారు?ఏం విటున్నారు? అనే అంశంపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫోన్‌లో ఉండే నిషేధిత వీడియోలు, అపరిచితులతో పరిచయాలు తదితర అంశాలు విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తు పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలు చర్యలు తీసుకుంటే చిన్నారుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్ వినియోగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ఆన్‌లైన్ తరగతులపై పర్యవేక్షణ..
ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు రికార్డు చేయబడిన వీడియోలు టీసాట్‌తో పాటు నిపుణ వంటి తదితర వెబ్‌సైట్‌లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రతి రోజు చూసే విధంగా వెసలుబాటు ఉంటుంది. ఇందుకు సంబందించి షెడ్యూల్‌ను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సాప్, మెసేజ్‌ల రూపంలో పంపిస్తారు. వాటిని అనుసరించి తరగతులు వినాల్సి వస్తుంది. హోంవర్కు, వర్కుషీట్లు వంటివి పూర్తి చేయాలని సూచిస్తుంటారు. ఇక ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చాలా వరకు లైవ్‌గా, యాప్‌ల ద్వారా తరగతులు బోధిస్తున్నారు. అయితే, కొందరు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఏం చూస్తున్నారని పట్టించుకోవడం లేదు.
కరోనా నేపథ్యంలో తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మక్తల్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి తండ్రి ఆన్‌లైన్ తరగతుల కోసం సెల్‌ఫోన్ కొనిచ్చాడు. పాఠాలు విన్న తర్వాత కూడా మొబైల్ చేతిలో ఉండడంతో పలు గేమ్స్‌కు ఆడడం మొదలెట్టాడు. ఎక్కువ సేపు ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు సెల్‌ఫోన్ తీసుకోవడంతో సదరు విద్యార్థి మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తల్లిదండ్రులు అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది.
పరిశీలించాల్సినవి ఇవీ..
► పిల్లలు ఆన్‌లైన్ తరగతుల్లో సూచించినవే వింటున్నారా లేదా ఇతర అంశాల జోలికి వెళ్తున్నారా తప్పకుండా దృష్టిసారించాలి.
► గూగుల్, య్యూట్యూబ్‌లలో నిషేధిత వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌లతో కాలక్షేపం చేస్తుంటారు. ఆయా యాప్‌ల సెట్టింగ్స్‌లో హిస్టరీని పరిశీలిస్తే ప్రారంభం నుంచి ఏ టైమ్‌లో ఏం సెర్చ్ చేశారు, అవి తరగతులకు సంబంధించినవేనా అని తెలిసిపోతుంది. మరుసటి రోజు జాగ్రత్త పడొచ్చు.
► సోషల్ మీడియాకు, యాప్స్‌కు దూరంగా ఉంచాలి.
► ఎంత పనిలో ఉన్నా అప్పడప్పుడూ పిల్లల స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లో చేస్తున్న కార్యకలాలపై నిఘా వేయాలి.
► గాడ్జెట్లలో యాప్, గేమ్, ఇతర పైళ్లను డౌన్‌లోడ్లు చేయకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. అందుకు ప్రత్యేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడమో.. డివైజ్ సెట్టింగ్‌లను మార్చడమో చేయాలి.
► ఇంటర్‌నెట్‌లో అశ్లీల లింక్‌లు వాటంతటవే ఓపెన్ అవుతుంటాయి. వాటిపై నియంత్రణ విధించాలి.
► ఎవరైన వేధింపులు, బెదిరింపులకు దిగితే.. తక్షణమే సమచారం ఇచ్చేలా సూచనలు చేయాలి.
► చాలావరకు మీకు సమీప గదుల్లోనే ఫోన్లు, కంప్యూటర్లు ఉంచండి.
Comments
Please login to add a commentAdd a comment