సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం..
కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్‌లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు.
పాయింట్లతో బలపడతావంటూ...
ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు.
ఆపై అసలు కథ మొదలెట్టి..
కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది.
నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు..
ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు
యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి.
– కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ
(చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం)
Comments
Please login to add a commentAdd a comment