sons and daughters
-
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
కన్నీళ్లను దిగమింగుతూ..
ఉబికి వచ్చే కన్నీటిని కను రెప్పలతో అదిమి పడుతూ... తరుముకు వచ్చే దు:ఖాన్ని గరళంలో దిగమింగుతూ... ఏవో కారణాలు కావొచ్చు.. మరేవో విభేదాలు కావొచ్చు.. భర్తకు దూరంగా ఉంటూ... తన పిల్లల భవిష్యత్ కోసం బతుకు బండిని లాగడానికి.. కన్నీటి కడలిలో నావలా... రేయింబవళ్లు రెక్కలుముక్కలు చేసుకుంటోంది ఓ ఇల్లాలు. యుక్త వయస్సులో నయవంచకుల మాటలు నమ్మి మోసపోయి పెళ్లి చేసుకుని కొడుకును కన్నది. భర్త దరి చేరనీయకపోవడంతో కొడుకు పుట్టినప్పటి నుంచి కన్నవారి నీడనే ఆశ్రయం పొందుతోంది. కూలీ పనులు చేసుకుంటూ... బిడ్డను చదివిస్తూ.. ఎప్పుడు కట్టుకున్నవాడు కరుణించి దగ్గరకు తీసుకుంటాడో అనే నమ్మకంతో బతుకు వెళ్లదీస్తున్న మరో మహిళ కష్టాలు వర్ణణాతీతం. మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డికి చెందిన గాజుల సుజాత ఐదుగురు అక్కా చెల్లెళ్లలో చివరి సంతానం. ఆమెకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. కాలక్రమంలో అందరి పెళ్లిళ్లు అయ్యాయి. అందరిలాగే సుజాత కూడా జీవితంపై ఏవేవో బంగారు కలలు కన్నది. ఆమెకు కూతురు రచన, కుమారుడు దినేష్ ఉన్నారు. సంతోషంగా అందరిలా జీవించాలనుకున్నది. కాలం ఆమె జీవితంపై చిన్నచూపు చూసింది. ఏవో కొన్ని కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. కష్టాల సుడి గుండంలో చిక్కుకున్న సుజాత జీవితాన్ని గట్టెక్కించడానికి పుట్టింటివారు అండగా నిలిచారు. పుట్టినిల్లు మిరుదొడ్డిలోనే సుజాత తన పిల్లలతో కాలం వెళ్లదీస్తోంది. మిరుదొడ్డిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆమె పిల్లలు రచన 8వ తరగతి, దినేష్ 6వ తరగతి చదువుతున్నారు. పిల్లలు కూడా పరిస్థితులకు అణుగుణంగా మెదులుతున్నారు. తల్లి పడుతున్న అష్టకష్టాలను చూసి ఎక్కువ ఆడంబరాలకు పోకుండా శ్రద్ధగా చదువుకుంటున్నారు. పిల్లల భవిష్యత్ కోసం... వారికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటోంది. ఉండటానికి ఇల్లు లేక.. కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. బతుకు భారాన్ని తన భుజస్కందాలపై మోయడానికి సుజాత బీడీలు చుడుతోంది. వెన్ను నొప్పులు, మెడనరాల నొప్పు లు వంటి ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నా... సర్కారు దవాఖా నా మందులతో న యం చేసుకుంటూ దు:ఖాన్ని దిగమింగుతోంది. సమయం చిక్కినప్పుడల్లా వ్యవసాయ కూలీగా మారుతోంది. రెక్కలుముక్కలు చేసుకుని ఇల్లు గడవడానికి కష్టపడుతోంది. ఉపాధి కూలీ పనులు చేస్తూ పైసాపైసా కూడబెట్టుకుంటోంది. ఇంటి కిరాయి నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, నోటు బుక్కులు సమకూరుస్తోంది. పుట్టింటివారి నుంచి కొండంత అండ లభించడం ఆమెకు కాస్త ఊరటనిస్తోంది. లేదంటే తన బతుకు మరోలా ఉండేదని కన్నీటిపర్యంతమవుతోంది సుజాత. పిల్లల భవిష్యత్ కోసం పరితపిస్తున్న సుజాత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కన్నవారి నీడనే బతుకు.. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన గంగారపు స్వప్న, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. తరువాత పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసి ఇంటికి పంపించారు. అత్తారింట వేధింపులు భరించలేక పుట్టేడు దు:ఖంతో పుట్టింటికి చేరింది స్వప్న. ఆవేశంలో వెళ్లగొట్టినా... ఎప్పుడైనా ఆదరిస్తాడనే నమ్మకంతో పుట్టింటి నీడనే బతుకు వెళ్లదీస్తోంది. 15 ఏళ్ల క్రితం ఓ కొడుకు జన్మనిచ్చినా... తండ్రి దగ్గరకు తీయలేదు. ఆ తల్లీబిడ్డలను కనికరించలేదు. కూలీ పనులు చేసుకుంటూ కొడుకు సాదుకుంటోంది. న్యాయం కోసం తిరగని పోలీస్‌స్టేషన్ లేదు, అడగని అయ్యా లేడు. ఎక్కడా న్యాయం జరగలేదు. చివరి ప్రయత్నంగా వెంటెనెన్స్ కోసం కోర్టును ఆశ్రయించినా... కేసు కోర్టులోనే ఉంది. కనీపెంచిన అమ్మానాన్నలు బిడ్డ సంతోషంగా ఉండాలని ఎన్ని ప్రయత్నాలు చేసి ఫలించ లేదు. ఆమె తండ్రి వృద్ధుడు కావడంతో కుటుంబ పోషణ కష్టమవుతోంది. కూలీ పనులు చేద్దామంటే నడుం నొప్పి ఆమెను వేధిస్తోంది. ఇంటి దగ్గరనే ఉంటూ బీడీలు చేస్తూ కొడుకు సాదుకుంటోంది. ఆ దేవుడు కరుణించి బుతుకులు ఎప్పుడు మారుస్తాడని ఎదురు చూస్తోంది. మా ఒంటరి బతుకులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే కిరాణం కొట్టు పెట్టుకొని ఉపాధి పొందుతామని ఆశిస్తోంది స్వప్న. -
అలాంటి పిల్లలను ఇళ్ల నుంచి తరిమేయండి: కోర్టు
పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను తిడుతుంటే, వాల్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లనుంచి బయటకు గెంటేయొచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఇల్లు తాము కష్టపడి సొంతంగా కొనుక్కున్నదైనా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినా సరే పిల్లలను పంపేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని తెలిపింది. తల్లిదండ్రులకు ఆ ఆస్తి మీద చట్టపరమైన హక్కు ఉన్నంతకాలం వాళ్లు తమను తిట్టే కొడుకులు, కూతుళ్లను ఇంటినుంచి నిరభ్యంతరంగా గెంటేయొచ్చని చెప్పింది. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం, సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్ మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్లు, లేదా మానసికంగా వేధించే కొడుకులు, కూతుళ్లను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 32కు కావల్సిన సవరణలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్లి అయినా, అవ్వకపోయినా తల్లిదండ్రులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు, కూతుళ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండబోదని జస్టిస్ మన్ మోహన్ అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బాగున్నంత కాలం వాళ్ల ఇష్టం మేరకు కావాలంటే ఇంట్లో ఉండొచ్చని, అంతేతప్ప వాళ్లకు భారంగా ఉంటామంటే మాత్రం కుదరదని తెలిపారు.