అలాంటి పిల్లలను ఇళ్ల నుంచి తరిమేయండి: కోర్టు
పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులను తిడుతుంటే, వాల్లను నిర్దాక్షిణ్యంగా ఇళ్లనుంచి బయటకు గెంటేయొచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఇల్లు తాము కష్టపడి సొంతంగా కొనుక్కున్నదైనా, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినా సరే పిల్లలను పంపేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని తెలిపింది. తల్లిదండ్రులకు ఆ ఆస్తి మీద చట్టపరమైన హక్కు ఉన్నంతకాలం వాళ్లు తమను తిట్టే కొడుకులు, కూతుళ్లను ఇంటినుంచి నిరభ్యంతరంగా గెంటేయొచ్చని చెప్పింది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల జీవనం, సంక్షేమ చట్టంలో అంశాల గురించి వ్యాఖ్యానించే సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్ మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను శారీరకంగా హింసించేవాళ్లు, లేదా మానసికంగా వేధించే కొడుకులు, కూతుళ్లను తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం సీనియర్ సిటిజన్లకు లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు చట్టంలోని సెక్షన్ 32కు కావల్సిన సవరణలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది. కొడుకులకు పెళ్లి అయినా, అవ్వకపోయినా తల్లిదండ్రులు సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ఇంట్లో ఉండేందుకు కొడుకులు, కూతుళ్లకు ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండబోదని జస్టిస్ మన్ మోహన్ అన్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బాగున్నంత కాలం వాళ్ల ఇష్టం మేరకు కావాలంటే ఇంట్లో ఉండొచ్చని, అంతేతప్ప వాళ్లకు భారంగా ఉంటామంటే మాత్రం కుదరదని తెలిపారు.