చీకట్లు
పసిమొగ్గల్లో అంధత్వం!
♦ చిన్నారుల్లో ఏ విటమిన్ లోపం
♦ {పతి వంద మందిలో ఏడుగురికి సమస్య
♦ రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
♦ పౌష్టికాహారలోపం, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం
♦ కళ్లజోళ్లు తప్పనిసరి అవుతున్న దుస్థితి
జోగిపేట: గతంలో కంటి చూపు తగ్గుతుందంటే వృద్ధాప్యం దగ్గర పడుతుందని భావించే వారు. కానీ నేడు వయసుతో సంబం ధం లేకుండా కంటిచూపు మందగిస్తోంది. చీకటి గదుల్లో విద్యా బోధన, టీ వీ చూడటం, కంప్యూటర్, వీడియో గేమ్స్, సెల్‌లో చిత్రాలు వీక్షించడం తదితర కారణాలతో పిల్లల్లో కంటి చూపు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో దృష్టిలోపం ఏర్పడడం ఆందోళన కల్గించే అంశం. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పిల్లలందరూ కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి 100 మంది చిన్నారుల్లో ఏడుగురికి దృష్టిలోపం ఉన్నట్లు సమాచారం.
జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 50 వేల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో తప్పనిసరిగా 2,609 మంది విద్యార్థుల కు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ మాసంలో అద్దాలను పంపిణీ చేయనున్నారు. వేలాది మంది విద్యార్థులకు కంటిలో వేసుకునేందుకు ఐ డ్రాప్స్‌ను పంపిణీ చేశారు. వీరిలో 10 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్లలోపు ఉన్న 100 మంది చిన్నారులను పరిశీలిస్తే అందులో ఏడుగురు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు నిర్వహించి విటమిన్ ఏ అందిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. కాగా.. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
చూపు తగ్గడానికి కారణాలు
♦ పిల్లలకు పాలు, గుడ్డు అకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు అవసరమైనంత మేరకు తీసుకోకపోవడంతో విటమిన్ ఏ కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపు మందగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
♦ వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయడం.
♦ తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులనే వాడాలి. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాసిన అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి.
♦ తెల్లబోర్డులు, మార్కర్లు వాడడంతో కళ్లపై ఒత్తిడి పడి నరాలపై ప్రభావం చూపి కంటి చూపు తగ్గుతుంది.
♦ {పస్తుతం పుస్తకాలలో అక్షరాలు కూడా మరీ చిన్నగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది.
♦ టీవీ, కంప్యూటర్, వీడియో, సెల్‌లో గేమ్స్ ఆడే పిల్లల్లో కంటి చూపు సమస్య ఉత్పన్నమవుతుంది.
50 వేల మంది చిన్నారులకు కంటి పరీక్షలు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 2.069 మంది విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా కంటి అద్దాలు అవసరమని గుర్తించాం. వారికి ఈనెలలో కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఐ డ్రాప్స్ మందులను పంపిణీ చేశాం. చిన్నారులకు కంటిని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలను ప్రతి పాఠశాలలో వివరించాం. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం
- డాక్టర్ అమర్‌సింగ్, డీఎంహెచ్‌ఓ, సంగారెడ్డి
జాగ్రత్తలు తప్పనిసరి
ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు క్యారెట్, ద్రాక్ష, బొప్పా యి, చిలుగడదుంపలు తీసుకోవడం తో కంటి సమస్యల నుంచి రక్షణ పొం దవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా అయిదారు సార్లు చేయడంతో కళ్లపై వత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూ స్తూ.. తెరుస్తూ ఉండటం మరచిపోవద్దు. పిల్లలు, పెద్ద లు ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేదుకు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణులు