సురేష్ ఇంటికి వస్తూనే వందన మీద కేకేశాడు ‘మన పర్సనల్ ఫొటోలు సోషల్‌మీడియాలో ఎందుకు పోస్ట్ చేశావ’ని. వందన తన ఫోన్ తీసుకొని చెక్ చేసింది. భర్త చెప్పింది నిజమే. కొడుకు వీడియో గేమ్ ఆడుకుంటానని అదేపనిగా విసిగిస్తుంటే తన మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఎని మిదేళ్ల కొడుకు చేసిన నిర్వాకానికి తలకొట్టేసినట్లయ్యింది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన ఫొటోలు తొలగించి ఊపిరి పీల్చుకుంది. ఎందుకలా చేశావని అడిగితే తనకేమీ తెలియదని ఆటలో మునిగిపోయిన కొడుకును చూస్తూ ‘ఇక నుంచి వీడిని ఫోన్ ముట్టకోనివ్వకూడద’ ని గట్టిగా నిర్ణయించుకుంది. (పేర్లు మార్చడమైది).
సురేశ్, వందన విషయంలోనే కాదు పిల్లలున్న ప్రతి ఇంట్లో డిజిటల్ వినియోగంపై తల్లిదండ్రుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఊహ తెలియని పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో... అనే ఆందోళన ఎక్కువయ్యింది. బడి పాఠాలు కూడా డిజిటల్‌లోకి మారాక ఇంటర్నెట్ వాడకం పిల్లల్లోనూ పెరిగింది. ఇలాంటప్పుడు పిల్లలకు ఏది మంచి, ఏది చెడు తెలియజేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు తప్పక ఉంది.
డిజిటల్ శ్రేయస్సు... ఈ రోజుల్లో పిల్లల స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సమయాన్ని నియంత్రించడం కష్టమైన పనే. 7నుంచి 13 ఏళ్ల పిల్లలు చాలా రకాల సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఉపయోగిస్తున్నారు. డిజిటల్ శ్రేయస్సు విషయంలో అన్ని వయసుల వారికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీతో మెరుగైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రమాదాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.
మన దగ్గరి డేటా.. మన దేశంలో 2021లో ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగించేవారి సంఖ్య దాదాపు 1.39 బిలియన్ల జనాభా ఉంది. 1.10 బిలియన్లకు మొబైల్ కనెక్షన్‌కి యాక్సెస్ ఉంది. వీరిలో 624 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు. 448 మిలియన్ల మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులు. సగటు ఇంటర్నెట్ వినియోగం రోజుకు 6.36 గంటలు అయితే సోషల్ మీడియా వినియోగం 2.25 గంటలు. మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినడానికి వెచ్చించిన సగటు సమయం 1.53 గంటలు. గేమింగ్‌లో గడిపే సగటు సమయం 1.20 గంటలు. 16 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో 92.8% మంది వీడియో గేమ్‌లు ఆడుతున్నారని నివేదికలు ఉన్నాయి.
మార్గదర్శకాలు తప్పనిసరి... ఈ రోజుల్లో పిల్లలు సెకండరీ స్కూల్‌కి వెళ్లడంతోనే మరింత స్వతంత్రులు అవుతున్నారు. వైవిధ్యమైన అలవాట్లతో మరింత నమ్మకంగా ఇంటర్నెట్ వినియోగదారులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు యాప్ ద్వారా కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలతో తరచూ ఇంటర్నెట్ భద్రత గురించి మాట్లాడాలి. పిల్లలకు వ్యక్తిగతం కాకుండా కుటుంబ ఇ–మెయిల్‌ను సెట్ చేయాలి. వీడియోగేమ్‌ల రేటింగ్, వయసు బార్‌లను తనిఖీ చేయాలి.
పెద్దలకు చిట్కాలు... ∙పిల్లలు స్క్రీన్‌ని ఎక్కువగా వాడుతున్నారని టెక్నాలజీ యాక్సెస్‌ను బ్లాక్ చేయవద్దు. అంటే, ఫోన్లు లాగేసుకోవడం, ఇంటర్నెట్ కట్ చేయడం.. చేయకూడదు. ∙ పిల్లలకు ఇష్టమైన యాప్‌లు, సైట్‌లపై మీరూ ఆసక్తి చూపండి. ∙కొన్ని పరిమితులను సెట్ చేయడానికి కంటెంట్ ఫిల్టర్ సాఫ్ట్‌వేర్‌లను వాడచ్చు. ∙పడకగది, భోజన సమయం, ప్రయాణంలో.. ఇంటర్నెట్‌ను వాడద్దని కుటుంబమంతటికీ పరిమితిని నిర్ణయంచండి. ∙ఆన్‌లైన్‌లో ఏ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయ కూడదో/ఓవర్‌షేర్ చేయకూడదో తప్పనిసరిగా నేర్పించాలి. ∙ఆఫ్ స్క్రీన్ సమయం, ఆన్‌స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్పాలి. ∙వయసు పరిమితులు (ఉదా: 18 ఏళ్లు) ఉన్న సైట్‌లకు సైన్ అప్ చేయడానికి మీ చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వవద్దు. అవసరం, అవగాహన లేని సమాచారం ఇవ్వాలనుకోకూడదు.
పెద్దలు వేసుకోదగిన ప్రశ్నలు
► మీ పిల్లలు ఆన్‌లైన్ ద్వారా ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎందుకు జరుపుతున్నారో, ఈ పరస్పరచర్య నుండి వారు ఏం పొందుతున్నారో .. తెలుసుకోవడం ముఖ్యం.
► ఆన్‌లైన్‌లో ఏ సమాచారం గురించి వెతుకుతున్నారు. అందుకు వారు ఉపయోగించే సాధనాలు ఏమిటి, వాటి మూలాలు ఏమిటి.. తనిఖీ చేయడం అవసరం.
► మీ డిజిటల్ కార్యకలాపాల మంచి, చెడు తెలిసే విధానం ఏమిటి, వాటి ప్రభావం పిల్లల మీద ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ∙పిల్లలు తమ చుట్టూ ఉన్నంత సురక్షితంగా, ఆన్‌లైన్ వేదికల్లో ఉన్నారా. ఈ తరహా డిజిటల్ శ్రేయస్సుపై అవగాహన, అభ్యాసం ఎప్పుడూ ఆగిపోకూడదు.
అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్
ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment