- పార్టీ నైట్స్‌లో పాటల సందడి
- కేజేల కేరాఫ్‌గా నిలుస్తున్న నగరం
- కరోకే ఈవెంట్లకు పెరిగిన డిమాండ్
- బాత్‌రూమ్ టూ బాల్‌రూమ్.. పాటల జర్నీ
- నగరంలో కరోకే ట్రెండ్‌కు 20 ఏళ్లు
నికితా నాయర్ (26) ఆరేళ్లుగా విదేశాల్లో ఉంటూ రెండు నెలల క్రితం సిటీకి తిరిగి వచ్చారు. ఈ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ పాడడంలో ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఒంటరిగా కరోకే ఈవెంట్‌లకు వెళ్లి ఇతర క్రూనర్‌లతో కలిసి పాడడం ప్రారంభించి ఇప్పుడు రెగ్యులర్‌గా మారారు. ‘నేను ఆల్కహాల్ తాగను. నచ్చిన ఫుడ్ తిని నా హృదయానికి దగ్గరగా అనిపించిన పాటలు పాడతాను’ అని నాయర్ చెప్పారు. ఇలాంటి బాత్‌రూమ్ సింగర్స్‌ని బాల్‌రూమ్ సింగర్స్‌గా మారుస్తున్న క్రెడిట్ కరోకే జాకీ (కేజే)లకే దక్కుతుంది.
– సాక్షి, సిటీబ్యూరో
పాట మొదలవుతుంది.. సంగీతం వినబడుతుంటుంది. స్క్రీన్ మీద ఆ పాట సాహిత్యం కనబడుతుంటుంది. ప్రేక్షకుల్లో నుంచి కొన్ని చేతులు గాల్లోకి లేస్తాయి. ఆడియోలో గాత్రం మొదలయ్యే సమయానికి ఆ గాల్లోకి లేచిన చేతుల్లోని ఒక చేతిలో మైక్ పెడతాడు కేజే లేదా కరోకే జాకీ. ఆ సమయంలో అసలు గాయకుని గాత్రం స్థానంలో సదరు చేతి తాలూకూ వ్యక్తి గొంతు భర్తీ అవుతుంది. ఇలా మ్యూజిక్ ట్రాక్‌లో వాయిస్‌ని కట్ చేసి ఆ స్థానంలో మన వాయిస్‌ని కలిపి పాడడమే కరోకే సింగింగ్ అంటారు. ఇప్పుడు సిటీలో జరిగే పార్టీ ఈవెంట్స్‌లో ట్రెండీగా మారాయి ఈ కరోకే నైట్స్. ‘తాను డీప్ పర్పుల్, ది బీటిల్స్‌లోని రెట్రోలను, హిందీ పాట లేదా రాక్ వినడానికి ఇష్టపడతా’ అని నికితా నాయర్ చెప్పారు. ఒకప్పుడు ఇలా ఇష్టపడడం అనేది కేవలం వినడం వరకూ మాత్రమే పరిమితమైతే.. ఇప్పుడు అది పాడడం వరకూ చేరింది. ఆహారం, పానీయాలతో పాటుగా ముందుగా రికార్డ్ చేసిన ట్రాక్‌ల ద్వారా మైక్రోఫోన్‌లో పాడటం కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ మంత్రంగా మారింది.
నో డ్రింకింగ్ ఓన్లీ సింగింగ్..
ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోలిన్ డిసౌజా (28) మాట్లాడుతూ ‘నాకీ సరదా బెంగళూర్‌లో అలవాటైంది. డ్రింక్ చేయడానికి కాకుండా పాడటానికి మాత్రమే రెస్టో–బార్‌లను సందర్శిస్తాను. పాటల్ని కలిసి పాడే సమయంలో కొత్త పార్ట్‌నర్స్ లభిస్తుంటారు’ అన్నారు. నగరానికి చెందిన కరోకే జాకీ రోగర్ వైట్ ప్రకారం.. ‘తెలుగు పాటలకు ఇంకా పబ్స్, క్లబ్స్‌లో జరిగే కరోకే నైట్స్‌లో ప్రాచుర్యం పెరగలేదు. పాశ్చాత్య సంగీతానికే డిమాండ్. బ్రయాన్ ఆడమ్స్ రాసిన ‘సమ్మర్ ఆఫ్ 69’ బాన్ జోవి రాసిన ‘ఇట్స్ మై లైఫ్’ వంటి పాటలు కరోకే నైట్స్‌లో ప్రసిద్ధి చెందాయి. రెట్రో, రెగె, ఓల్డ్ రాక్ పాప్ శైలులతో గొంతు కలపడానికి అతిథులు ఇష్టపడతారు.’
ప్రైవేట్ ఈవెంట్స్‌లోనూ..
పెళ్లిళ్లు, బర్త్‌డేలు తదితర వేడుకల్లోనూ ఇప్పుడు కరోకే సందడి బాగా పెరిగింది ‘గతంలో పబ్స్, క్లబ్స్‌కే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు వివాహ వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలతో పాటు కరోకే కూడా భాగం చేస్తున్నారు’ అని కేజే నోయల్ చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు, హిందీ పాటలకే పెద్ద పీట వేస్తున్నారని, అలాగే ఇలాంటి చోట అతిథులను పాడించడం అంత సులభం కాదని పలువురు కేజేలు అభిప్రాయపడుతున్నారు. కరోకే నైట్స్‌కి పేరొందిన ఓ క్లబ్‌కు సహ–యజమాని దీప్తి కే దాస్ మాట్లాడుతూ.. ‘కరోకే కాలం చెల్లిన డీజే నైట్‌ల కంటే ఎక్కువ ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఆదివారం బ్రంచ్ తర్వాత యువత దీని కోసం బాగా వస్తారు. ఈ ట్రెండ్‌లో మమేకమవుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి టేబుళ్లను రిజర్వ్ చేసుకుంటాయి. డైనింగ్‌తో పాటు సింగింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు.
పుట్టి 20 ఏళ్లయినా..
నైట్ పార్టీస్‌లో ఈ కరోకే ట్రెండ్ సిటీలో ఊపిరిపోసుకుని దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆనంద్ అనే డీజే తాను కేజేగా మారి ఈ ట్రెండ్‌కు బోణీ కొట్టారు. అప్పటి నుంచీ ఆయన మాత్రమే సిటీలో కేజేగా సుపరిచితులుగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కరోకే ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో కేజేల సందడి కూడా పెరిగింది. ఎఫ్ అండ్ బీ నిపుణులు గఫNర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు, వారానికి రెండు కరోకే నైట్స్ ఉండేవి. ఇప్పుడు, నాకు కనీసం 10 వరకూ ఉంటున్నాయి’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment