singing career
-
క్రేజీ.. కేజే..
నికితా నాయర్ (26) ఆరేళ్లుగా విదేశాల్లో ఉంటూ రెండు నెలల క్రితం సిటీకి తిరిగి వచ్చారు. ఈ వెడ్డింగ్ కొరియోగ్రాఫర్ పాడడంలో ప్రొఫెషనల్ కాదు. కానీ ఆమె ఒంటరిగా కరోకే ఈవెంట్లకు వెళ్లి ఇతర క్రూనర్లతో కలిసి పాడడం ప్రారంభించి ఇప్పుడు రెగ్యులర్‌గా మారారు. ‘నేను ఆల్కహాల్ తాగను. నచ్చిన ఫుడ్ తిని నా హృదయానికి దగ్గరగా అనిపించిన పాటలు పాడతాను’ అని నాయర్ చెప్పారు. ఇలాంటి బాత్రూమ్ సింగర్స్‌ని బాల్రూమ్ సింగర్స్‌గా మారుస్తున్న క్రెడిట్ కరోకే జాకీ (కేజే)లకే దక్కుతుంది. – సాక్షి, సిటీబ్యూరోపాట మొదలవుతుంది.. సంగీతం వినబడుతుంటుంది. స్క్రీన్ మీద ఆ పాట సాహిత్యం కనబడుతుంటుంది. ప్రేక్షకుల్లో నుంచి కొన్ని చేతులు గాల్లోకి లేస్తాయి. ఆడియోలో గాత్రం మొదలయ్యే సమయానికి ఆ గాల్లోకి లేచిన చేతుల్లోని ఒక చేతిలో మైక్ పెడతాడు కేజే లేదా కరోకే జాకీ. ఆ సమయంలో అసలు గాయకుని గాత్రం స్థానంలో సదరు చేతి తాలూకూ వ్యక్తి గొంతు భర్తీ అవుతుంది. ఇలా మ్యూజిక్ ట్రాక్‌లో వాయిస్‌ని కట్ చేసి ఆ స్థానంలో మన వాయిస్‌ని కలిపి పాడడమే కరోకే సింగింగ్ అంటారు. ఇప్పుడు సిటీలో జరిగే పార్టీ ఈవెంట్స్‌లో ట్రెండీగా మారాయి ఈ కరోకే నైట్స్. ‘తాను డీప్ పర్పుల్, ది బీటిల్స్‌లోని రెట్రోలను, హిందీ పాట లేదా రాక్ వినడానికి ఇష్టపడతా’ అని నికితా నాయర్ చెప్పారు. ఒకప్పుడు ఇలా ఇష్టపడడం అనేది కేవలం వినడం వరకూ మాత్రమే పరిమితమైతే.. ఇప్పుడు అది పాడడం వరకూ చేరింది. ఆహారం, పానీయాలతో పాటుగా ముందుగా రికార్డ్ చేసిన ట్రాక్‌ల ద్వారా మైక్రోఫోన్లో పాడటం కొత్త సోషల్ నెట్వర్కింగ్ మంత్రంగా మారింది. నో డ్రింకింగ్ ఓన్లీ సింగింగ్.. ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కోలిన్ డిసౌజా (28) మాట్లాడుతూ ‘నాకీ సరదా బెంగళూర్‌లో అలవాటైంది. డ్రింక్ చేయడానికి కాకుండా పాడటానికి మాత్రమే రెస్టో–బార్లను సందర్శిస్తాను. పాటల్ని కలిసి పాడే సమయంలో కొత్త పార్ట్నర్స్ లభిస్తుంటారు’ అన్నారు. నగరానికి చెందిన కరోకే జాకీ రోగర్ వైట్ ప్రకారం.. ‘తెలుగు పాటలకు ఇంకా పబ్స్, క్లబ్స్‌లో జరిగే కరోకే నైట్స్‌లో ప్రాచుర్యం పెరగలేదు. పాశ్చాత్య సంగీతానికే డిమాండ్. బ్రయాన్ ఆడమ్స్ రాసిన ‘సమ్మర్ ఆఫ్ 69’ బాన్ జోవి రాసిన ‘ఇట్స్ మై లైఫ్’ వంటి పాటలు కరోకే నైట్స్‌లో ప్రసిద్ధి చెందాయి. రెట్రో, రెగె, ఓల్డ్ రాక్ పాప్ శైలులతో గొంతు కలపడానికి అతిథులు ఇష్టపడతారు.’ప్రైవేట్ ఈవెంట్స్‌లోనూ.. పెళ్లిళ్లు, బర్త్‌డేలు తదితర వేడుకల్లోనూ ఇప్పుడు కరోకే సందడి బాగా పెరిగింది ‘గతంలో పబ్స్, క్లబ్స్కే పరిమితం అయినప్పటికీ ఇప్పుడు వివాహ వేడుకల్లో సంగీత్ వంటి కార్యక్రమాలతో పాటు కరోకే కూడా భాగం చేస్తున్నారు’ అని కేజే నోయల్ చెప్పారు. అయితే వీటిలో ఎక్కువగా తెలుగు, హిందీ పాటలకే పెద్ద పీట వేస్తున్నారని, అలాగే ఇలాంటి చోట అతిథులను పాడించడం అంత సులభం కాదని పలువురు కేజేలు అభిప్రాయపడుతున్నారు. కరోకే నైట్స్‌కి పేరొందిన ఓ క్లబ్‌కు సహ–యజమాని దీప్తి కే దాస్ మాట్లాడుతూ.. ‘కరోకే కాలం చెల్లిన డీజే నైట్ల కంటే ఎక్కువ ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఆదివారం బ్రంచ్ తర్వాత యువత దీని కోసం బాగా వస్తారు. ఈ ట్రెండ్‌లో మమేకమవుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం కలిసి టేబుళ్లను రిజర్వ్ చేసుకుంటాయి. డైనింగ్‌తో పాటు సింగింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పారు. పుట్టి 20 ఏళ్లయినా..నైట్ పార్టీస్‌లో ఈ కరోకే ట్రెండ్ సిటీలో ఊపిరిపోసుకుని దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఆనంద్ అనే డీజే తాను కేజేగా మారి ఈ ట్రెండ్‌కు బోణీ కొట్టారు. అప్పటి నుంచీ ఆయన మాత్రమే సిటీలో కేజేగా సుపరిచితులుగా ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా కరోకే ట్రెండ్ బాగా పెరిగింది. దీంతో సిటీలో కేజేల సందడి కూడా పెరిగింది. ఎఫ్ అండ్ బీ నిపుణులు గఫNర్ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు, వారానికి రెండు కరోకే నైట్స్ ఉండేవి. ఇప్పుడు, నాకు కనీసం 10 వరకూ ఉంటున్నాయి’ అని చెప్పారు. -
పేదింటి ‘కోయిల’ ప్రతిభా రాగం!
ప్రకాశం,మార్టూరు: పేదింటి ‘కోయిల’ పాటల పోటీలో ప్రతిభ చాటి ప్రశంసలందుకుంటోంది. చిన్నతనం నుంచే గేయాలాపనను సాధన చేస్తున్న బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆర్థిక స్థోమత అడ్డుగోడగా నిలవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ బాలిక. వివరాల్లోకి వెళ్తే.. మార్టూరు కిషోర్ కాలనీకి చెందిన కుందూరు వెంకటేశ్వర్లు, పెద్ద నాగేంద్రమ్మ దంపతుల కుమార్తె గాయత్రి. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబం పరుపులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి గాయత్రి. స్థానిక మద్ది సత్యనారాయణ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి పాటలు పాడటంపై ఆకర్షితురాలైన గాయత్రి.. కూనిరాగాలతో గీతాలాపాన ప్రారంభించి కొద్దికొద్దిగా పాటలు పాడటం అలవాటు చేసుకుంది. గాయత్రిలోని ప్రతిభను గమనించిన పాఠశాల యాజమాన్యం 2017లో అప్పటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో గాయత్రితో ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని..’ అనే పాటను పాడించగా సభికులు చప్పట్లతో అభినందించారు. ఈ నెలలో చిలకలూరిపేటలో నిర్వహించిన కళా ఉత్సవ్‌లో పాటలు పాడి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా వల్లూరులో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గత శనివారం విజయవాడలోని గుణదల సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్–2019లో పాల్గొన్న గాయత్రి ప్రథమ స్థానంలో నిలిచి జయకేతనం ఎగురవేసింది. ఈ నెల 30వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి కళా ఉత్సవ్–2019 పోటీల్లో గాయత్రి పాల్గొననున్నట్లు గైడ్ టీచర్‌గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాలు శారద తెలిపారు. తల్లిదండ్రులతో గాయత్రి దాతల కోసం ఎదురుచూపు గాయత్రి జాతీయ స్థాయిలో నెగ్గుకురావాలంటే సంగీత పరిజ్ఞానం నేర్చుకోవడం అవసరం. అందుకు ఆర్థికంగా సహకరించగల దాతల కోసం అన్వేషిస్తున్నట్లు శారద తెలిపారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు లేని గాయత్రికి దాతలు సహకారం అందిస్తే జాతీయ స్థాయి పాటల పోటీల్లో తన గళాన్ని వినిపించి విజేతగా నిలుస్తుందని గైడ్ టీచర్ అభిప్రాయపడ్డారు. -
న్యాయం చేయలేకపోతే.. పాడటం మానేస్తా: బాలు
తాను పాటలకు న్యాయం చేయలేకపోతున్నానని అనుకున్న రోజు ఇక పాడటం మానేస్తాను తప్ప.. దాన్ని పట్టుకుని వేలాడబోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఇప్పటికి 40వేలకు పైగా పాటలు పాడిన ఈ పద్మభూషణ్ విజేత.. ఇప్పటివరకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోనందుకు, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయనందుకు మాత్రం చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. అలాగే, తన పిల్లలు ఎదగడాన్ని కూడా తాను గమనించలేకపోయానని, ఎప్పటికప్పుడు జీవితంలో బిజీగా ఉండటంతో కుటుంబానికి తగినంత న్యాయం చేయలేకపోయానేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. 69 ఏళ్ల వయసున్న బాలు.. గత వారమే కెరీర్లో 50వ ఏట అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, కన్నడ.. ఇలా 15 భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. ఏనాడూ పాట నేర్చుకోకపోయినా ఇన్నాళ్ల పాటు ఎలా పాడగలుగుతున్నానో అని తనకే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తొలిపాట పాడిన ఆయన.. ఆ తర్వాత శంకరాభరణం, 1981లో వచ్చిన హిందీ సినిమా 'ఏక్ దూజే కే లియే'లతో కెరీర్లో ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లారు. రికార్డింగ్ సాయంత్రం 5 గంటలకు ఉందంటే.. ఆరునూరైనా అంతకంటే ముందే స్టూడియోకు చేరుకుంటానని ఆయన తెలిపారు. డైరెక్టర్ పెద్దవాళ్లా, చిన్నవాళ్లా అనేదాంతో సంబంధం లేకుండా పాటకు న్యాయం చేస్తానని అన్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడమే ఒకరకంగా మంచిదైందని, ఒకవేళ అది నేర్చుకుని ఉంటే లలిత సంగీతం పాడేవాడిని కాదేమోనని బాలు చెప్పారు. ఈ 49 ఏళ్ల పాటు తాను పాటకే జీవితం అంకితం చేశానని, ఇప్పటికి కూడా సగటున రోజుకు 11 గంటలు పనిచేస్తున్నానని అన్నారు. తనకు ఎప్పటికీ ఫేవరెట్ గాయకుడు మహ్మద్ రఫీయేనని, మిగిలిన అందరికంటే ఆయన వద్దే ఎక్కువ నేర్చుకున్నానని వివరించారు. ఎప్పుడైనా తనకు శారీరకంగా, మానసికంగా పాటకు న్యాయం చేయలేకపోతున్నట్లు అనిపిస్తే.. వెంటనే ఆపేస్తానని బాలు స్పష్టం చేశారు. తాను సరిగా పాడగలిగినంత కాలం సంతోషంగానే ఉంటానని, ఇంతకంటే తనకు పెద్ద కోరికలు ఏమీ లేవని అన్నారు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా చేశానని, తాను కోరకుండానే చాలా అవకాశాలు తలుపు తట్టాయని తెలిపారు.