న్యాయం చేయలేకపోతే.. పాడటం మానేస్తా: బాలు
తాను పాటలకు న్యాయం చేయలేకపోతున్నానని అనుకున్న రోజు ఇక పాడటం మానేస్తాను తప్ప.. దాన్ని పట్టుకుని వేలాడబోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఇప్పటికి 40వేలకు పైగా పాటలు పాడిన ఈ పద్మభూషణ్ విజేత.. ఇప్పటివరకు శాస్త్రీయ సంగీతం నేర్చుకోనందుకు, ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయనందుకు మాత్రం చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. అలాగే, తన పిల్లలు ఎదగడాన్ని కూడా తాను గమనించలేకపోయానని, ఎప్పటికప్పుడు జీవితంలో బిజీగా ఉండటంతో కుటుంబానికి తగినంత న్యాయం చేయలేకపోయానేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. 69 ఏళ్ల వయసున్న బాలు.. గత వారమే కెరీర్‌లో 50వ ఏట అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, కన్నడ.. ఇలా 15 భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. ఏనాడూ పాట నేర్చుకోకపోయినా ఇన్నాళ్ల పాటు ఎలా పాడగలుగుతున్నానో అని తనకే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో తొలిపాట పాడిన ఆయన.. ఆ తర్వాత శంకరాభరణం, 1981లో వచ్చిన హిందీ సినిమా 'ఏక్ దూజే కే లియే'లతో కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లారు. రికార్డింగ్ సాయంత్రం 5 గంటలకు ఉందంటే.. ఆరునూరైనా అంతకంటే ముందే స్టూడియోకు చేరుకుంటానని ఆయన తెలిపారు. డైరెక్టర్ పెద్దవాళ్లా, చిన్నవాళ్లా అనేదాంతో సంబంధం లేకుండా పాటకు న్యాయం చేస్తానని అన్నారు.
శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడమే ఒకరకంగా మంచిదైందని, ఒకవేళ అది నేర్చుకుని ఉంటే లలిత సంగీతం పాడేవాడిని కాదేమోనని బాలు చెప్పారు. ఈ 49 ఏళ్ల పాటు తాను పాటకే జీవితం అంకితం చేశానని, ఇప్పటికి కూడా సగటున రోజుకు 11 గంటలు పనిచేస్తున్నానని అన్నారు. తనకు ఎప్పటికీ ఫేవరెట్ గాయకుడు మహ్మద్ రఫీయేనని, మిగిలిన అందరికంటే ఆయన వద్దే ఎక్కువ నేర్చుకున్నానని వివరించారు.
ఎప్పుడైనా తనకు శారీరకంగా, మానసికంగా పాటకు న్యాయం చేయలేకపోతున్నట్లు అనిపిస్తే.. వెంటనే ఆపేస్తానని బాలు స్పష్టం చేశారు. తాను సరిగా పాడగలిగినంత కాలం సంతోషంగానే ఉంటానని, ఇంతకంటే తనకు పెద్ద కోరికలు ఏమీ లేవని అన్నారు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా కూడా చేశానని, తాను కోరకుండానే చాలా అవకాశాలు తలుపు తట్టాయని తెలిపారు.