విజయవాడలో శనివారం రాష్ట్ర స్థాయి బహుమతి అందుకుంటున్న గాయత్రి
ప్రకాశం,మార్టూరు: పేదింటి ‘కోయిల’ పాటల పోటీలో ప్రతిభ చాటి ప్రశంసలందుకుంటోంది. చిన్నతనం నుంచే గేయాలాపనను సాధన చేస్తున్న బాలిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆర్థిక స్థోమత అడ్డుగోడగా నిలవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది ఆ బాలిక. వివరాల్లోకి వెళ్తే.. మార్టూరు కిషోర్ కాలనీకి చెందిన కుందూరు వెంకటేశ్వర్లు, పెద్ద నాగేంద్రమ్మ దంపతుల కుమార్తె గాయత్రి. బుడబుక్కల సామాజికవర్గానికి చెందిన ఈ కుటుంబం పరుపులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి గాయత్రి. స్థానిక మద్ది సత్యనారాయణ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి పాటలు పాడటంపై ఆకర్షితురాలైన గాయత్రి.. కూనిరాగాలతో గీతాలాపాన ప్రారంభించి కొద్దికొద్దిగా పాటలు పాడటం అలవాటు చేసుకుంది. గాయత్రిలోని ప్రతిభను గమనించిన పాఠశాల యాజమాన్యం 2017లో అప్పటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో గాయత్రితో ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని..’ అనే పాటను పాడించగా సభికులు చప్పట్లతో అభినందించారు.
ఈ నెలలో చిలకలూరిపేటలో నిర్వహించిన కళా ఉత్సవ్‌లో పాటలు పాడి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ నెల 10వ తేదీన ప్రకాశం జిల్లా వల్లూరులో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌లో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గత శనివారం విజయవాడలోని గుణదల సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్–2019లో పాల్గొన్న గాయత్రి ప్రథమ స్థానంలో నిలిచి జయకేతనం ఎగురవేసింది. ఈ నెల 30వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి కళా ఉత్సవ్–2019 పోటీల్లో గాయత్రి పాల్గొననున్నట్లు గైడ్ టీచర్‌గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయురాలు శారద తెలిపారు.
తల్లిదండ్రులతో గాయత్రి
దాతల కోసం ఎదురుచూపు
గాయత్రి జాతీయ స్థాయిలో నెగ్గుకురావాలంటే సంగీత పరిజ్ఞానం నేర్చుకోవడం అవసరం. అందుకు ఆర్థికంగా సహకరించగల దాతల కోసం అన్వేషిస్తున్నట్లు శారద తెలిపారు. ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు లేని గాయత్రికి దాతలు సహకారం అందిస్తే జాతీయ స్థాయి పాటల పోటీల్లో తన గళాన్ని వినిపించి విజేతగా నిలుస్తుందని గైడ్ టీచర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment