భాగ్యనగర్‌.. బిస్కెట్‌ కా ఘర్‌.. | Hyderabad World Famous Osmania Biscuits | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌.. బిస్కెట్‌ కా ఘర్‌..

Published Tue, Dec 17 2024 6:51 AM | Last Updated on Tue, Dec 17 2024 7:10 AM

Hyderabad World Famous Osmania Biscuits

 చాయ్‌ రుచికి చక్కని జోడీ 

ఉస్మానియా నుంచి.. కారా వరకూ.. 

హైదరాబాద్‌ బిస్కెట్లకూ ఓ ప్రత్యేకత 

ఒరిజినల్‌ టేస్ట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా 

అప్పట్లో రోగులకు అల్పాహారంగా 

అల్పాహారం మాత్రమేనా..! గిఫ్ట్‌ ప్యాక్స్‌ కూడా..

హైదరాబాద్‌ అంటే బిర్యానీ.. బిర్యానీ.. అంటే  హైదరాబాద్‌.. ఈ రెండింటికీ మధ్య విడదీయరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర వాసులతోపాటు ప్రపంచమంతా తెలిసిందే..  ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి  హైదరాబాద్‌ నగరం కేరాఫ్‌ అన్నట్టుగా  మారింది. అయితే మన చవులూరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా  గుర్తింపు ఉందని అంటున్నారు నగరానికి చెందిన బేకరీ నిర్వాహకులు. ఈ బిస్కెట్స్‌లో ఇరానీ చాయ్‌తో జోడీ కట్టేవి కొన్నయితే.. క్రిస్మస్‌ లాంటి పండుగల సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్‌ ప్యాకెట్స్‌గా మారేవి మరికొన్ని. అలాంటి కొన్నింటిపైనే ఈ కథనం.. 

నాటి నిజామ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాస్త సాల్ట్, కాస్త స్వీట్‌ కలగలిసిన రుచికరమైన ఈవెనింగ్‌ స్నాక్స్‌ కోసం చేసిన అన్వేషణే ఉస్మానియా బిస్కెట్‌కి ఊపిరిపోసిందని చరిత్ర చెబుతోంది. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెబుతుంటారు. దేశంలోనే రాజ ప్రాసాదం నుంచి వచి్చన రాయల్‌ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్‌గా దీన్ని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్‌ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్‌ అప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారైందట.  

తొలి రాయల్‌ బిస్కెట్‌.. 
కాగా ఈ రాయల్‌ బిస్కెట్‌ని నగర మార్కెట్‌కి పరిచయం చేసింది మాత్రం సుభాన్‌ బేకరీ. ఉస్మానియా బిస్కెట్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదలైన ఈ బిస్కెట్‌ను ఒక కప్పు ఇరానీ చాయ్‌తో ఆస్వాదించడం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ హైదరాబాదీలకు 
నిత్యకృత్యం. 

హిస్టారికల్‌ టూటీ ఫ్రూటీ.. 
పురాతన హైదరాబాదీ బిస్కెట్‌గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్‌ బిస్కెట్‌. ఇది రోజువారీ వినియోగం కన్నా.. ఇచ్చి పుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ ప్యాక్‌ బాగా పేరొందింది. నగరవాసులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందుగా కరాచీ బేకరీ నుంచి పుట్టిన ఫ్రూట్‌ బిస్కెట్‌ను ప్యాక్‌ చేయించుకోవడం చాలా మందికి అలవాటు.

వెనీలా రుచుల చంద్రవంక.. 
చంద్రవంక ఆకారంతో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్‌కి ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్‌లను తరచూ వెనిలా లేదా పాలతో బేక్‌ చేసి, వాటికి సున్నితమైన, లలితంగా ఉండే రుచిని అందజేస్తారు. వీటినే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్‌ అని కూడా అంటారు. వీటి ధరలు సుమారు కిలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉన్నాయి. 

చాయ్‌తో.. ఫైన్‌ బిస్కెట్‌.. 
నగరంలోని బేకరీలలో దీర్ఘకాల వారసత్వం కలిగిన మరొక హైదరాబాదీ ట్రీట్‌గా దీన్ని చెప్పొచ్చు. దీనిని పలుచని పొరలుగా వేయడం అనేది కొంత శ్రమతో కూడిన ప్రక్రియగా తయారీదారులు చెబుతారు. ఈ  బిస్కట్‌లో పంచదార పాకం, కొద్దిగా మంచిగా పెళుసైన క్రస్ట్‌ ఉంటుంది. ఇది ఇరానీ చాయ్‌తో మరో చక్కని కాంబినేషన్‌. చాయ్‌లో ముంచినప్పుడు మెత్తగా మారి దానికి సరికొత్త తీపిని జోడిస్తుంది. ఇది కిలో రూ.300 నుంచి ఆపైన అందుబాటులో ఉన్నాయి. 

రుచికి దాసోహం ‘కారా’.. 
ఇది నగర టీ సంస్కృతి ప్రత్యేకతకు దోహదం చేసే మరో రుచికరమైన బిస్కెట్‌ ఖారా.æ వీటిని పిండి, వెన్నతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. తరచుగా జీలకర్ర లేదా నువ్వులు కూడా ఈ మేళవింపులో చోటు చేసుకుంటాయి. ఇవి చాయ్‌ రుచికి మసాలాని జోడించి వైవిధ్యభరితమైన ఆస్వాదనను అందిస్తాయి. ఇది కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య అందుబాటులో లభిస్తుంది.

ఛాయ్‌ అండ్‌ ‘టై’.. సూపర్‌ భాయ్‌.. 
ప్రత్యేకమైన విల్లు–టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి ఒక కప్పు ఇరానీ చాయ్‌కి అద్భుతమైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు. వీటి తేలికైన, పొరలతో కూడిన రుచి తియ్యటి బిస్కెట్‌ల నుంచి వేరు చేస్తుంది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.

బిస్కెట్ల చరిత్ర అ‘పూర్వం’.. 
బిర్యానీ కన్నా అతి పురాతన చరిత్ర కలిగిన బిస్కెట్లు మన నగరానికి ఉన్నాయి. అయితే చాలా మందికి వాటి విశేషాలు తెలియవు. బిస్కెట్స్‌లో మేం పరిచయం చేసిన ఉస్మానియా బిస్కెట్‌ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. చాంద్‌ బిస్కెట్, టై బిస్కెట్‌ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్‌గా ఆర్డర్‌ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్‌ సీజన్‌లో ఛాయ్‌కి డిమాండ్‌ ఎక్కువ.. దీంతో పాటే ఖారా వంటి బిస్కెట్స్‌కి డిమాండ్‌ పెరుగుతుంది.  
– సయ్యద్‌ ఇర్ఫాన్, సుభాన్‌ బేకరీ  

టేస్ట్‌ ఎంజాయ్‌ చేయాలంటే.. 
ఈ బిస్కెట్ల ఒరిజినల్‌ టేస్ట్‌ని ఎంజాయ్‌ చేయాలంటే కొంత ఎంక్వయిరీ చేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పాత బేకరీలు మాత్రమే వాటిని పాత పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ‘1951లో మా తాత మొహమ్మద్‌ యాసీన్‌ ఖాన్‌ బేకరీని ప్రారంభించినప్పుడు, జనాదరణ పరంగా అగ్రస్థానంలో ఉస్మానియా బిస్కెట్‌ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఖారా బిస్కెట్, చాంద్‌ బిస్కెట్, ఫైన్‌ బిస్కెట్, టై బిస్కెట్‌ ఉండేవి. ఇవి అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, అవి లేకుండా అల్పాహారం, టీ సమయం మాత్రమే కాదు, పెళ్లి విందులు సైతం ఉండేవి కావు. ఇప్పటికీ వీటిని రెగ్యులర్‌గా వినియోగించేవాళ్ల వల్ల తగినంత డిమాండ్‌ ఉంది’ అని రోజ్‌ బేకరీ యజమాని ముజాఫర్‌ ఖాన్‌ అంటున్నారు. కాగా సోషల్‌ మీడియా ట్రెండ్స్‌తో మమేకమవుతున్న నేటి యువతకు హైదరాబాద్‌ సంప్రదాయ బిస్కెట్‌ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement