పర్యాటక ప్రాంతాలకు సిద్ధమవుతున్న నగరవాసులు.
ఓవైపు ఇయర్ ఎండింగ్.. మరోవైపు క్రిస్టమస్, న్యూ ఇయర్.
వరుస పండుగలతో బోలెడన్ని సెలవులు.
రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్స్ ముందస్తుగా బుకింగ్.
శీతాకాలమైతే నార్త్‌కే సై అంటున్న నగరవాసులు.
కొద్ది రోజుల క్రితం సాధారణ స్థాయిలో ఉన్న విమానయాన ధరలు అమాంతం రెట్టింపయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ 15 నుంచి 31 తేదీల్లో గతంతో పోల్చితే రెండింతలు, మూడింతల మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నగర వాసుల్లో ప్రయాణాల పట్ల ఉన్న ఆసక్తే దీనికి కారణం. కాగా ప్రస్తుత నెలల్లో వరుసగా క్రిస్మస్, ఇయర్ ఎండ్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో నగరవాసులకు భారీగా సెలవులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్రావెలింగ్ మంత్‌గా డిసెంబర్‌ను ఎంచుకుంటున్నారు. ప్రతి యేడాదీ డిసెంబర్ నెలలో ఏదో ఒక టూర్ వేయడం అందివచ్చిన సెలవులను వినియోగించుకోవడం నగర వాసులకు అలవాటే. ఇందు కోసం ముందస్తుగానే నగరంలోని ప్రయాణ ప్రేమికులు వారి ప్రయాణ గమ్యస్థానాలకు మార్గాలను సుగమం చేసుకున్నారు. యువత, టెకీలు ట్రావెలింగ్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా డొమెస్టిక్ ప్రయాణాలు ఇప్పటికే సోల్డ్ ఔట్ బోర్డ్‌పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– సాక్షి, సిటీబ్యూరో.
కొందరు ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ టెకీలు యేడాదంతా వారి సెలవులను వినియోగించకుండా తమ తమ విధులు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు మరికొందరు టెకీలకు, కాల్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఉద్యోగులకూ డిసెంబర్ నెలలో భారీగా సెలవులు ఉంటాయి. దీంతో ఆయా సెలవుదినాలను డిసెంబర్ డెస్టినేషన్ కోసమే వినియోగిస్తుంటారు.. నగరంలో విస్తరిస్తున్న ఐటీ ట్రెండ్‌తో గత కొన్నేళ్లుగా ట్రావెలింగ్ రంగంలోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు మిగిలిపోయిన సెలవులు, మరోవైపు నగరంలోని విదేశాలకు చెందిన గ్లోబల్ కంపెనీల క్రిస్మస్ లీవ్స్ దీనికి ప్రామాణికం అవుతున్నాయి.
వీటిని ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే యుద్ధప్రాతిపధికన టీమ్ హెడ్‌లకు మెయిల్స్ పెట్టేయడం, ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించడం, పర్యాటక ప్రాంతాల్లో విడిది, విందు, వినోదం తదితరాలకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇది కొత్తేం కాకపోయినప్పటికీ.. ఈ కల్చర్ ఈ ఏడాది మరింత పుంజుకోవడం విశేషం. సాధారణ రోజుల్లో 4 నేల నుంచి 9 వేల వరకూ ఉండే దేశీయ విమాన చార్జీలు ప్రస్తుతం 14 నుంచి 20 వేలకు పైగా కొనసాగడం ఈ సంస్కృతి ప్రభావానికి నిదర్శనం. కన్యాకుమారి, కేరళ మొదలు.. మనాలి, డార్జిలింగ్ వంటి శీతల ప్రదేశాలకు బయలు దేరుతున్నారు. మరికొందరైతే స్విస్ దేశాలు, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వంటి విదేశాలకు బుకింగ్‌లు మొదలెట్టారు.
ఏడాదికి వీడ్కోలు..
పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పడం, నూతన ఏడాదికి నూతనోత్సాహాన్ని పొందడం కోసం కూడా ట్రావెలింగ్ డెస్టినేషన్‌లనే ఎంచుకుంటున్నారు ఈ తరం యువత. ఇయర్ ఎండ్ వేడుకలకైతే గోవాలాంటి మ్యూజికల్ నైట్స్ కోసం పరితపిస్తున్నారు నగర వాసులు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వేసిన కొత్త రైలు సేవలు పొందడానికి ముందస్తుగానే బెర్త్ కరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యంగా బుక్ చేస్తే ఈ చార్జీలు మరింత పెరిగిపోతాయని ఇప్పటికే చాలా టూర్స్ ప్లానింగ్, బుకింగ్ పూర్తయ్యాయని గూగుల్ చెబుతుంది. ఈ వేదికల్లో అవకాశం లేకపోతే ప్రైవేటు ట్రావెల్స్‌ను సైతం ఆశ్రయిస్తూ, సెల్ఫ్ డ్రైవింగ్‌కు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంతో పాటు దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లోని ట్రావెలింగ్ ఏజెన్సీలు, ఈవెంట్ ఆర్గనైజర్లు ముందస్తు పండగలు చేసుకుంటున్నారు.
గోవా పార్టీలకు...
యేడాది చివరి వేడుకలకు నగర యువత భారీగా ఆసక్తి చూపిస్తోంది. వీరిలో అత్యధికులు వెళ్లే ఏకైక డెస్టినేషన్ మాత్రం గోవానే. ఎందుకంటే..నగర కల్చర్‌లో భాగంగా పంబ్ పారీ్టలు, లైవ్ కాన్సర్ట్, డీజే మ్యూజిక్ వంటి ట్రెండ్స్‌ని ఆస్వాదించే వారు, ప్రకృతిని కోరుకునే వారు వేరు వేరుగా ఈస్ట్ గోవా, నార్త్ గోవాలను ఎంచుకుంటారు. తమకు అనుకూలమైన, అనువైన స్పాట్స్‌ను ముందస్తుగానే ఎంచుకుని అందుకు అనుగునంగా ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో వైజాగ్, అరకు వ్యాలీ సైతం టాప్‌లోనే ఉన్నాయి.
ఎతైన ప్రదేశాలకు..
ఇప్పటికే ఈ సీజన్‌లో దక్షిణాది రాష్ట్రాల్లోని కూర్గ్, ఊటీ, మున్నార్, వయనరాడ్, కొడైకెనాల్, ఇడుక్కి, యరక్కాడ్, కున్నూర్ వంటి హిల్ స్టేషన్స్‌కి భారీగా టికెట్లు బుక్ అయ్యాయని లోకల్ ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నామాట. దీంతోపాటు ఈ మధ్య కాలంలో మనాలి, డార్జిలింగ్, సిమ్లా, షిల్లాంగ్ వంటి చల్లటి ప్రకృతి ప్రాంతాలను ఆస్వాదించడానికి ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ట్రిప్స్‌లో భాగంగానే నార్త్‌కు ఎక్కువగా ప్రయాణమవుతున్నారు. అంతేకాకుండా సాంస్కృతిక వైవిధ్యాన్ని తిలకించడానికి కేరళ, ఊటీ వంటి ప్రదేశాలను వారి గమ్యస్థానాలుగా చేర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment