స్టెప్‌ టు ఫిట్‌.. | 20 to 30 minutes of dancing for day | Sakshi
Sakshi News home page

స్టెప్‌ టు ఫిట్‌..

Published Tue, Feb 25 2025 7:30 AM | Last Updated on Tue, Feb 25 2025 7:30 AM

20 to 30 minutes of dancing for day

నట్టింట నృత్యం.. ఆరోగ్య భాగ్యం..

కిచెన్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఫిట్‌గా ఉండొచ్చు

జాగింగ్, నడకతో సమానమైన వ్యాయామం 
 
నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడి

రోజుకు 20 నుంచి 30 నిమిషాల నృత్యం చాలు

గత కొంతకాలంగా హోమ్‌ డ్యాన్స్‌పై సిటిజనుల ఆసక్తి  

మనలో చాలా మంది ఫిట్‌గా ఉండాలంటే కిలోమీటర్ల కొద్దీ జాగింగ్‌ చేయడం, గంటల తరబడి జిమ్‌కి వెళ్లడం.. కసరత్తులు చేయడం, బరువులు ఎత్తడం లేదా ఈత కొట్టడం వంటివి అవసరమని నమ్ముతారు. అయితే ఫిట్‌గా ఉండటానికి కేవలం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఫిట్‌నెస్‌ ఎక్సర్‌సైజులతో పాటు డ్యాన్స్‌ కూడా అదే స్థాయిలో సహాయపడుతుంది. అయితే డ్యాన్స్‌లలో చాలా రకాలు ఉన్నాయి.. ఏది మంచిది అనుకోకండి.. ఏ డ్యాన్స్‌ చేసినా ఒక్కటే.. మరైతే ఏదైనా డ్యాన్స్‌ క్లాసెస్‌లో చేరాలా? అనే సందేహం రావచ్చు.. అబ్బే అదేం అవసరంలేదు.. ఏ డ్యాన్స్‌ క్లాస్‌లోనూ చేరకుండానే కేవలం ఇంట్లో చేసే నృత్యం ద్వారా కూడా తగినంత ఫిట్‌నెస్‌ సాధించవచ్చని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది.     

రోజంతా అలసిపోయేలా పని చేసిన తర్వాత, షూస్, ట్రాక్స్‌ వగైరాలు ధరించి జిమ్‌కి వెళ్లడం చాలా మందికి కష్టం అనిపిస్తుంది. దీంతో గత కొంత కాలంగా నగరవాసుల్లో కూడా ఇంట్లోనే డ్యాన్స్‌ చేసే అలవాటు క్రమంగా పెరుగుతోందని ప్రముఖ డ్యాన్స్, ఎరోబిక్స్‌ శిక్షకులు బాబీ చెప్పారు. రోజువారీ ఫిట్‌నెస్‌ లక్ష్యాలను సాధించడానికి చాలామంది సులభమైన ఎంపికగా నడక లేదా జాగింగ్‌కి బదులు.. హోమ్‌ డ్యాన్స్‌ ఎంచుకుంటున్నారు. ఇది సరైనదేనని, వంటచేసేటప్పుడు రోజుకు కేవలం 20 నిమిషాల పాటు వంటగదిలో డ్యాన్స్‌ చేసినా అది ఫిట్‌గా ఉండేందుకు సరిపోతుందని తాజా అధ్యయనంతేల్చంది.  

స్టడీ ఏం చెబుతోంది..  
బోస్టన్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 18 నుంచి 83 సంవత్సరాల మధ్య వయసు గల వారిని ఎంచుకుని పరీక్షించారు. పరిశోధకులు వారు ఎంత ఆక్సిజన్‌ ఉపయోగిస్తున్నారు? వారి గుండెలు ఎంత వేగంగా కొట్టుకుంటున్నాయి? అనే రీతిలో పలురకాల టెస్టులు నిర్వహించారు. అనంతరం వ్యాయామ తీవ్రతను కూడా పరీక్షించారు. పాల్గొనే వారందరూ సహేతుకమైన ఆరోగ్యలాభాలు అందించే శారీరక శ్రమ స్థాయికి చేరుకున్నారని ఫలితాలు చూపించాయి. ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన డాక్టర్‌ ఆస్టన్‌ మెక్‌కల్లౌగ్‌ మాట్లాడుతూ ‘తమంత తాము స్వేచ్ఛగా నృత్యం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శారీరక శ్రమకు సరిపోతుందా అని పరీక్షిస్తే.. దీనికి   అధ్యయనంలో ‘అవును’ అని సమాధానం వచి్చంది. ఏ తీవ్రతతో నృత్యం చేయాలో చెప్పకుండానే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థాయికి అందరూ చేయగలిగారు. వారు తమ సొంత సంగీతాన్ని ఆస్వాదించారు’ అని చెప్పారు.

ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగంగా.. 
నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ప్రకారం, ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం నివారించాలి. ప్రతి వారం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీనిని రోజువారీగా విభజించి ప్రతిరోజూ ఏదో ఒక కార్యాచరణ చేయాలి.. దానిలో హోమ్‌ డ్యాన్స్‌ను కూడా చేర్చుకోవచ్చు. ఇష్టమైన ట్యూన్‌లను ఎంచుకుని చేసే హోమ్‌ డ్యాన్స్‌ ఆహ్లాదకరమైన ప్రభావవంతమైన వ్యాయామం ఇది. ఫిట్‌నెస్‌ రొటీన్‌లో సరదా వ్యాయామాన్ని చేర్చే అద్భుతమైన మార్గం. అన్ని వయసుల, ఫిట్‌నెస్‌ స్థాయిల వారికి అందుబాటులో ఉంటుంది. గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అంటున్నారు నిపుణులు.  

ఇంటి పనులతో సైతం.. 
‘బాత్‌రూమ్‌ను ఎవరు శుభ్రం చేయాలి? వంటపని ఎవరు చేయాలి? వంటి విషయాలపై తర్జనభర్జనలు పడుతున్న జంటలకు పరిష్కారాలను చూపించే మార్గం అంటున్న ప్రముఖ సల్సా టీచర్‌ డానియెల్లా గోమ్స్‌ మాట్లాడుతూ.. ‘నృత్యాలతో పాటు ఇంటి పనులను చేయడం కూడా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన మంచి అనుభవం’ అని చెబుతున్నారు. ఇంట్లో రిలాక్స్‌డ్‌గా కూర్చున్న సమయంతో మొదలుపెట్టి షవర్‌ బాత్‌ చేసే సమయం వరకూ.. నచి్చనట్టుగా రిథమిక్‌గా కాళ్లూ, చేతులూ కదుపుతూ ఇంటి నృత్యాన్ని అలవాటుగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.

ఒత్తిడికి సరైన పరిష్కారం..
కేవలం ప్రొఫెషన్‌గా తీసుకునేవారికే అనుకోవడం సరైంది కాదు. ఆరోగ్యం, మానసికోల్లాసం కోరుకునే ప్రతి ఒక్కరికీ నృత్యం మంచి ఎంపిక. క్లాసెస్‌కు అటెండ్‌ అవ్వలేని సందర్భంలో మా విద్యార్థులకు ఇంట్లో కాసేపు నృత్యం చేయమని చెబుతాం. హోమ్‌ డ్యాన్స్‌ చేసేటప్పుడు సోఫాలు, టీపాయ్‌.. వంటివి అడ్డుగా లేకుండా చూసుకోవాలి. డ్యాన్స్‌ చేయడానికి కనీసం 5/5 అడుగుల స్థలం ఉండేలా చూసుకోవాలి. అలాగే 20 నిమిషాల నృత్యం చేయాలనుకుంటే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు మెడ, భుజాలు, నడుము.. ప్రాంతాలపై ఒత్తిడి కలిగిస్తూ చేసే తేలికపాటి వార్మప్‌ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్‌ బీట్స్‌లో తీవ్రమైన మార్పు చేర్పులు ఉండే పాటలకన్నా ఒక రిథమిక్‌గా సాగే ట్యూన్స్‌ ఎంచుకోవడం మంచిది. నృత్యం పూర్తయిన తర్వాత 2 నిమిషాల పాటు కూల్‌ డవున్‌ స్ట్రెచ్‌ వ్యాయామాలు చేయగలిగితే బెటర్‌.   
– పృధ్వీ రామస్వామి, ఆరి్టస్టిక్‌ డైరెక్టర్, స్టెప్స్‌ డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌  

ఇవిగో ఇలా.. 
⇒ బాలీవుడ్, జుంబా లేదా ఫ్రీస్టైల్‌ కదలికలు అయినా, హార్ట్‌ బీట్‌ రేటును పెంచి కేలరీలను బర్న్‌ చేస్తాయి. ఇవి కార్డియో వ్యాయామానికి సమానం. 
⇒ డ్యాన్స్‌లోని విభిన్న కదలికలు కాళ్లు, కోర్, చేతులు.. వీపుతో సహా బహుళ కండరాల సమూహాలను చైతన్యవంతం చేస్తాయి. మజిల్స్‌ బలోపేతం, టోనింగ్‌కి ఉపకరిస్తుంది. విభిన్న అవయవాల మధ్య సమన్వయం, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. 
⇒ శారీరక ప్రయోజనాలకు మించి డ్యాన్స్‌ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది.  
⇒ నచ్చిన పాటలకు మొదలుకుని, జుంబా, హిప్‌హాప్, సల్సా, బ్యాలె వరకూ విభిన్న నృత్య రీతులను ఎంచుకోవచ్చు. 
⇒కదలికలను గైడ్‌ చేయడానికి ఆన్‌లైన్‌ డ్యాన్స్‌ తరగతులు లేదా వీడియో ట్యుటోరియల్స్‌ వినియోగించవచ్చు. 
⇒ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేస్తూ.. జతగా స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను కలుపుకోవచ్చు. సాధారణ దశలతో ప్రారంభించి నైపుణ్యంతో పాటు తీవ్రత పెంచాలి. 
⇒నట్టింటి నృత్యం ఎన్నో రకాల ఉ్రత్పేరకంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో నియమాలు ఉండవు. కేవలం కదలికలు తప్ప ఇది భావోద్వేగాలను వ్యక్తపరచడంలో  సహాయపడుతుంది. ఫుట్‌ ఫ్లెక్స్, పాయింట్, పాస్, రోండ్‌డిజాంబే (కాలు చుట్టూ) చైన్స్‌ (మలుపులు) వంటి కొన్ని సమకాలీన ప్రాథమిక అంశాలతో దీనిని స్టార్ట్‌ చేయవచ్చు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement