కండల కన్నా విల్లులాంటి దేహంపై యువత ఆసక్తి..
అథ్లెటిక్ బాడీ కోసం గ్రౌండ్స్‌లో పరుగులు, వ్యాయామాలు
ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్న పలువురు శిక్షకులు..
ఫిట్‌నెస్‌తో పాటు కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకూ ఉపయుక్తం
సరైన ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న నిపుణులు
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్‌గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్‌లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు.
నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్‌లో యువత ఇటీవల ఫిట్‌నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్‌తో కొందరు.. ఫిట్‌నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్‌లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్‌లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
శరీర భాగాలపై సమానంగా..
జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్‌లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్‌లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్‌లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.
ట్రైనింగ్ పద్ధతులు..
గ్రౌండ్‌లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్‌సైజ్‌ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్‌తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్‌లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.
ఎత్తు పెరిగే అవకాశం..
గ్రౌండ్‌లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కూల్‌డౌన్ పద్ధతులు తప్పనిసరి..
గ్రౌండ్‌లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్‌డౌన్, స్ట్రెచ్ ఎక్సర్‌సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్‌సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం
మంచిది.
– కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్
డైట్ చాలా ముఖ్యం..
గ్రౌండ్‌లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్‌ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి.
– వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు
Comments
Please login to add a commentAdd a comment