ఆశయం దిశగా ముందుకు కదలు
నేడు జాతీయ యువజన దినోత్సవం
యువశక్తికి వివేకానందుని కీలక సందేశం
నవ భారత నిర్మాణానికి యువశక్తి కీలకం
విభిన్న రంగాల్లో సత్తా చాటుతున్న యువత
స్వామి వివేకానంద 163వ జయంతి
ట్యాంక్‌బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకూ ప్రదర్శన
‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచి్చన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది.‘గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే తన సహజ లక్షణమైన ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది.’ అని వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ..మరిన్ని విశేషాలు..
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా పాటించనున్నారు. రామకృష్ణమఠంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. జాతి నిర్మాణంలో యువశక్తి ఎంతో కీలకమైందనే సందేశాన్నిస్తూ ట్యాంక్‌బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకూ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే నేషనల్ యూత్ డే వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గోనున్నారు. ‘ఛేంజింగ్ యూత్ పవర్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యువజన ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది..
సృజన శక్తులన్నీ నీలోనే..
మనం బలహీనులం, అపవిత్రులం అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ బలవంతులు, శక్తిసంపన్నులే. అనంతశక్తి మీలోనే దాగివుంది. జీవితంలోని ప్రతి సందర్భంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో వివేకానందుడు ప్రబోధించాడు. ‘మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి’ అన్నారు. నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొని స్వరూపజ్ఞానంతో కార్యాచరణ చేపట్టినప్పుడు గొప్ప శక్తి, తేజస్సు లభిస్తాయి. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ప్రతి ఒక్కరికీ వారి నిజస్వరూప జ్ఞానాన్ని తెలియజేయడమే ఔన్నత్యానికి మార్గం. పౌరుషాన్ని ప్రకటించడం అంటే దౌర్జన్యం, హింస వంటి వాటి కోసం శక్తియుక్తులను వినియోగించటం కాదు. సాధువర్తనం కలిగి ఉండడం. నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం, అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని వివేకానంద బోధించారు. యువత తమలోని సృజనశక్తులను ఆవిష్కరించేందుకు ఆ బోధనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు.
‘విశ్వ’ భావన ఉండాలి..
ప్రతి ఒక్కరూ ‘విశ్వవ్యాపిత భావన’ను కలిగి ఉండాలి. ‘పరిమితమైన నేను’ ‘నేను ఫలానా’, ‘ఇది నాది’ వంటి అనేక స్వార్థబంధాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ ‘పరిమిత నేను’ నుండి విడివడి ‘విశ్వవ్యాపిత నేను’ అనే భావనతో తాదాత్మ్యం చెందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు కావలసింది మనుషులు మాత్రమే అంటారు స్వామి వివేకానంద. బలవంతులు, చక్కటి నడవడిక కలిగినవాళ్లు, గొప్ప ఆత్మవిశ్వాసమున్న యువకులు కావాలని చెబుతారు. అలాంటివారు వంద మంది దొరికినా ప్రపంచం పూర్తిగా మారిపోతుందంటారు. అలాంటి యువత కావాలి ఇప్పుడు.
నేషనల్ యూత్ డే..
ఈ నెల 12న రామకృష్ణమఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలతో పాటు, జాతీయ యువజన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమంలో స్వామి బోధమయానంద ‘ఛేంజింగ్ యూత్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ పై తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు చెన్నైకి చెందిన తుగ్లక్ మేగజైన్ సంపాదకులు ఎస్.గురుమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా 18 అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద మ్యూరల్‌ను ఆవిష్కరించనున్నారు.
సహనమే సరైన లక్షణం..
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఏదైనా సాధించగలమనే విశ్వాసం పెరిగింది. కానీ అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదే సహనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి. కానీ వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు కాదు. అనుకున్నదే తడవుగా అన్నీ జరిగిపోవాలనుకుంటారు, కానీ ప్రతికూలత ఎదురు కాగానే కుదేలయిపోతున్నారు. ప్రతికూలత ఎదురైనపుడు సహనంతో, ఓర్పుతో దానిని ఎదుర్కొనే సామర్థ్యం అలవర్చుకోవాలి. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తుంది. అలాగే మనిషి మానసిక స్థైర్యాన్ని ప్రతికూలతలు పరీక్షిస్తాయి. అందుకే వేచివుండాల్సిన సమయంలో నిరాశ నిస్పృహలకు లోనవకుండా ఓర్పుతో నిరీక్షించటం ఎంతో అవసరం. ‘అసహనం ప్రకటించటం వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది’ అని చెప్పిన వివేకానందుడి మాటలను గుర్తుంచుకోండి.
– స్వామి బోధమయానంద, రామకృష్ణమఠం అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment