వినోదం వికాసం | KG Plus Select 2025 Photo Exhibition | Sakshi
Sakshi News home page

వినోదం వికాసం

Mar 10 2025 10:41 AM | Updated on Mar 10 2025 11:47 AM

KG Plus Select 2025 Photo Exhibition

ప్రతిష్టాత్మక కేజీ ప్లస్‌ సెలెక్ట్‌–2025 ఫొటో ఎగ్జిబిషన్‌లో అర్హత

తెలంగాణ సంస్కృతి, సంక్షోభాలను ప్రదర్శించిన కెమెరా

పలు అంతర్జాతీయ వేదికల్లోనూ వినోద్‌ ఫొటోలు 

సాధారణ మనుషుల్లా కాకుండా ఆయనకు మూడో కన్ను ఉంటుంది.., అదే తన కెమెరా. ఈ కన్నుతో తాను చూసిన అద్భుతాలు, సామాజిక అంతరాలు వంటి విశేషాంశాలన్నింటినీ కెమెరాలో బంధిస్తాడు. అలా తను తీసిన ఫొటోలు భారత్‌తో పాటు విదేశాల్లోని ఫొటో ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాడు. ఆయనే  వినోద్‌ వెంకపల్లి. ఆయన ప్రయాణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక ఇతివృత్తాలను బంధించి ప్రపంచానికి పరిచయం చేశాడు. చదువుకుంది ఐఐటీ ఎని్వరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్, కానీ తన శోధన, పరిశోధన అంతా ఫొటోగ్రఫీనే. ఎందుకు అని ఎవరైనా అడిగితే.. అందులోనే సంతృప్తి దొరుకుతుందని చెబుతాడు. తన ఫొటోగ్రఫీ నైపుణ్యంతో క్యోటో వేదికగా జరగనున్న కేజీ ప్లస్‌ సెలెక్ట్‌ 2025 ఫొటో ఎగ్జిబిషన్‌కు అర్హత సాధించారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 10 మందికి మాత్రమే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన వినోద్‌ తన అనుభవాలను, ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 

ఇంజినీరింగ్‌.. చెన్నైలో, ఎమ్‌టెక్‌ ఐఐటీ దన్‌బాగ్‌లో చేశాను. కానీ నా ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరిగేవి. ముఖ్యంగా సామాజిక సమస్యలు, ఇతివృత్తాలను పరిశోధించడం, ఫొటోలుగా బంధించడం ఇష్టం. వాటితో స్టోరీ టెల్లింగ్‌ ఇంకా ఇష్టం. దీని కోసం ఎంత దూరమైనా కెమెరా బుజాన వేసుకుని బైక్‌పై వెళుతుంటాను. కొన్ని రోజులు జాబ్‌ కూడా చేశాను.. కానీ సంతృప్తినివ్వలేదు. కెమెరాతో ఊర్లు తిరుగుతూ.. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు, జాతరలు, కష్టాలు, సంతోషాలను ఫొటోలుగా తీయడం మంచి అనుభూతినిచ్చేది. ఇలా 11 ఏళ్ల నుంచి ఫొటోగ్రఫీ, డాక్యుమెంటరీలతో నా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఈ ప్రయాణంలో కేజీ ప్లస్‌ సెలెక్ట్‌ 2025 ఫొటో ఎగ్జిబిషన్‌లో పాల్గోనుండటం సంతోషంగా ఉంది. ఏప్రిల్‌ 12 క్యోటోలో నా ఫొటోలను ప్రదర్శించనున్నాను. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంబోడియా, తైవాన్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో ఫొటోలు ప్రదర్శితమయ్యాయి.  

ప్రయాణం నగరం నుంచే.. 
నగరంలోని ట్యాంక్‌బండ్‌ వంటి ప్రదేశాల్లో ఫొటోలు తీస్తూ మొదలు పెట్టిన ప్రయాణం తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చేరింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణం ఏమీ తెలియదు. అమ్మా, నాన్న డాక్టర్లు. కానీ వారు నా సామాజిక బాధ్యతను ప్రేరేపించేవారు. అటువైపు నన్ను ప్రోత్సహించేవారు. ఈ ప్రయాణంలో నల్గొండ ఫ్లోరోసిస్‌పై పరిశోధనాత్మక ఫొటోగ్రఫీ చేశాను. దీని కోసం బైక్‌పై నల్గొండలోని ఫ్లోరైడ్‌ బెల్ట్‌కు వెళ్లేవాడిని. అంతేకాకుండా తెలంగాణలోని అప్పటి నీళ్ల కష్టాలను నా ఫొటోలతో చూపించాను. అరకులో మలేరియా వ్యాపించి ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం తెలుసుకుని చేసిన ప్రాజెక్టు ఇంకా కళ్ల మందే మెదులుతోంది. మహబూబ్‌నగర్‌లో నీటి ఎద్దడికి ఇసుక చలిమల్లో ఓ చిన్నారి ముంతతో నీరు సేకరించిన ఘటన..నీటి ప్రధాన్యతను తెలియజేసింది. కరువు, సంక్షోభాలు, విపత్కర పరిస్థితులు, సామాజిక సమస్యలు, మానవీయ కోణాలు, వివక్ష, సాంఘిక అకృత్యాలను ఫొటోలుగా బంధిస్తూ వచ్చాను.  

క్రమంగా నమ్మకం కలిగింది.. 
హైదరాబాద్‌లో బోనాలు, ముంబైలో వినాయక చవితి, మహోకుంభ మేళా.. ఇలా సందర్భం ఏదైనా అక్కడి పరిస్థితులను చిత్రించాను. అమ్మ నాన్నలు నాస్తికులు.. కానీ ప్రజల్లో దేవుని పై నమ్మకం నన్ను ఆలోచింపజేసేది. నమ్మకం లేకుంటే మనిషి పరిస్థితులు ఏంటనే దిశగానూ శోధించాను. అప్పులు చేసి పంట వేసిన ఒక రైతు దేవుడి పై నమ్మకంతో తన జీవనాన్ని ఎలా ముందుకు సాగిస్తాడు.. ఆ నమ్మకమే లేకుంటే కష్టజీవుల మానసిక అవస్థలు ఎలా ఉంటాయో దగ్గరగా చూశాను.  

వివిధ వేదికల్లో.. 
నా ఫొటోలు ది న్యూయార్క్‌ టైమ్స్, ది గార్డియన్, ది వాషింగ్టన్‌ పోస్ట్, ఎమ్‌ఎస్‌ఎన్‌ సౌత్‌ ఆఫ్రికా, డైలీ మెయిల్, యాయూ న్యూస్‌ యూకే, నేషనల్‌ పోస్ట్, యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ వంటి వేదికల్లో ప్రచురితమయ్యాయి. నాకు విభిన్న కళల్లో ప్రావీణ్యముంది.. డ్రాయింగ్‌ వేస్తాను. శిల్పకళలోనూ ప్రావీణ్యముంది. మెటల్‌ ఫేస్‌ తయారు చేస్తాను. ఫొటోగ్రఫీకి బయటకు వెళ్లడానికి నాకు డబ్బులను అందించేది నా డ్రాయింగ్‌ మాత్రమే. నా ఫొటోల్లో బంధించలేని వాటిని బొమ్మలుగా వేసి ముంబై ఆర్ట్‌ ఫెయిర్‌లో ప్రదర్శిస్తే.. అన్నీ అమ్ముడు పోయాయి. ఫొటోగ్రఫీలో ప్రతిష్టాత్మక టోటో ఫొటోగ్రఫీ అవార్డ్, రెండు సార్లు తెలంగాణ స్టేట్‌ అవార్డులను అందుకున్నాను. ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో సభ్యుడిని. సామాజిక అంశాల ఇతివృత్తంతో  రెండు, మూడు డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్‌్మలు తీసే ప్రయత్నంలో ఉన్నాను.  

అది అమాయకత్వం కాదు.. ఆప్యాయత.. 
ఫొటోల కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల స్వచ్ఛమైన మనస్తత్వం చూశాను. మొదట్లో ఆశ్చర్యపడేవాడిని. ఓ అవ్వ అన్నం పెట్టేది. ఒక పెద్దాయన తన ఇంట్లో ఆశ్రయం కలి్పంచేవారు. ఇలా పల్లె మట్టిలో అమ్మతనం నన్ను ఫొటోగ్రఫీలో మరింత లోతుగా తీసుకెళ్లింది. మొదట్లో అదంతా అమాయకత్వం అనుకున్నా.. కాదు ఆప్యాయత అని నెమ్మదిగా తెలుసుకున్నా. తోటి మనుషులకు వారిచ్చే విలువను తెలుసుకున్నా. అఫ్ఘాన్‌ వార్‌లో చనిపోయిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ దాని‹Ùసిద్ధికీ (ఢిల్లీ) పలు విలువైన సూచనలిచ్చి ఫ్రీలాన్స్‌ ఫొటో జర్నలిస్టుగా మారేలా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement