విద్యార్థులకుసరికొత్త అనుభూతి
ఏడాది పొడవునా ఆహ్వానం
ఎన్నెన్నో వింతలు, మరెన్నో విశేషాలు
దేశ ప్రథమ పౌరుడు/పౌరురాలి దక్షిణాది అధికారిక నివాసం.. నగరంలో బ్రిటిష్ పాలనకు కేంద్రంగా కొనసాగిన రెసిడెన్సీ భవనం.. వీఐపీలు మినహా సామాన్యులకు ఎలా ఉంటుందో తెలిసేది కాదు. ప్రతి సంవత్సరం కేవలం వారం రోజులు మాత్రమే సామాన్యులకు సందర్శనకు అవకాశం ఉండేది.. కానీ ప్రస్తుత రాష్ట్రపతి ఆదేశాలతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులోకి వచి్చంది. రాష్ట్రపతికి దక్కే రాజ¿ోగాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతోటలు, వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు, ఎండ ఆనవాళ్లు కూడా కానరాని పండ్ల తోటలు, మయూరాల కిలకిలారావాలు.. అలనాటి వ్యవసాయానికి కేంద్ర బిందువులైన మోట, మెట్ల బావులు.. గత రాష్ట్రపతులు వాడిన గుర్రపు బగ్గీ, వింటేజ్ బెంజీ కారు.. ఇలా చెప్పకుంటూ పోతే రాష్ట్రపతి నిలయం విశేషాలు ఎన్నెన్నో.. రాష్ట్రపతి విడిది చేసే ప్రత్యేక గదులు, మీటింగ్ హాల్స్, ప్రత్యేకంగా వంటచేసే కిచెన్, కిచెన్ నుంచి రాష్ట్రపతి ప్రధాన విడిది భవనానికి ఆహారాన్ని తీసుకెళ్లే సొరంగ మార్గం.. వాటితో పాటు ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళలో సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విహార అనుభూతి కల్గుతుంది. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం సామాన్యుల సందర్శనకు తాత్కాలిక బ్రేక్ పడగా, మళ్లీ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంపై ప్రత్యేక కథనం..
మూడో అధికారిక నివాసం..
భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు మరో రెండు అధికారిక నివాసాల్లో ఒకటి షిమ్లాలోని ‘ది రిట్రీట్ బిల్డింగ్’ కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ‘రాష్ట్రపతి నిలయం’ మూడోది. ఈ భవనం నిజాం నజీర్ ఉద్–దౌలా హయాంలో 1860లో నిర్మితమైంది. బొల్లారంలోని 97 ఎకరాల సువిశాల స్థలంలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన భవనం ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలోని చీఫ్ మిలటరీ ఆఫీసర్ నివాస స్థలంగా వినియోగించే ఈ భవనాన్ని రెసిడెన్సీ హౌజ్‌గా వ్యవహరించేవారు. 1948లో హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం రాష్ట్రపతి దక్షిణాది తాత్కాలిక నివాసంగా మారింది.
ఏడాది పొడవునా అనుమతి
గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది అనంతరం రెండు లేదా మూడు వారాల పాటు మాత్రమే సాధారణ పౌరులకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఉండేది. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హయాంలో నిత్యం ప్రజల సందర్శనకు అవకాశం
కల్పించారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, వారాంతాల్లో రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విద్యార్థుల సందర్శనకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నెల 29 నుంచి రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట పక్షం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
20 గదులు, సొరంగ మార్గం..
రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనం ప్రెసిడెంట్స్ వింగ్, ఫ్యామిలీ వింగ్‌తో పాటు ఏడీసీ వింగ్ పేరిట మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులో డైనింగ్ హాలు, దర్బార్ హాలు, మార్నింగ్ రూమ్, సినిమాల్ సహా మొత్తం 11 గదులుంటాయి. ప్రధాన భవనానికి కొంత దూరంలో ఉండే కిచెన్ ద్వారా ఆహారాన్ని డైనింగ్ హాలుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సొరంగ మార్గం ఉంది. రాష్ట్రపతి ప్రధాన నివాస భవనంతో పాటు మరో 150 మంది వరకు సిబ్బంది ఉండేందుకు ప్రత్యేక వసతి సముదాయం ఉంది. రకరకాల పూలమొక్కలతో పాటు పండ్ల తోటలు ఉన్నాయి. 116 రకాల సుగంధ, ఔషధ మొక్కలతో కూడిన ప్రత్యేక హెర్బల్ గార్డెన్ ఈ ఆవరణలో ఉంది. మూడు మంచినీటి బావులు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment