పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
టీడీపీ నాయకుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
ఆలూరు: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన హాలహర్వి మండలం కుర్లేహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని శివాలయానికి చెందిన మాన్యం సర్వే నంబర్50/బిలో 2.43 ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన రైతు శంభలింగ గత కొన్నేళ్లు నుంచి సాగుచేస్తున్నారు. ఈ భూమిని ఎలాగైనా శివాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న ఉమాపతిస్వామికి ఇప్పించాలని అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు దేవాదాయశాఖ అధికారులు, హాలహర్వి పోలీసులపై ఒత్తిడి తీసుకోవచ్చారు. దీంతో ఈ వ్యవసాయ భూమిపై తనకు హక్కులను రెవెన్యూ అధికారులు కల్పించారని రైతు శంభలింగ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉండగానే సోమవారం రాత్రి హాలహర్వి పోలీసులు మాన్యం భూమిని వదిలేయాల్సిందిగా రైతును హెచ్చరించారు. దీంతో మానసిక ఒత్తిడికిగురైన శంభలింగ మంగళవారం ఉదయం పురుగుల మందును తాగి ఇంట్లో స్పృహ తపి్ప పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు బంధువుల సహాయంతో వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి డాక్టర్లు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. టీడీపీ నాయకుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శంభలింగం సూసైడ్ నోటు రాసినట్లు అతడి బంధువులు విలేకరులకు తెలిపారు.