
రాకేశ్ (ఫైల్), దేవి (ఫైల్)
చందంపేట: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరన్న భయంతో ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు ఉరేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా.. దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన అందుగుల భిక్షమయ్య, మార్తమ్మ దంపతుల కుమారుడు రాకేశ్(20) డిగ్రీ చదువును మధ్యలోనే వదిలేసి కూలి పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.
కొండమల్లేపల్లి మండలం దోనియాల గ్రామానికి చెందిన వరికుప్పల కృష్ణయ్య, జయమ్మ దంపతుల కుమార్తె దేవి(16) దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇంటర్ చదువుతోంది. దేవి గతేడాది చింతపల్లి మండల పరిధిలోని మోడల్ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న సమయంలో రాకేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఇటీవల ఇరువురూ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో రాకేశ్ కుటుంబసభ్యులు సానుకూలంగా ఉండగా దేవి తరఫు బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో దేవి ఆదివారం రాకేశ్‌కు ఫోన్ చేసి తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, నేను వేరొకరిని పెళ్లి చేసుకుని బతకలేనని, వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరింది. దీంతో రాకేశ్ అదే రోజు ఆమెను ఇంటి నుంచి తీసుకొచ్చి బైక్‌పై నేరెడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామ శివారులోని ఉచ్చలబుడ్డి వద్దకు చేరుకున్నారు.
తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆపై చెట్టుకు తాడుతో ఉరి వేసు కున్నారు. కాచరాజుపల్లి గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు క్షమించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment