న్యాయమూర్తి మందలించారని ఓ వ్యక్తి , న్యాయమూర్తి ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు
కొత్తూరు(శ్రీకాకుళం జిల్లా): న్యాయమూర్తి మందలించారని ఓ వ్యక్తి , న్యాయమూర్తి ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. హిర మండలానికి చెందిన చెక్క సోమేశుకు 2009లో వివాహం అయింది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత భార్యను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో భరణం కోసం కోర్టుకు వెళ్లిన ఆయన భార్యకు నెలకు రూ.600 భరణంగా చెల్లిస్తున్నాడు.
అయితే ఈ డబ్బులు సరిపోవడం లేదని నెలకు మూడు వేల రూపాయిలు ఇవ్వాలని భార్య మళ్లీ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు భార్య అభ్యర్థన మేరకు రూ.3 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వ్యవసాయ కూలీ అయిన తాను అంత మొత్తం ఇవ్వలేనని కోర్టులో చెప్పగా జడ్జి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన సోమేశు వెంట తెచ్చుకున్న పురుగుల మందు జడ్జి ముందే తాగాడు. అక్కడ ఉన్నవారు వెంటనే కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.