ఏ మట్టిని నమ్ముకుని బతికాడో ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఏ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడో ఆ పంట మధ్యనే ఊపిరి వదిలేశాడు. పంటను కాపాడుకోవాలనే ఆత్రుత లో తన ప్రాణానికి ఏమవుతుందో ఆలోచించడం మానేశాడు. ఫలితంగా అయిన వారికి కన్నీళ్లు మిగిల్చి కన్నుమూశాడు. పురుగు మందు కొట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని తెలుసుకోలేని ఓ రైతు ఆ అజాగ్రత్త వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఓ చిన్న వస్త్రం ముఖానికి కట్టుకుని ఉంటే కుటుంబంతో చక్కగా నవ్వుతూ ఉండేవారు. సాగులో ఆధునిక పద్ధతులు పంటకే కాదు రైతుల ప్రాణాలకూ రక్షణగా నిలుస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : వీరఘట్టం మండలం సంత–నర్శిపురంలో పడాల గోవిందరావు(51) అనే కౌలు రైతు పత్తి పంటకు పురుగు మందు కొట్టి ఆ అవశేషాలు శ్వాసలో చేరి మంగళవారం చనిపోయారు. గోవిందరావు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఐదేళ్లుగా పత్తి పంటను పండిస్తున్నారు. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు పురుగు ఆశించింది.
ఆదిలోనే జాగ్రత్తలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చునని భావించి మంగళవారం తెల్లవారుజామున పురుగుమందు స్ప్రే చేశారు. కానీ జాగ్రత్తలేవీ పాటించలేదు. గాలి వీచే దిశకు ఎదురుగా పురుగు మందు స్ప్రే చేయడంతో ఆ మందు అవశేషాలు అతని శ్వాసలో కలిసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల ఉన్న రైతులు ఆయనను గమనించి అతడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేశారు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేలోగానే ఆయన కన్ను మూశారు.
సంత–నర్శిపురంలో విషాద ఛాయలు
గోవిందరావుతో సన్నిహితంగా ఉండే చాలా మంది గ్రామస్తులు తెల్లవారి చూసిన వ్యక్తి గంటల వ్యవధిలోనే చనిపోయాడనే విషయం తెలియడంతో నివ్వెరపోయారు. ఆయన మృతితో సంత–సంతనర్శిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య బానమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోవిందరావు మృతి చెందడంతో వారు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment