Veeraghattam
-
బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
సాక్షి, వీరఘట్టం (మన్యం పార్వతీపురం): మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన స్థానికులైన భోగి ప్రదీప్ ఖాతా నుంచి రూ.7,500, భోగి ప్రదీప్‌కుమార్ ఖాతా నుంచి రూ.6,400, కస్పా ఉమాశంకర్‌ప్రసాద్ ఖాతానుంచి రూ.9,999లు గత నెల ఆగస్టు 13వ తేదీన విత్ డ్రా అయ్యాయి. డబ్బులు విత్ డ్రా అయినట్లు అదే రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు వారి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో విస్తుపోయిన వారు తమకు తెలియకుండా డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయి? ఎవరు విత్ డ్రా చేశారోనని తలలు పట్టుకున్నారు. ఆగస్టు 13 రెండవ శనివారం కావడంతో సాయంత్రం 4 గంటలకే బ్యాంకు మూసేశారు. మరుసటి రోజు ఆగస్టు 14న ఆదివారం, సోమవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకుకు వరుస సెలవులు ఇచ్చారు. దీంతో వారు ఆగస్టు 16న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ జయరామ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించి ఆధార్‌కార్డు నంబర్ ఆధారంగా 2230250000–222515304293 నంబర్ గల కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. అయితే కస్టమర్ సర్వీసు సెంటర్ ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించలేమని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. బాధితుడు ప్రదీప్ కుమార్ మూడు వారాలు గడుస్తోంది యూనియన్ బ్యాంకు ఖాతాల నుంచి తమ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినా ఇంత వరకు బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఒకరైన భోగి శ్రీధర్ శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఇంత వరకు ఏ చర్యలు చేపట్టారో చెప్పండని బ్యాంకు సిబ్బందిని ప్రశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు మేనేజరు సెలవులో ఉన్నారని, రెండు రోజుల తర్వాత రావాలని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి వీరి ముగ్గురి డబ్బులే విత్ డ్రా అయ్యాయా? లేక ఇంకవరివైనా విత్ డ్రా అయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఈ సైబర్ క్రైమ్‌ను ఛేదించి ఖాతాదారులకు భరోసా కల్పించాలని బ్యాంక్ సిబ్బందిని పలువురు కోరుతున్నారు. -
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి
వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన గేదెల తుషార్‌రావు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. తుషార్‌రావు తండ్రి నారాయణరావు (దాసునాయుడు) ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన సుప్రీంకోర్డు న్యాయవాదిగా పనిచేశారు. న్యాయవాది కుటుంబంలో పుట్టిన తుషార్‌రావు ఇన్నాళ్లూ ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ జడ్జిగా నియామకమయ్యారు. గ్రామానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం రావడం గర్వంగా ఉందని వీరఘట్టం జెడ్పీటీసీ సభ్యురాలు జంపు కన్నతల్లి, ఆయన మేనల్లుడు ధనుకోటి శ్రీధర్ పేర్కొన్నారు. (చదవండి: అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్) -
ఆర్టీసీ బస్సులో నిద్రలోకి జారుకున్న మహిళ.. తెగిపడిన చేయి..
వీరఘట్టం(పార్వతీపురం మన్యం జిల్లా): అతివేగంతో వస్తున్న ఆటో బస్సును రాసుకుంటూ వెళ్లిపోవడంతో ఓ ప్రయాణికురాలి చేయి తెగి పడిపోయిన సంఘటన వీరఘట్టంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరఘట్టం మండలం నడిమికెల్లకు చెందిన పేలూరి పైడితల్లి శనివారం ఉదయం శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం నుంచి పాలకొండ వరకు త్రీ స్టాప్ బస్సులో వచ్చింది. చదవండి: ఎస్ఐ మృతిపైనా ‘పచ్చ’ రాజకీయమే! అక్కడ నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఉండే మూడో సీట్లో విండో పక్కన కూర్చుంది. బస్సు వీరఘట్టం వట్టిగెడ్డ వంతెన దాటిన తర్వాత పైడితల్లి చేయిని బయటకు పెట్టి నిద్రలోకి జారుకుంది. అక్కడకు కొద్దిసేపటికి బస్సు జిల్లా పరిషత్ హైసూ్కల్‌కు చేరుకునే సరికి ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటో.. బస్సును రాసుకుంటూ పోవడంతో ఆటో పైనుండే రాడ్ తగిలి పైడితల్లి చేయి తెగి పడిపోయింది. వెంటనే బాధితురాలు కేకలు వేయడంతో బస్సుని నిలిపివేశా రు. సహచర ప్రయాణికులు బాధితురాలిని వీరఘట్టం సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అ నంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. -
మైనర్ ప్రేమ వ్యవహారం.. ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకుంటే..
సాక్షి, శ్రీకాకుళం: తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకురాకపోతే సెల్‌టవర్ నుంచి దూకేస్తానంటూ పదో తరగతి విద్యార్థి హల్చల్ సృష్టించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కథ సుఖాంతమైంది. వీరఘట్టం గాసీ వీధికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరఘట్టం నుంచి విశాఖపట్నం వెళ్లే కాయగూరల వాహనాలకు క్లీనర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో విశాఖలో 19 ఏళ్ల అమ్మాయితో ఏడాది కిందట పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ వారం రోజుల కిందట ఆ అమ్మాయిని వీరఘట్టం తీసుకువచ్చాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు గురువారం వీరఘట్టం వచ్చి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో విశాఖ వెళ్లిపోయింది. చదవండి: భర్తతో విసిగిపోయిన భార్య .. సుపారీ ఇచ్చి.. పక్కా ప్లాన్‌తో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అబ్బాయి సాయంత్రం 5 గంటల సమయంలో వీరఘట్టంలోని సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అమ్మాయిని తీసుకురాకపోతే టవర్ పైనుంచి దూకేస్తానని చెప్పడంతో స్థానికు లు వీరఘట్టం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పాలకొండ ఫైర్ సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని అబ్బాయితో చాకచక్యంగా మాట్లాడి రాత్రి 8 గంటల సమయంలో టవర్ పైనుంచి కిందకు దించా రు. దీంతో మూడు గంటల ఉత్కంఠకు తెరపడింది. -
అప్పట్లో ఒకరుండేవారు..
వీరఘట్టం: గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఆయన ఎగరేసిన గాథలను పిల్లలకు చెప్పే కథల్లో కలపడం మర్చిపోయింది. విజయనగరాధీశులు గర్వంగా చెప్పుకునే పంచరత్నాల్లో ఒకరైన సిక్కోలు ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి 138వ జయంతి రేపు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి స్మరణలో.. బహుముఖ ప్రజ్ఞాశాలి రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహ దారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా చేసేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. ఆయన తర్వాత కాలంలో విజయనగరంంలో ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. (చదవండి: విధ్వంసం: నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త!) 20 ఏళ్ల వయస్సులోనే.. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలు సులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. (చదవండి: మార్టూరులో కలకలం..) బ్రహ్మచారి.. కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. స్వచ్ఛమైన శాకాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి, రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేశాడట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందట. కోడి రామ్మూర్తినాయుడు బల ప్రదర్శన ఊహాచిత్రం అనేక అవార్డులు.. ►అప్పట పూనాలో లోకమాన్య తిలక్ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. ►హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. ►అప్పటి వైస్రాయి లార్డ్ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. ►అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. ►లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్ హెర్క్యులస్’ బిరుదునిచ్చారు. ► స్పెయిన్‌లోని బుల్ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ►జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. ఇలా బయటపడింది.. ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది. అల్లరి పిల్లాడి నుంచి చిచ్చర పిడుగులా.. ఇండియన్ హెర్క్యులస్. కళియుగ భీముడు. మ ల్ల మార్తాండ.. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిరుదులు గడించి ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బా హుబలి కోడి రామ్మూర్తి నాయుడు. వీరఘట్టం ఈయన స్వస్థలం అని చెప్పుకోవడం జిల్లా వా సులకు ఎప్పటికీ గర్వకారణం. వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తి నాయుడు జని్మంచారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి నాయుడు తండ్రి సంరక్షణలో గారాబంగా పెరిగారు. బా ల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో తండ్రి వెంకన్న బాల్యంలోనే కొడుకుని చదువు కోసం వీరఘట్టం నుంచి విజయనగరంలో ఉన్న అతని త మ్ముడు నారాయణస్వామి(రామ్మూర్తి పిన తండ్రి) ఇంటికి పంపించారు. అక్కడ కూడా రామ్మూర్తికి చదువు అబ్బలేదు. విద్య కంటే వ్యాయామంపైనే ఎక్కు వ ఆసక్తి చూపుతూ పలు మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక రామ్మూర్తికి చదువు వంటపట్టదని గ్రహించిన పిన తండ్రి అతడిని మద్రాసు పంపించి వ్యా యామ కళాశాలలో చేరి్పంచారు. తర్వాత అక్కడే పీడీగా పనిచేశారు. ఆఖరులో.. ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దా నాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు. వెండితెరపై.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు గత ఏడాది కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడ పరి స్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ హీరో దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ విషయంపై సినిమా ప్రస్తావన రాలేదు. ఆయన మా చిన్న తాతయ్య.. రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. నా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నా ను. నేను ఆయన్ని ఏనాడూ చూడలేదు. మానాన్న గారు చెప్పేవారు. మీ చిన్న తాత దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదిస్తున్నాడని. అలాంటి వ్యక్తిని మనవడిని అయినందుకు గర్వంగా ఉంది. – కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తి నాయుడి మనవడు, వీరఘట్టం పాఠ్యాంశాల్లో చేర్చాలి ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కలి్పంచాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన మహానుభా వుని చరిత్రను భారత ప్ర భుత్వం గుర్తించాలి. వీరఘట్టంకు చెందిన ప్రసిద్ధ మల్లయోదుడు రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర నేడు ఎందరికో ఆదర్శం. – డాక్టర్ బి.కూర్మనాథ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం -
జాగ్రత్త తీసుకుని ఉంటే బతికేవాడే
ఏ మట్టిని నమ్ముకుని బతికాడో ఆ మట్టిలోనే కలిసిపోయాడు. ఏ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడో ఆ పంట మధ్యనే ఊపిరి వదిలేశాడు. పంటను కాపాడుకోవాలనే ఆత్రుత లో తన ప్రాణానికి ఏమవుతుందో ఆలోచించడం మానేశాడు. ఫలితంగా అయిన వారికి కన్నీళ్లు మిగిల్చి కన్నుమూశాడు. పురుగు మందు కొట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాలని తెలుసుకోలేని ఓ రైతు ఆ అజాగ్రత్త వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఓ చిన్న వస్త్రం ముఖానికి కట్టుకుని ఉంటే కుటుంబంతో చక్కగా నవ్వుతూ ఉండేవారు. సాగులో ఆధునిక పద్ధతులు పంటకే కాదు రైతుల ప్రాణాలకూ రక్షణగా నిలుస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : వీరఘట్టం మండలం సంత–నర్శిపురంలో పడాల గోవిందరావు(51) అనే కౌలు రైతు పత్తి పంటకు పురుగు మందు కొట్టి ఆ అవశేషాలు శ్వాసలో చేరి మంగళవారం చనిపోయారు. గోవిందరావు 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఐదేళ్లుగా పత్తి పంటను పండిస్తున్నారు. మూడు రోజు లుగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటకు పురుగు ఆశించింది. ఆదిలోనే జాగ్రత్తలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చునని భావించి మంగళవారం తెల్లవారుజామున పురుగుమందు స్ప్రే చేశారు. కానీ జాగ్రత్తలేవీ పాటించలేదు. గాలి వీచే దిశకు ఎదురుగా పురుగు మందు స్ప్రే చేయడంతో ఆ మందు అవశేషాలు అతని శ్వాసలో కలిసి పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల ఉన్న రైతులు ఆయనను గమనించి అతడిని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేశారు. వైద్యుని వద్దకు తీసుకెళ్లేలోగానే ఆయన కన్ను మూశారు. సంత–నర్శిపురంలో విషాద ఛాయలు గోవిందరావుతో సన్నిహితంగా ఉండే చాలా మంది గ్రామస్తులు తెల్లవారి చూసిన వ్యక్తి గంటల వ్యవధిలోనే చనిపోయాడనే విషయం తెలియడంతో నివ్వెరపోయారు. ఆయన మృతితో సంత–సంతనర్శిపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య బానమ్మ, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గోవిందరావు మృతి చెందడంతో వారు కంటికీ మింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. -
హెచ్ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు
తల్లిదండ్రులు చేసిన తప్పు ఆ పాపకు శాపంగా మారింది. చేరదీయాల్సిన గురువులే ఆమెను దూరం పెట్టడంతో ఆమెకు కన్నీరే మిగిలింది. వీరఘట్టం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినికి హెచ్ఐవీ ఉన్నట్టు తెలియడంతో సిబ్బంది ఇంటికి పంపేశారు. ఊరడించి, ధైర్యం చెప్పాల్సిన వారే వివక్ష చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపకు ఈ వ్యాధి సోకింది. కొన్నేళ్ల తర్వాత అమ్మ చనిపోయింది. ఆ తర్వాత తండ్రి ఏమయ్యాడో తెలీదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పాప వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దే ఉంటూ చదువుకునేది. ఆమెను ఈ ఏడాదే కేజీబీవీలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆమె నిత్యం మందులు వాడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు మందులు వాడుతుందోనని కేజీబీవీ సిబ్బంది బిటివాడ పీహెచ్సీలో వైద్య తనిఖీలు చేయిం చారు. ఈ పాపకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలి కను వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దకు పం పించేశారు. వారం రోజులవుతున్నా కేజీబీవీ సి బ్బంది నుంచి ఇంత వరకు పిలుపు రాలేదు. మందులు వాడడమే గానీ తనకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం కూడా ఆ బాలికకు తెలీదు. ఆ బాలిక పరిస్థితిని చూసి అందరి మనసులు తల్లడిల్లిపోతున్నాయి. ఏ పాపం చేయని బాలికపై కేజీబీవీ సిబ్బంది వివక్ష చూపడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. బాల్యం నుంచే కష్టాలు... చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ బాలిక వీరఘట్టంలో ఉన్న తాత వద్ద ఉంటోం ది. 1 నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం కోమటివీధి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. తర్వాత 6వ తరగతి వీరఘట్టం బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఇంటి వద్ద పాప ఆలనా పాలనా చూసేందుకు తాతకు ఇబ్బందిగా ఉండడంతో రెసిడెన్షియల్ విద్య ఉన్న కేజీబీవీలో ఈ ఏడాది 7వ తరగతిలో చేర్పించారు. సమాజానికి ఇచ్చే సందేశమిదేనా? ప్రతి ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం రోజున.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ర్యాలీలు చేసి స్పీచ్‌లు ఇచ్చే ఉపాధ్యాయులు ఓ బాలికపై ఇటువంటి వివక్ష చూపించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌లో ఓ బాలుడికి హెచ్ఐవీ ఉందని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వనందున అక్కడ ప్రధానోపాధ్యాయుడిని ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వీరఘట్టం కేజీబీవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ వివరణ ఈ విషయంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ అమరావతిని సాక్షి వివరణ కోరగా.. ఆ బాలికకు హెచ్ఐవీ ఉందని తెలిస్తే మిగిలిన బాలికలు కంగారు పడతారనే ఉద్దేశంతో ఇంటికి పంపించేశామని చెప్పా రు. బాలికను మళ్లీ ఇక్కడ చేర్చుకుని తర్వాత శ్రీకాకుళంలో వీరి కోసం ప్రత్యేకంగా ఉన్న హోంకు పంపిస్తామన్నారు. -
సిగ్గు..సిగ్గు!
వీరఘట్టం శ్రీకాకుళం : అన్ని విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు ఉండాల్సిందే. మరుగు సమస్య లేకుండా చూడాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశం ఇది. అయితే ఈ ఆదేశం అన్నిదగ్గర్ల అమలవుతోందో..లేదో తెలియదుగాని..వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మాత్రం అమలు జరగడం లేదు. ఇక్కడ 200 మంది అమ్మాయిలతోపాటు.. మరో 250 మంది మగపిల్లలు చదువుతున్నారు. అందుకుతగ్గట్టుగా మరుగుదొడ్లు లే వు. దీంతో అత్యవసర సమయంలో సమీపంలో ని తుప్పలు, డొంకల చాటుకు వెళ్లాల్సి రావడం సిగ్గుపడాల్సి విషయమే. ఈ కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పలుమార్లు అధికారులను కోరా రు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. పరిస్థితి ఇదీ సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉన్న వీరఘట్టం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల లేమితో విద్యార్థినీ విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వీరఘట్టం, వంగర, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన పిల్లలు ఇంటర్ చదువుకు ఈ కళాశాలలో చేరుతుంటారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీ య సంవత్సరం కలిపి సుమారు 450 మంది పిల్లలు ఉండగా.. వీరిలో 200 మంది అమ్మాయిలు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. అది కూడా శిథిలమైంది. దీంతో మరుగు సమస్యతో నిత్యం విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయంలో కాలేజీకి సమీపంలో ఉన్న తుప్పులు..డొంగల వైపు వెళ్లలేక బాలికలు బాధపడుతున్నారు. పట్టించుకోని ఇంటర్ బోర్డు ! ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డు కళాశాలలో మౌలి క వసతుల కల్పనకు చర్యలు చేపట్టకపోవడం దారుణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు తమ పిల్లలు ఇబ్బందులు పడాలని ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం కళాశాలలో మరుగుదొడ్ల సమస్యతో విద్యార్థులు, స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బిల్లింగ్‌ల కొరతకూడా ఉంది. ఇటీవల కొత్తగా విధుల్లో చేరాను. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. – పి.శంకరరావు, ప్రిన్సిపాల్, వీరఘట్టం జూనియర్ కాలేజీ ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం కళాశాలలో చేరి ఏడాది గడిచింది. మా సమస్యలను ఎవరితో చెప్పుకోలేక నిత్యం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న ఒక మరుగుదొడ్డి కూడా శిథిలమైంది. – కె.నాగమణి, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆరుబయటకు వెళ్తున్నాం మరుగుదొడ్లు లేకపోవడంతో అత్యవసరవేళ ఆరుబయటకు వెళ్తున్నాం. సిగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మరుగుదొడ్లు నిర్మించి మా ఇబ్బందులు తీర్చాలి. – ఎ.సుశీల, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని -
వంటనూనె మంట
వీరఘట్టం శ్రీకాకుళం : మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అవస్థలు పడుతున్న ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుగా వంటనూనెల ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవి అమాంతంగా ఒకేసారి పెరగడంతో ప్రజలు నూనె జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానుండటంతో ఇక వంటకాలు ఎలా చేసుకోవాలి దేవుడా.. అంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.82.50 లక్షల భారం జిల్లాలో 2.50 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతీ కుటుంబం సరాసరిన 3 లీటర్ల వంటనూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లీటరుకు సరాసరిన రూ.11 ప్రస్తుత ధరల ప్రకారం పెరిగింది. దీంతో ప్రతీ కుటుంబంపై నెలకు రూ.33 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా ప్రజల నెలకు వంటనూనెల రూపంలో రూ.82.50 లక్షల భారం పడనుంది. మార్కెట్‌కి వెళ్లాలంటే భయపడుతున్న వైనం సాధారణంగా వంటనూనెల కోసం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, రైస్‌బ్రాన్ ఆయిల్, కార్న్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, జంజీర్ ఆయిల్, ఆవనూనె, కొబ్బరినూనెలు విరివిరిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొబ్బరినూనె అర లీటరు రూ.166 నుంచి రూ.199కి పెరిగింది. ప్రస్తుతం రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌కు మాత్రమే ప్రభుత్వం ధర పెంచింది. దీంతో వంట నూనెలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే వినియోగదారులు భయపడుతున్నారు. ఇక పండగలకు, వివాహాది శుభకార్యాలకు పిండి వంటలు వండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. హోటళ్లపై నూనె ధరల ప్రభావం ఇంటిలోనే కాకుండా హోటళ్లకు వెళ్తే అక్కడా నూనె ధరల ప్రభావంతో భోజనం, టిఫిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. వీటితోపాటు మిఠాయిలు, తినుబండారాలు, ఇలా ఒకటేమిటి నూనెలో వేగించే ప్రతీ వస్తువు ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వేపుడు వంటలంటే భయపడాల్సిందే నూనెల ధరలు పెరగడంతో వంటగదిలో ఉడకబెట్టిన కూరలు తప్ప వేపుళ్లంటే భయపడాల్సిం దే. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం కూరలు వండాలన్న ఆర్థిక ఇబ్బందులు తప్పవు. – కే శ్రీదేవి, గృహిణి, వీరఘట్టం పిండి వంటలు వండుకోలేం పండగలకు, ఉత్సవాలకు పిండివంటలు వండుకోలేం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రభుత్వం నూనె ధరలు పెంచితే సామాన్యులు ఎలా బతికేది? – దుప్పాడ ఇందు, గృహిణి, వీరఘట్టం -
మే ఒకటి నుంచి జ్ఞానధార!
సర్కారు బడుల్లో చదువుతూ వెనుకబడిన విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ సం కల్పించింది. ‘జ్ఞానధార’ పేరుతో మే ఒకటి నుంచి నెలరోజుల పాటు కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ సీ–గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులు, 9వ తరగతిలో డీ–1, డీ–2 గ్రేడ్ విద్యార్థులు శిక్షణకు అర్హులు. వీరికి నెలరోజుల పాటు తెలుగు, ఇంగ్లిషు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వనున్నారు. వీరఘట్టం : చదువులో వెనుకబడిన విద్యార్థులపై విద్యాశాఖ దృష్టిసారించింది. జ్ఞానధార పేరుతో పాఠాలు చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో 5వ తరగతి విద్యార్థులకు కో ఎడ్యుకేషన్, 9వ తరగతి విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చేందుకు 61 కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ నెల రోజుల పాటు ఈ కేంద్రాల్లో మూడు పూటలా భోజనం పెడుతూ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇదీ విషయం వెనుకబడిన విద్యార్థులకు గతంలో వేసవిలో పునశ్చరణ తరగతులు నిర్వహించేవారు. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి రెసిడెన్షియల్‌గా పర్యవేక్షణ చేసి జ్ఞానధారగా అధికారులు పేరుమార్చారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం,సైన్సు సబ్జెక్టు ఉపాధ్యాయులుతో పాటు ఎస్జీటీ ఒకరు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు జ్ఞానధార కార్యక్రమాన్ని నెల రోజులు నిర్వహిస్తారు. 5వ తరగతిలో వెనుకబడి 6వ తరగతికి రానున్న వారు, అలాగే 9వ తరగతిలో వెనుకబడి 10వ తరగతికి రానున్న విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల రోజులు శిక్షణ ఇవ్వనున్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ (ఆర్థికపరమైన సెలవులు) ఇవ్వనున్నారు. ఎంత మందిని ఎంపిక చేశారంటే.. జిల్లా వ్యాప్తంగా 20,421 మంది విద్యార్థులను జ్ఞానధార శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో 3,758 మంది 5వ తరగతిలో సీ–గ్రేడ్‌లో ఉన్నవారు ఉండగా.. 1,906 మంది బాలికలు, 1,852 మంది బాలురు ఉన్నారు. అలాగే 9వ తరగతిలో 16,663 మంది డీ–1,డీ–2 గ్రేడ్ విద్యార్థులను గుర్తించారు. వీరిలో బాలికలు 8,324 మంది, బాలురు 8,339 మంది ఉన్నారు. 9వ తరగతి విద్యార్థులకు మాత్రం వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. గురుకుల బోధన.. గురుకుల పాఠశాలల్లో ఎలాంటి బోధన చేస్తారో.. జ్ఞానధార శిక్షణకు హాజరయ్యే వారికి అలాంటి బోధన చేయనున్నారు. ఉదయం 6 గంటలకే దినసరి చర్య ప్రారంభమవుతుంది. ఉదయం పాలు, తర్వాత బ్రేక్ ఫాస్ట్, ఇంటర్వల్ సమయంలో స్నాక్స్ అందిస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు. అలాగే సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం పెడతారు. ఉదయం, సాయంత్రం పిల్లలతో వ్యాయాం చేయిస్తారు. ఇలా గురుకుల బోధనతో కూడిన శిక్షణ ఇచ్చి వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలను విద్యాశాఖ రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చేబుతున్నారు. జ్ఞానధారపై నేడు సమీక్ష శ్రీకాకుళం : జ్ఞానధార కార్యక్రమంపై డివిజన్ల వారీగా అధికారులు గురువారం సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్జేడీ డి.దేవానందరెడ్డి జిల్లాకు రానున్నారు. పాలకొండ, శ్రీకాకుళంలో సమీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి పాలకొండ డివిజన్‌కు సంబంధించి, మధ్యాహ్నం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో శ్రీకాకుళంలో సమీక్ష ఉంటుంది. రానున్న విద్యా సంవత్సరానికి సబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిక్షణలు పిల్లల సమీకరణ, విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కావాల్సినటువంటి సూచనలు, మార్గదర్శకాలు, ప్రణాళిక తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. జ్ఞానధారతో ఎంతో మేలు జ్ఞానధార కార్యక్రమం వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ వేసవిలో నెల రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నాం. దీనికోసం నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఎస్జీటీ ఒకరు, వ్యాయామ ఉపాధ్యాయుడుని ఎంపిక చేస్తున్నాం. పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని రెండు రోజుల్లో ప్రకటన చేస్తాం. – ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం -
వీరఘట్టంలో చైన్‌స్నాచింగ్
వీరఘట్టం(శ్రీకాకుళం జిల్లా): వీరఘట్టంలోని ఓ హోటల్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. హోటల్ వద్ద పనిచేసుకుంటున్న జి. శ్రీదేవి అనే మహిళ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ.30లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం
వీరఘట్టం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో రూ.30 లక్షల విలువజేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రెండు ఇళ్లు, రెండు గోదాములపై పోలీసులు దాడులు నిర్వహించగా గుట్కాలు వెలుగు చూశాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేష్, శ్రీధర్ అనే ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశా నుంచి గుట్కాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. -
పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
-
పరుగులో గెలిచాడు.. ప్రాణాలు కోల్పోయాడు!
విశాఖపట్నం: సైన్యంలో చేరి భరతమాతకు సేవ చేద్దామనుకున్నాడు. పరుగు కూడా విపరీతంగా ప్రాక్టీసు చేశాడు. ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీకి వచ్చి, పరుగు పందెంలో అందరికంటే ముందు నిలిచాడు. కానీ పోటీ ముగిసిన వెంటనే అక్కడే సొమ్మసిల్లి పడిపోయి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం విశాఖపట్నంలో జరిగింది. వివరాలు... శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తుడి గ్రామానికి చెందిన నీలబాబు ఆర్మీ పరుగుపందెంలో పాల్గొన్నాడు. రేస్ పూర్తయిన తర్వాత మొదటి స్థానంలో నిలిచిన నీలబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఆ అభ్యర్థిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం సమయంలో నీలబాబు ప్రాణాలు కోల్పోయాడు. -
జిల్లాకు 1719 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు
వీరఘట్టం:జిల్లాలో అన్న అమృతహస్తం పథకం అమలుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా ఈ పథకం అమలవుతున్న వీరఘట్టం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, మందస, సారవకోట, ఇచ్ఛాపురం రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1719 న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ నియామకాలకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఇవీ న్యూట్రిషన్ కౌన్సెలర్ విధులు అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే న్యూట్రిషన్ కౌన్సిలర్ విధులు నిర్వహిస్తారు. గర్భిణులు, బాలింతలకు కేంద్రాల ద్వారా సక్రమంగా పౌష్టికాహరాన్ని అందించడం, కేంద్రాలకు రాలేని జిల్లాకు 1719 మంది న్యూట్రిషన్ కౌన్సెలర్లు గర్భిణుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించడం, ప్రమాదాల్లో ఉన్న మహిళలు, పిల్లలకు సహయసహకారాలు అందించడం వంటి పనులు చేయాలి. అంగన్వాడీ కార్యకర్తల్లాగే వీరికీ గౌరవ వేతనం(జీతం) ఉంటుంది. కమిటీల ద్వారా ఎంపిక కౌన్సెలర్లను కూడా ఎమ్మెల్యే, ఆర్డీవోలు నియోజకవర్గాల వారీగా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన స్థానిక మహిళలు ఈ పోస్టులకు అర్హులు. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 1261 ప్రధాన, 458 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో వీరిని నియమిస్తారు. ప్రాజెక్టులు.. పోస్టులు : వీరఘట్టం.. 160, పాలకొండ.. 175, సీతంపేట.. 231, కొత్తూరు.. 264, మందస.. 275, సారవకోట.. 303, ఇచ్ఛాపురం రూరల్.. 311. రెండు రోజుల్లో నోటిఫికేషన్ అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ కౌన్సెలర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆర్డీవో కార్యాలయాల నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అలాగే పలాస, కోటబొమ్మాళి ప్రాజెక్టుల్లో అన్న అమృతహస్తం పథకం అమలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. - పి. చక్రధర్, ఐసీడీఎస్ పీడీ -
ధర్మానకు భద్రత
వీరఘట్టం(పనసనందివాడ): వీరఘట్టం మం డలంలోని పనసనందివాడ-తలవరం వద్ద ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టిన ఇసుక ర్యాంప్ ప్రారంభానికి వచ్చిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను పనసనందివాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన ఇసుక ర్యాంపును తలవరం గ్రామస్తులకు ఎలా కట్టబెడతార ంటూసుమారు రెండువందల మంది ఆయన వాహనాన్ని చుట్టుముట్టి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుదూద్ తుపానుకు పూర్తిగా ముంపుకు గురై అష్టకష్టాలు పడితే కనీస సౌకర్యాలు కల్పించని పాలకులు ఇప్పుడు కాసులు కురిపించే ఇసుక ర్యాంప్ ప్రారంభానికి వస్తారా? అదీ తమ్ముళ్లకు కట్టబెట్టేందుకేనా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తామంతా దళిత కూలీలమని, పేదల పట్ల నిజంగా చిత్తశుద్ధిఉంటే ఇసుక ర్యాంప్‌ను తమకే అప్పగించాలని పట్టుబట్టారు. సర్పంచ్ కొరికాన సన్యాసినాయుడు, మరికొంతమంది పెద్దలు నచ్చజెప్పడంతో కాస్త శాంతించారు. అక్రమాలకు పాల్పడితే జైలే : విప్ అనంతరం జరిగిన సమావేశంలో విప్ రవి మాట్లాడుతూ ప్రతి పనిలోనూ చిన్నచిన్న లోటుపాట్లు సహజమని, అన్నింటినీ అధిగమించి ర్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇసుక ర్యాంప్‌లో అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామన్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను సరిదిద్దాలని, సామాన్యులకు అందుబాటులో ఇసుక ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఎంపీపీ ప్రతినిధి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలవలస విక్రాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నిమ్మక జయకృష్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ ఖండాపు జ్యోతి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. -
బోగస్ కార్డుల ఏరివేతకు రంగం సిద్ధం
వీరఘట్టం: వీరఘట్టం మండలంలో ఉన్న బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘బియ్యం బొక్కుతున్న ‘తెల్ల’దొరలు’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. జిల్లా అధికారుల నుంచి తహశీల్దార్ ఎం.వి.రమణకు వచ్చిన ఆదేశాల మేరకు బోగస్ కార్డుల ఏరివేతకు రెవెన్యూ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో అనర్హులకు రేషన్‌కార్డులు ఉన్న విషయాన్ని గుర్తించామని, ఇకపై మరింత వేగవంతంగా ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అనర్హులకు రేషన్ కార్డులు ఉన్న విషయాన్ని ఎవరైనా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే వారి పేర్లును గోప్యంగా ఉంచడంతో పాటు అక్రమాలకు పాల్పడేవారిని శిక్షిస్తామని స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటు అర్హత కలిగిన వారు ఉంటే రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, ఇప్పటికే అర్హత లేక తెల్లరేషన్‌కార్డులు వినియోగిస్తున్న వారు స్వచ్ఛందంగా అప్పగిస్తే వారిని అభినందిస్తామంటున్నారు. -
పోలీస్ రాజ్!
వీరఘట్టం, న్యూస్‌లైన్: సమాజంలో శాంతిభద్రతలు పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం.. మొ త్తంగా ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిలో విశ్వాసం పెంచాల్సిన పోలీసు వ్యవస్థ వీరఘ ట్టం మండలంలో గాడి తప్పుతోంది. గత కొంతకాలంగా వీరఘట్టం పోలీస్ ఠాణాలోని కొందరు సిబ్బంది వ్యవహార శైలి, కేసులపై స్పందిస్తున్న తీరు తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. సామాన్యుల నుంచి వ్యాపారస్తుల వరకు స్టేషన్ గడప ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మామూళ్ల మత్తులో అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్న కొందరు సిబ్బంది వల్ల అమాయకులు అన్యాయమైపోతున్నారు. రాజీల పేరుతో ఇక్కడ జరుగుతున్న తతంగం దీనిపై సెటిల్మెంట్ల స్టేషన్ అన్న ముద్ర వేస్తోంది. కొద్దిమంది అక్రమ చర్యల వల్ల స్టేషన్ మొత్తం అపప్రదను మూటగట్టుకుంటోందన్న విషయాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ స్టేషన్ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇక్కడి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుకాసురులతో రహస్య ఒప్పందాలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఇటు పర్యావరణాన్ని.. అటు ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న ఇసుకాసురులతో రహస్య ఒప్పందాలు చేసుకొని అక్రమ రవాణాకు మార్గం సుగమం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని నాగావళి తీర ప్రాంతాలైన పనసనందివాడ, బిటివాడ, చిదిమి, కడకెల్ల, విక్రమపురం, మొట్టవెంకటాపురంతో పాటు స్థానిక ఒట్టిగెడ్డలో నిత్యం పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీసులకు తెలియకుండా ఇదంతా జరగడం లేదు. వీరి నుంచి ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బెదిరించి మరీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ట్రాక్టర్ యజమానులు చెబుతున్నారు. అలాగే మద్యం షాపు యజమానులు, బెల్టుషాపులు నిర్వహించే వారు, ఇతర అక్రమ వ్యాపారాలు చేసే వారంతా స్టేషన్ మామూళ్ల పేరిట నెలనెలా వేలాది రూపాయలు సమర్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేసుల నమోదు విషయంలో ఇక్కడి సిబ్బంది అనుసరిస్తున్న తీరు ఫిర్యాదు చేసేందుకే వెనుకంజ వేసేలా చేస్తోంది. డబ్బులు ఇస్తే ఒకలా.. ఇవ్వకపోతే ఒకలా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇటువంటి కొన్ని ఆరోపణలు పరిశీలిస్తే.. గత ఏడాది నవంబరులో ఓ కర్రల లారీని పట్టుకొని రూ. 60 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జనవరి 3వ తేదీన ఒక సంఘటనలో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ. 35 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. జనవరి 10న మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజనుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఇక రైస్ మిల్లర్ల నుంచి ప్రతి నెలా బియ్యం దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కడకెల్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా.. ఖాళీగా ఉన్నాయన్న నెపంతో వాటిని వదిలిపెట్టారు. చర్యలు తీసుకుంటా:ఎస్సై ఈ ఆరోపణలపై ఇటీవలే ఇక్కడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఆర్.శ్రీనివాసరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటానన్నారు. బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయినందున ఇంతకుముందు స్టేషన్లో ఏం జరిగిందో తెలియదన్నారు. అక్రమ వసూళ్లు, ఇతర ఆరోపణలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
వీరఘట్టంలో భారీ వర్షం
వీరఘట్టం, న్యూస్‌లైన్: వీరఘట్టం మండలంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వీరఘట్టం, నడిమికెల్ల, కంబర, విక్రమపురం, నడుకూరు, చిట్టిపుడివలస, చిదిమి, పాలమెట్ట, కొట్టుగుమ్మడ పంచాయతీల్లో కుండపోత వర్షం కురిసింది. కంబర గ్రామంలో తంపర గెడ్డ పొంగిపొర్లుతోంది. ఈ గెడ్డకు పోటెత్తడంతో సుమారు 50 ఎకరాల వరి నీట మునిగింది. వీరఘట్టం స్వామి థియేటర్ వెనుక ఉన్న పోతులగెడ్డ ఉప్పొంగడంతో ఈ ప్రాంతంలో సుమారు 80 ఎకరాలు వరిపంట జలమయమైంది. కిమ్మి రహదారిలో ఉన్న పిల్లకాలువలు పొంగడంతో ఇక్కడి 40 ఎకరాలు నీట మునిగాయి. మండల వ్యాప్తంగా వాగులు, వంకలు, గెడ్డలకు జలకళ ఉట్టిపడింది. ఒట్టిగెడ్డ, వెంకమ్మచెరువు, రాజచెరువు, నాయుడుకోనేరు, విశాగ్రామి చెరువులు పూర్తిగా నీటితో నిండిపోవడంతో జలకళ ఏర్పడింది. ఈ సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల పంట పొలాలన్ని నీటమునిగాయి. భారీ వర్షం కారణండా జెడ్పీ హైస్కూల్ మైదానం వర్షపునీటితో నిండిపోయింది. లక్ష విలువైన చేపలు గల్లంతు భారీ వర్షానికి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవిని తలపించే విధంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి శనివారం సాయంత్రం రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి వెంకమ్మ చెరువుకు వర్షపు నీరు చేరింది. దిగువ ప్రాంతంలోని చప్టా గుండా నీరు ప్రవహించడంతో మత్స్యకారులు చేపల కోసం ఏర్పాటు చేసిన వల పాడైంది. దీంతో చెరువులో ఉన్న విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయిందని మత్స్యకారులు చెప్పారు. వ్యాపారుల వద్ద అప్పులు చేసి చెరువులో చేప పిల్లలు పెంచుతున్నామని, అక్టోబరులో దసరాకు వేట చేసేందుకు సిద్ధం చేస్తుండగా భారీ వర్షం కారణంగా రూ.లక్ష విలువ కలిగిన చేపలు గల్లంతవడంతో తీవ్రంగా నష్టపోయామని మోసూరు జగన్నాథం, మోసూరు చిన్నారావు తదితరులు వాపోయారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వారు కోరారు.