తల్లిదండ్రులు చేసిన తప్పు ఆ పాపకు శాపంగా మారింది. చేరదీయాల్సిన గురువులే ఆమెను దూరం పెట్టడంతో ఆమెకు కన్నీరే మిగిలింది. వీరఘట్టం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినికి హెచ్‌ఐవీ ఉన్నట్టు తెలియడంతో సిబ్బంది ఇంటికి పంపేశారు. ఊరడించి, ధైర్యం చెప్పాల్సిన వారే వివక్ష చూపడంపై నిరసన వ్యక్తమవుతోంది.
సాక్షి, వీరఘట్టం(శ్రీకాకుళం) : తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపకు ఈ వ్యాధి సోకింది. కొన్నేళ్ల తర్వాత అమ్మ చనిపోయింది. ఆ తర్వాత తండ్రి ఏమయ్యాడో తెలీదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పాప వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దే ఉంటూ చదువుకునేది. ఆమెను ఈ ఏడాదే కేజీబీవీలో చేర్చారు. వైద్యుల సూచన మేరకు ఆమె నిత్యం మందులు వాడుతుంది. ఈ అమ్మాయి ఎందుకు మందులు వాడుతుందోనని కేజీబీవీ సిబ్బంది బిటివాడ పీహెచ్‌సీలో వైద్య తనిఖీలు చేయిం చారు.
ఈ పాపకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలి కను వీరఘట్టంలో ఉన్న తన తాత వద్దకు పం పించేశారు. వారం రోజులవుతున్నా కేజీబీవీ సి బ్బంది నుంచి ఇంత వరకు పిలుపు రాలేదు. మందులు వాడడమే గానీ తనకు ప్రాణాంతక వ్యాధి ఉందనే విషయం కూడా ఆ బాలికకు తెలీదు. ఆ బాలిక పరిస్థితిని చూసి అందరి మనసులు తల్లడిల్లిపోతున్నాయి. ఏ పాపం చేయని బాలికపై కేజీబీవీ సిబ్బంది వివక్ష చూపడం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి.
బాల్యం నుంచే కష్టాలు...
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ బాలిక వీరఘట్టంలో ఉన్న తాత వద్ద ఉంటోం ది. 1 నుంచి 5వ తరగతి వరకు వీరఘట్టం కోమటివీధి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. తర్వాత 6వ తరగతి వీరఘట్టం బాలికోన్నత పాఠశాలలో చదివింది. ఇంటి వద్ద పాప ఆలనా పాలనా చూసేందుకు తాతకు ఇబ్బందిగా ఉండడంతో రెసిడెన్షియల్ విద్య ఉన్న కేజీబీవీలో ఈ ఏడాది 7వ తరగతిలో చేర్పించారు.
సమాజానికి ఇచ్చే సందేశమిదేనా?
ప్రతి ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం రోజున.. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ర్యాలీలు చేసి స్పీచ్‌లు ఇచ్చే ఉపాధ్యాయులు ఓ బాలికపై ఇటువంటి వివక్ష చూపించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నా రు. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌లో ఓ బాలుడికి హెచ్‌ఐవీ ఉందని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వనందున అక్కడ ప్రధానోపాధ్యాయుడిని ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వీరఘట్టం కేజీబీవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రిన్సిపాల్ వివరణ
ఈ విషయంపై కేజీబీవీ ప్రిన్సిపాల్ అమరావతిని సాక్షి వివరణ కోరగా.. ఆ బాలికకు హెచ్‌ఐవీ ఉందని తెలిస్తే మిగిలిన బాలికలు కంగారు పడతారనే ఉద్దేశంతో ఇంటికి పంపించేశామని చెప్పా రు. బాలికను మళ్లీ ఇక్కడ చేర్చుకుని తర్వాత శ్రీకాకుళంలో వీరి కోసం ప్రత్యేకంగా ఉన్న హోంకు పంపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment