అప్పట్లో ఒకరుండేవారు.. | Special Story On Bodybuilder Kodi Ramamurthy | Sakshi
Sakshi News home page

అప్పట్లో ఒకరుండేవారు... 

Published Mon, Nov 2 2020 11:10 AM | Last Updated on Mon, Nov 2 2020 1:53 PM

Special Story On Bodybuilder Kodi Ramamurthy - Sakshi

కోడి రామ్మూర్తి నాయుడు చిత్రపటం-వీరఘట్టంలో రామ్మూర్తినాయుడు జన్మించిన గృహం 

వీరఘట్టం: గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోపితే చిరునవ్వుతో మోసేవారు. ఉక్కు సంకెళ్లతో ఒంటిని బంధిస్తే ఊపిరితిత్తుల నిండా గాలి బిగించి రెండు క్షణాల్లో తెంపేసేవారు. ఏనుగు ఛాతీ మీదకు ఎక్కితే ఐదు నిమిషాల పాటు ఆ బరువును మోయగలిగేవారు. ఆయన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. సిక్కోలు తొలితరం నిజమైన కథానాయకుడు. వెండితెరపై వెలిగిపోయిన బాహుబలికి బాబు లాంటి వారు. వందేళ్ల కిందట ఆయన చేసిన విన్యాసాలను ఈ తరం దాదాపు మర్చి పోయింది. సిక్కోలు కీర్తి బావుటాను దేశవిదేశాల్లో సగర్వంగా ఆయన ఎగరేసిన గాథలను పిల్లలకు చెప్పే కథల్లో కలపడం మర్చిపోయింది. విజయనగరాధీశులు గర్వంగా చెప్పుకునే పంచరత్నాల్లో ఒకరైన సిక్కోలు ముద్దుబిడ్డ కోడి రామ్మూర్తి 138వ జయంతి రేపు. ఈ సందర్భంగా ఆ మహానుభావుడి స్మరణలో..

బహుముఖ ప్రజ్ఞాశాలి 
రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జల స్తంభన విద్యను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహ దారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా చేసేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. ఆయన తర్వాత కాలంలో విజయనగరంంలో ఒక సర్కస్‌ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. (చదవండి: విధ్వంసం: నత్తలొస్తున్నాయ్‌ జాగ్రత్త!)

20 ఏళ్ల వయస్సులోనే.. 
రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలు సులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. (చదవండి: మార్టూరులో కలకలం..)

బ్రహ్మచారి.. 
కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. స్వచ్ఛమైన శాకాహారి అయిన ఈయన ఆంజనేయస్వామి భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి, రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేశాడట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందట.

కోడి రామ్మూర్తినాయుడు బల ప్రదర్శన ఊహాచిత్రం  

అనేక అవార్డులు.. 
అప్పట పూనాలో లోకమాన్య తిలక్‌ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చారు. దీంతో తిలక్‌ రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్‌ బిరుదులిచ్చారు. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వాలని ప్రోత్సహించారు. 
హైదరాబాద్‌లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదునిచ్చారు. 
అప్పటి వైస్రాయి లార్డ్‌ మింటో రామ్మూర్తి ప్రదర్శనలు చూ డాలని వచ్చి తనే కారును నడుపుతూ ఆ కారును రామ్మూర్తి ఆపేయడం చూసి ముగ్ధుడైపోయాడు. 
అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్‌ సభ జరిగింది. రామ్మూర్తి సర్కస్‌ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూసి అభినందించారు. పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు.   
లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి రామ్మూర్తి ప్రదర్శనలకు అభిమానులైపోయారు. వారే తమ రాజభవనానికి ఆహ్వానించి ‘ఇండియన్‌ హెర్క్యులస్‌’ బిరుదునిచ్చారు. 
► స్పెయిన్‌లోని బుల్‌ ఫైట్‌లో రామ్మూర్తి పంతులు పాల్గొన్న తీరును వేలాది మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారు.  
జపాన్, చైనా, బర్మాలలో రామ్మూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. 

ఇలా బయటపడింది..  
ఓ పుస్తక కథనం ప్రకారం కోడి రామ్మూర్తిలో ప్రతి భాపాటవాలు బయటపడడానికి ఓ సంఘటన దోహదపడింది. అప్పట్లో ఆయన విజయనగరంలో ఉండేటప్పుడు.. అదే నగరానికి చెందిన పేర్ల రామ్మూర్తి శెట్టి ఇంటి ముందట కాలువలో ఓ ఎద్దు పడిపోయింది. ఆ జమిందారు 20 మంది బలవంతులను రప్పించి ఎద్దును బయటకు లాగడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సరిగ్గా అదే సమయానికి అటుగా వస్తున్న రామ్మూర్తిని చూసి జమిందారు హాస్యంగా ‘అదిగో మన శాండోగారు వస్తున్నారు. మీరంతా తప్పుకోండి. తను ఒక్కరే ఆ ఎద్దును బయటపడేయగలడు’ అని అన్నారు. దీంతో రామ్మూర్తి ఆ ఎద్దు పరిస్థితిని గమనించి దాని వద్దకు వెళ్లి మెడను, వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని ఒకే ఉదుటన బయ ట పడేశారు. దీంతో రామ్మూర్తిలోని అసలు బలం అందరికీ ఆ ఘటనతోనే తెలియవచ్చింది.  

అల్లరి పిల్లాడి నుంచి చిచ్చర పిడుగులా.. 
ఇండియన్‌ హెర్క్యులస్‌. కళియుగ భీముడు. మ ల్ల మార్తాండ.. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిరుదులు గడించి ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన బా హుబలి కోడి రామ్మూర్తి నాయుడు. వీరఘట్టం ఈయన స్వస్థలం అని చెప్పుకోవడం జిల్లా వా సులకు ఎప్పటికీ గర్వకారణం. వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్‌ 3న రామ్మూర్తి నాయుడు జని్మంచారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి నాయుడు తండ్రి సంరక్షణలో గారాబంగా పెరిగారు. బా ల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో తండ్రి వెంకన్న బాల్యంలోనే కొడుకుని చదువు కోసం వీరఘట్టం నుంచి విజయనగరంలో ఉన్న అతని త మ్ముడు నారాయణస్వామి(రామ్మూర్తి పిన తండ్రి) ఇంటికి పంపించారు. అక్కడ కూడా రామ్మూర్తికి చదువు అబ్బలేదు. విద్య కంటే వ్యాయామంపైనే ఎక్కు వ ఆసక్తి చూపుతూ పలు మల్లయుద్ధం పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక రామ్మూర్తికి చదువు వంటపట్టదని గ్రహించిన పిన తండ్రి అతడిని మద్రాసు పంపించి వ్యా యామ కళాశాలలో చేరి్పంచారు. తర్వాత అక్కడే పీడీగా పనిచేశారు.

ఆఖరులో.. 
ఒకసారి బర్మాలో హత్యాయత్నం జరిగాక ఆయన ప్రదర్శనలకు అడ్డు పడింది. ఎంత డబ్బు గడించారో అంత కంటే గొప్పగా దా నాలు కూడా చేశారాయన. ఆఖరి రోజుల్లో ఆయన కాలిపై రాచపుండు వచ్చి కాలే తీసేయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎలాటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదని ఓ పుస్తకంలో పేర్కొని ఉంది. ప్రాణాయామం చేసి నిబ్బరంగా ఉండిపోయారట. చివరిరోజులు బలంఘర్, పాటా్నలో కలహండి (ఒడిశా) పరగణా ప్రభువు పోషణలో ఉంటూ 1942 జనవరి 16న కన్ను మూశారు.    

వెండితెరపై.. 
కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ తీసేందుకు గత ఏడాది కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడ పరి స్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ హీరో దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తర్వాత ఈ విషయంపై సినిమా ప్రస్తావన రాలేదు.

ఆయన మా చిన్న తాతయ్య.. 
రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. నా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నా ను. నేను ఆయన్ని ఏనాడూ చూడలేదు. మానాన్న గారు చెప్పేవారు. మీ చిన్న తాత దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ ఎంతో కీర్తి సంపాదిస్తున్నాడని. అలాంటి వ్యక్తిని మనవడిని అయినందుకు గర్వంగా ఉంది. 
– కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తి నాయుడి మనవడు, వీరఘట్టం 

పాఠ్యాంశాల్లో చేర్చాలి 
ఒకప్పుడు 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పా ఠ్యాంశం ఉండేది. కాలక్రమేణా సిలబస్‌ మారడంతో ఆ పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి సముచిత స్థానం కలి్పంచాలి. 
– ఎస్‌.వి.ఎల్‌.ఎన్‌ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం 

ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి 
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన మహానుభా వుని చరిత్రను భారత ప్ర భుత్వం గుర్తించాలి. వీరఘట్టంకు చెందిన ప్రసిద్ధ మల్లయోదుడు రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర నేడు ఎందరికో ఆదర్శం. 
– డాక్టర్‌ బి.కూర్మనాథ్, రిటైర్డ్‌ మెడికల్‌ ఆఫీసర్, వీరఘట్టం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement