తమ సమస్య ఏమైందని బ్యాంకు సిబ్బందిని అడుగుతున్న భోగి శ్రీధర్
సాక్షి, వీరఘట్టం (మన్యం పార్వతీపురం): మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన స్థానికులైన భోగి ప్రదీప్ ఖాతా నుంచి రూ.7,500, భోగి ప్రదీప్‌కుమార్ ఖాతా నుంచి రూ.6,400, కస్పా ఉమాశంకర్‌ప్రసాద్ ఖాతానుంచి రూ.9,999లు గత నెల ఆగస్టు 13వ తేదీన విత్ డ్రా అయ్యాయి. డబ్బులు విత్ డ్రా అయినట్లు అదే రోజు మధ్యాహ్నం 3.21 గంటలకు వారి ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో విస్తుపోయిన వారు తమకు తెలియకుండా డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయి? ఎవరు విత్ డ్రా చేశారోనని తలలు పట్టుకున్నారు. ఆగస్టు 13 రెండవ శనివారం కావడంతో సాయంత్రం 4 గంటలకే బ్యాంకు మూసేశారు.
మరుసటి రోజు ఆగస్టు 14న ఆదివారం, సోమవారం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకుకు వరుస సెలవులు ఇచ్చారు. దీంతో వారు ఆగస్టు 16న బ్యాంకుకు వెళ్లి మేనేజర్ జయరామ్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన వారి బ్యాంకు ఖాతాలు పరిశీలించి ఆధార్‌కార్డు నంబర్ ఆధారంగా 2230250000–222515304293 నంబర్ గల కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. అయితే కస్టమర్ సర్వీసు సెంటర్ ఏ ప్రాంతానికి చెందినదో గుర్తించలేమని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని ముంబైలోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి మెయిల్ చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.
బాధితుడు ప్రదీప్ కుమార్
మూడు వారాలు గడుస్తోంది
యూనియన్ బ్యాంకు ఖాతాల నుంచి తమ డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేసినా ఇంత వరకు బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బాధితుల్లో ఒకరైన భోగి శ్రీధర్ శుక్రవారం యూనియన్ బ్యాంకుకు వెళ్లి ఇంత వరకు ఏ చర్యలు చేపట్టారో చెప్పండని బ్యాంకు సిబ్బందిని ప్రశించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బ్యాంకు మేనేజరు సెలవులో ఉన్నారని, రెండు రోజుల తర్వాత రావాలని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి వీరి ముగ్గురి డబ్బులే విత్ డ్రా అయ్యాయా? లేక ఇంకవరివైనా విత్ డ్రా అయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే ఈ సైబర్ క్రైమ్‌ను ఛేదించి ఖాతాదారులకు భరోసా కల్పించాలని బ్యాంక్ సిబ్బందిని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment