జ్ఞానధార శిక్షణలో పాల్గొననున్న 9వ తరగతి విద్యార్థులు
సర్కారు బడుల్లో చదువుతూ వెనుకబడిన విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ సం కల్పించింది. ‘జ్ఞానధార’ పేరుతో మే ఒకటి నుంచి నెలరోజుల పాటు కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ సీ–గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులు, 9వ తరగతిలో డీ–1, డీ–2 గ్రేడ్ విద్యార్థులు శిక్షణకు అర్హులు. వీరికి నెలరోజుల పాటు తెలుగు, ఇంగ్లిషు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వనున్నారు.
వీరఘట్టం : చదువులో వెనుకబడిన విద్యార్థులపై విద్యాశాఖ దృష్టిసారించింది. జ్ఞానధార పేరుతో పాఠాలు చెప్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాల్లో 5వ తరగతి విద్యార్థులకు కో ఎడ్యుకేషన్, 9వ తరగతి విద్యార్థులకు వేర్వేరుగా శిక్షణ ఇచ్చేందుకు 61 కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ నెల రోజుల పాటు ఈ కేంద్రాల్లో మూడు పూటలా భోజనం పెడుతూ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు.
ఇదీ విషయం
వెనుకబడిన విద్యార్థులకు గతంలో వేసవిలో పునశ్చరణ తరగతులు నిర్వహించేవారు. ఇప్పుడు ఇదే కార్యక్రమానికి రెసిడెన్షియల్‌గా పర్యవేక్షణ చేసి జ్ఞానధారగా అధికారులు పేరుమార్చారు. తెలుగు, ఇంగ్లిషు, గణితం,సైన్సు సబ్జెక్టు ఉపాధ్యాయులుతో పాటు ఎస్జీటీ ఒకరు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఒకరు జ్ఞానధార కార్యక్రమాన్ని నెల రోజులు నిర్వహిస్తారు. 5వ తరగతిలో వెనుకబడి 6వ తరగతికి రానున్న వారు, అలాగే 9వ తరగతిలో వెనుకబడి 10వ తరగతికి రానున్న విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల రోజులు శిక్షణ ఇవ్వనున్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ (ఆర్థికపరమైన సెలవులు) ఇవ్వనున్నారు.
ఎంత మందిని ఎంపిక చేశారంటే..
జిల్లా వ్యాప్తంగా 20,421 మంది విద్యార్థులను జ్ఞానధార శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో 3,758 మంది 5వ తరగతిలో సీ–గ్రేడ్‌లో ఉన్నవారు ఉండగా.. 1,906 మంది బాలికలు, 1,852 మంది బాలురు ఉన్నారు. అలాగే 9వ తరగతిలో 16,663 మంది డీ–1,డీ–2 గ్రేడ్ విద్యార్థులను గుర్తించారు. వీరిలో బాలికలు 8,324 మంది, బాలురు 8,339 మంది ఉన్నారు. 9వ తరగతి విద్యార్థులకు మాత్రం వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నారు.
గురుకుల బోధన..
గురుకుల పాఠశాలల్లో ఎలాంటి బోధన చేస్తారో.. జ్ఞానధార శిక్షణకు హాజరయ్యే వారికి అలాంటి బోధన చేయనున్నారు. ఉదయం 6 గంటలకే దినసరి చర్య ప్రారంభమవుతుంది. ఉదయం పాలు, తర్వాత బ్రేక్ ఫాస్ట్, ఇంటర్వల్ సమయంలో స్నాక్స్ అందిస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు. అలాగే సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం పెడతారు. ఉదయం, సాయంత్రం పిల్లలతో వ్యాయాం చేయిస్తారు. ఇలా గురుకుల బోధనతో కూడిన శిక్షణ ఇచ్చి వెనుకబడిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి విధి విధానాలను విద్యాశాఖ రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చేబుతున్నారు.
జ్ఞానధారపై నేడు సమీక్ష
శ్రీకాకుళం : జ్ఞానధార కార్యక్రమంపై డివిజన్ల వారీగా అధికారులు గురువారం సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆర్‌జేడీ డి.దేవానందరెడ్డి జిల్లాకు రానున్నారు. పాలకొండ, శ్రీకాకుళంలో సమీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి పాలకొండ డివిజన్‌కు సంబంధించి, మధ్యాహ్నం శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో శ్రీకాకుళంలో సమీక్ష ఉంటుంది. రానున్న విద్యా సంవత్సరానికి సబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిక్షణలు పిల్లల సమీకరణ, విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కావాల్సినటువంటి సూచనలు, మార్గదర్శకాలు, ప్రణాళిక తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
జ్ఞానధారతో ఎంతో మేలు
జ్ఞానధార కార్యక్రమం వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ వేసవిలో నెల రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నాం. దీనికోసం నలుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఎస్జీటీ ఒకరు, వ్యాయామ ఉపాధ్యాయుడుని ఎంపిక చేస్తున్నాం. పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని రెండు రోజుల్లో ప్రకటన చేస్తాం.
– ఎం.సాయిరాం, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment