అమ్మా, నాన్న.. క్షమించండి!
Published Wed, Jan 4 2017 12:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
– పూడిచెర్ల యువకుడు కాకినాడలో ఆత్మహత్య
ఓర్వకల్లు: కష్టపడి చదివి రైల్వే శాఖలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సంపాదించిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ అమ్మ నాన్న క్షమించండి.. నా చావుకు ఎవరూ కారకులు కాదు’ అని సూసైడ్ నోట్ రాశాడు. పూడిచెర్ల గ్రామానికి చెందిన గొల్ల వెంకటరాముడు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారులను ప్రయోజకులను చేయాలని వెంకటరాముడు అప్పులు చేసి చదివించాడు. అప్పుల భారంతో తమకున్న మూడు ఎకరాల భూమిని కూడా అమ్మేశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పెద్ద కుమారుడు గోపాల్(27) ఏడాది క్రితం ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. తొలి ప్రయత్నంలోనే రైల్వేలో ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే విభాగంలో ట్రాక్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబరు 31వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబీకులు హుటాహుటిన కాకినాడకు చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో గోపాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్కడి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించారు. మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఉద్యోగం చేసి తమ కష్టాలు తీరుస్తారనుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement