కౌలురైతు ఆత్మహత్య
ఆయన మాజీ ఎంపీటీసీ. అలాగే రైతుకూడా. వర్షాలు పడక.. పంటలు పండకపోవడంతో ఉన్న పొలాన్ని అమ్మేశాడు.. కౌలుకు తీసుకున్న భూమిలో అదే పరిస్థితి ఎదురుకావడంతో తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పులివెందుల అర్బన్ :పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కౌలురైతు గంగిరెడ్డి యాదవ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాలు పడక.. పంటలు పండకపోవడంతో కుటుంబ పోషణకు తనకున్న పొలం అమ్మేశారు. మళ్లీ 5ఎకరాల పొలం కౌలుకు తీసుకొని ధనియాల పంటను సాగు చేశారు.
పంట పండకపోవడంతో మళ్లీ శనగ పంట సాగు చేశారు. శనగ పంట కూడా వర్షాలు పడక పంట సరిగా పండకపోవడంతో తెచ్చిన రూ.5లక్షలు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు తెలిపారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ సోదరులు
చిన్నరంగాపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి యాదవ్ మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్పలు ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరి వెంట వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, బలరామిరెడ్డి తదితరులు ఉన్నారు.