దాహం వేయడంతో నీరు అందుబాటులో లేక పురుగుల మందు తాగి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం దుబ్బతండాలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఖమ్మం (టేకులపల్లి) : దాహం వేయడంతో నీరు అందుబాటులో లేక పురుగుల మందు తాగి విద్యార్థి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం దుబ్బతండాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దుబ్బతండా గ్రామానికి చెందిన బానోత్ వీరన్న, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నాగరాజు(11) పుట్టుకతోనే గుండె, బ్రెయిన్ సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. నాగరాజును 4వ తరగతి వరకు సొంత ఊర్లోనే చదివించారు. 5వ తరగతికి మేనమామ ఊరు ములకలపల్లికి పంపించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు శక్రవారం సొంత ఇంటికి వచ్చిన అనంతరం దాహం వేయడంతో తల్లిని నీళ్లు అడిగాడు. ఇంట్లో నీళ్లు లేకపోవడంతో తల్లి బోరింగ్ పంప్ వద్దకు వెళ్లింది. ఈలోగా బాలుడు దాహం తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. అనంతరం తల్లి తెచ్చిన నీళ్లు కూడా తాగాడు. అయితే కాసేపటికి కడుపులో నొప్పి, మంట రావడంతో మందు తాగిన విషయం తల్లికి చెప్పాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.