'పురుగుల మందు తాగి నాన్న సారీ చెప్పాడు'
హైదరాబాద్: తన తండ్రిని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆయన చనిపోవడానికి ముందు చెప్పిన మాటే పదేపదే గుర్తుకు వస్తుంటే కన్నీటి వరదే పన్నేండేళ్ల వినోద పసి హృదయానికి. తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన పత్తి రైతు బాల నరసయ్య గత నెల ఇద్దరు పిల్లలకు క్షమాపణలు చెప్పి పురుగులమందు తాగి బిడ్డలను అర్థాంతరంగా అనాథలను చేశాడు. దానికి తోడు బతుకే భారమనుకుంటున్నవారి కుటుంబానికి మూడు లక్షల అప్పు కూడా వదిలేసి వెళ్లాడు.
అంతకు ముందు ఏడాదే బాల నరసయ్య భార్య కూడా చనిపోయింది. అయితే, ఇలా జరగడానికి అతడి వ్యవసాయ కష్టాలే కారణమని అతని బిడ్డలు చెప్పుతూ భోరుమన్నారు. ప్రస్తుతం వారి భారాన్ని చూసుకుంటున్న వాళ్ల నాయనమ్మ అప్పుకింద ఆ ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి పనిలో పెట్టుకునేందుకు అప్పు ఇచ్చినవారు వస్తారేమోనని మదనపడుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా వెళ్లి వారిని పలకరించగా ఆ విషయాలు చెప్పి ఇద్దరు పిల్లలు విలపించారు. 'ఇంకా తీర్చాల్సినవి అప్పులే కాక రెండు లోన్లు కూడా ఉన్నాయి. అందుకే మా నాన్న చనిపోయాడు. మమ్మల్ని బాగా చదివించాలని నాన్న కోరిక. ఆయన మమ్మల్ని ఎప్పుడూ పనిలోకి పంపించలేదు' అని వినోద, ఆమె తమ్ముడు చెప్పారు.
నాయనమ్మ లక్ష్మీ మాట్లాడుతూ... తన కొడుకు అప్పుల బాధతో చనిపోయినా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లభించలేదని, పిల్లల్ని అనాథలుగా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. వారిని ప్రస్తుతం ఓ హాస్టల్లో వేసి చదివిస్తున్నానని, ఈ లోగా అప్పులిచ్చినవారు వచ్చి వారిని తీసుకెళతారేమోనని భయం వేస్తోందని చెప్పింది.