cotton former
-
పత్తి రైతుపై జీఎస్టీ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పత్తికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) దక్కడమే కష్టమైపోతుంటే, ఎంతోకొంత వచ్చే ధరకూ కోత పెట్టేలా జీఎస్టీ అమలవుతుండటంతో రైతన్న కుదేలవుతున్నాడు. గతంలో పత్తి లావాదేవీలపై పన్నుండేది కాదని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాం టిది 5 శాతం జీఎస్టీ విధించడంతో ఆ భారాన్ని వ్యాపారు లు రైతులపై వేస్తున్నారని అధికారులంటున్నారు. రైతు నుంచి పత్తి కొనుగోలు చేసేప్పుడు 5 శాతం జీఎస్టీని మినహాయించే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. సాధారణ పత్తి రకానికి క్వింటాలుకు రూ.4 వేలు ధర పలుకుతుందని వ్యాపారి భావిస్తే, దానికి ఐదు శాతం చొప్పున రూ.200 జీఎస్టీ విధించి చివరకు రూ.3,800 ధర ఖరారు చేస్తున్నారని అంటున్నారు. రైతులకు రూ.100 కోట్ల మేర నష్టం ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 47.72 లక్షల (114%) ఎకరాల్లో సాగైంది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో పత్తి నల్లరంగులోకి మారిపోయింది. గులాబీరంగు పురుగు సోకి నాణ్యత కోల్పోయింది. ఈ పురుగు 10 లక్షల ఎకరాల పంటను నాశనం చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని రూ.3,300–4,000 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన పత్తిని ఎంఎస్పీ కింద రూ.4,320 కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. దానికి 5 శాతం జీఎస్టీ కోత విధించి రూ.100 కోట్లకుపైగా రైతుల నుంచి లూటీ చేశారని అంచనా వేస్తున్నారు. పత్తిపై జీఎస్టీ భారం ఉందనే విషయం తమకు తెలిసిందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అన్నారు. దీన్ని ఎలా వేస్తున్నారన్న దానిపై తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. -
‘మద్దతు’ అడిగితే బేడీలేస్తారా?
సాక్షి, హైదరాబాద్: ‘పత్తిలో తేమ పెరిగిందని, వరి తడిసిందని రకరకాల కారణాలు చెప్పి మద్దతు ధరలో సగం కూడా రైతులకు ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలు వ్యవసాయోత్పత్తులకు బోనస్ చెల్లిస్తుంటే.. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, అసలు ఆ పరిస్థితే లేదని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉంది’అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రైతులపై రాజద్రోహం కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని శాసనసభలో ప్రభుత్వం తీరును ఎండగట్టింది. వాస్తవాలు గుర్తించైనా రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరింది. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరపై కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ ప్రశ్నించారు.అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందక సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు రైతుల పట్ల ప్రభుత్వం తీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు. రూ.500 బోనస్ ఇవ్వాలి రకరకాల కారణాలు చెప్పి ప్రకటించిన మద్దతు ధరలో సగం కూడా రైతులకు అందకుండా ప్రభుత్వం దోపిడీ చేస్తోందని జీవన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. పత్తికి రూ.4,320 మద్దతు ధర ప్రకటిస్తే.. తేమ పేరుతో రూ.2వేల నుంచి రూ.3 వేల లోపే చెల్లిస్తున్నారని, కొన్ని చోట్ల రూ.2 వేల లోపే ఇస్తున్నారని పేర్కొన్నారు. వరికి మద్దతు ధర రూ.1,590 ఉండగా.. ధాన్యంలో నాణ్యత లేదని బాగా తగ్గించి ఇస్తున్నారన్నారు. సన్నరకం వడ్లకు రూ.1,600 కూడా లభించడం లేదని, మార్కెట్లో మాత్రం బియ్యం ధర కిలో రూ.45కు మించి ఉందన్నారు. చత్తీస్‌గఢ్‌లో వరికి రూ.300, గుజరాత్లో పత్తికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నారని.. వాటిపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయించి బేడీలేసి లాక్కెళ్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి నాణ్యత దెబ్బతిన్నదని.. అలాంటి సమయంలో ఆదుకోవాల్సిందిపోయి ఇలా చేయటం భావ్యమా అని ప్రశ్నించారు. వరి, పత్తి, మొక్కజొన్నలకు కనీసం రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలను వైపరీత్యంగా పరిగణించి కేంద్రంతో మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలని సూచించారు. పంటల బీమా పథకం ద్వారా నష్టపరిహారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు. పంట నాణ్యత తగ్గితే ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి బోనస్ ఇవ్వవచ్చని చెప్పారు. క్షమాపణ చెప్పాలి గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కితే రాజద్రోహం కేసులు నమోదు చేశారని కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో ఒకేరోజు 3 దఫాలుగా 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, చేతులకు బేడీలేసి లాక్కెళ్లారని, రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తేసి బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయోత్పత్తులు ఏ నాణ్యతతో మార్కెట్‌కు వచ్చినా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్రంతో మాట్లాడి రూ.500, రాష్ట్రం రూ.500 కలిపి రూ.1,000 బోనస్ ప్రకటించాలన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని గుర్తించాలన్నారు. అక్రమ కేసులు కాదు మద్దతు ధర అడిగితే కేసులు నమోదు చేశామనటంలో వాస్తవం లేదని, మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం, సిబ్బందిపై దాడి చేసి విధులకు ఇబ్బంది కలిగించినందుకే కేసులు నమోదు చేశామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో 2010లో జమ్మికుంట మార్కెట్లో ముగ్గురిపై, 2012లో దేవరకద్ర మార్కెట్లో 16 మందిపై, 2009లో సిద్దిపేటలో ముగ్గురిపై ఈ సెక్షన్లతోనే కేసులు నమోదు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 20 శాతం వరకు తేమ ఉన్నా పత్తిని కొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరామని, అనుమతి రాగానే కొనేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దోమపోటుతోనే వరి పంటకు నిప్పు పెట్టడానికి కారణమని చెప్పారు. -
పత్తి రైతులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం
సాక్షి, ఆదిలాబాద్: పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్రమంత్రులు, సీసీఐ అధికారులతో మద్దతు ధరపై చర్చిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన పత్తి కొనుగోళ్లలో 85 శాతం మంది పత్తి రైతులకు మద్దతు ధర రూ.4,320 కంటే అధికంగా రూ.4,400, రూ.4,500 ఇచ్చినట్లు మార్కెటింగ్ శాఖ నివేదికలో వెల్లడైందని తెలిపారు. పత్తి గింజలపై మార్కెట్ ఫీజు ఎత్తివేయడం, తెలంగాణ ఇండస్ట్రీ పాలసీలో భాగంగా కొత్త జిన్నింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దోహదం చేయడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు పత్తికి మద్దతు ధర కంటే అధికంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు పహాణీల విషయంలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, గిరిజన చట్టాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. అందులో భాగంగానే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. -
27న అసెంబ్లీ ముట్టడి
సాక్షి, హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో ఇరు సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) మంగళవారం భేటీ అయింది. సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి భేటీ వివరాలను ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై భేటీలో చర్చించామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయని ఉత్తమ్ ప్రశ్నించారు. రుణమాఫీ పనికి రాకుండా పోయిందని, ఏ పంటకూ సరైన మద్దతు ధర లేదని, పంట దిగుబడులను కొనుగోలు చేయట్లేదని విమర్శించారు. అసెంబ్లీలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పబ్లిసిటీ తప్ప క్షేత్ర స్థాయిలో ఏదీ సరిగ్గా అమలు కావట్లేదని ఆరోపించారు. పంటల బీమా సంగతేంటి? ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ, మండలిలో ఇచ్చిన మాటకే ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. పత్తి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున సాయం చేయాలని, మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వరి రైతులకు ఎకరానికి రూ.15 వేల రూపాయలు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు జరగట్లేదని, కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారూ నష్టపోయారని, అకాల వర్షానికి సరుకు తడిసిపోయిందని పేర్కొన్నారు. పంటల బీమా మీద పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని, కానీ ఒక్క రైతూ లబ్ధి పొందలేదన్నారు. పంటల కొనుగోలుకు నిధులేవీ? బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పంట కొనుగోలుకు కేటాయించలేదని విమర్శించారు. మిషన్ భగీరథ మెషీన్ల కోసం మాత్రం 20 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కేటాయించారని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాలన పూర్తయినా రైతును ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజలకు మద్యం తాగించడం తప్ప రైతులను పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిపై చర్చ సీఎల్పీ భేటీలో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై చర్చించడంతో పాటు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనవసరంగా ఎక్కువ ప్రచారం కల్పించామన్న అంశంపైనా పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
'పురుగుల మందు తాగి నాన్న సారీ చెప్పాడు'
హైదరాబాద్: తన తండ్రిని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆయన చనిపోవడానికి ముందు చెప్పిన మాటే పదేపదే గుర్తుకు వస్తుంటే కన్నీటి వరదే పన్నేండేళ్ల వినోద పసి హృదయానికి. తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పత్తి రైతు బాల నరసయ్య గత నెల ఇద్దరు పిల్లలకు క్షమాపణలు చెప్పి పురుగులమందు తాగి బిడ్డలను అర్థాంతరంగా అనాథలను చేశాడు. దానికి తోడు బతుకే భారమనుకుంటున్నవారి కుటుంబానికి మూడు లక్షల అప్పు కూడా వదిలేసి వెళ్లాడు. అంతకు ముందు ఏడాదే బాల నరసయ్య భార్య కూడా చనిపోయింది. అయితే, ఇలా జరగడానికి అతడి వ్యవసాయ కష్టాలే కారణమని అతని బిడ్డలు చెప్పుతూ భోరుమన్నారు. ప్రస్తుతం వారి భారాన్ని చూసుకుంటున్న వాళ్ల నాయనమ్మ అప్పుకింద ఆ ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి పనిలో పెట్టుకునేందుకు అప్పు ఇచ్చినవారు వస్తారేమోనని మదనపడుతోంది. ఈ సందర్భంగా ఓ మీడియా వెళ్లి వారిని పలకరించగా ఆ విషయాలు చెప్పి ఇద్దరు పిల్లలు విలపించారు. 'ఇంకా తీర్చాల్సినవి అప్పులే కాక రెండు లోన్లు కూడా ఉన్నాయి. అందుకే మా నాన్న చనిపోయాడు. మమ్మల్ని బాగా చదివించాలని నాన్న కోరిక. ఆయన మమ్మల్ని ఎప్పుడూ పనిలోకి పంపించలేదు' అని వినోద, ఆమె తమ్ముడు చెప్పారు. నాయనమ్మ లక్ష్మీ మాట్లాడుతూ... తన కొడుకు అప్పుల బాధతో చనిపోయినా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆసరా లభించలేదని, పిల్లల్ని అనాథలుగా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. వారిని ప్రస్తుతం ఓ హాస్టల్లో వేసి చదివిస్తున్నానని, ఈ లోగా అప్పులిచ్చినవారు వచ్చి వారిని తీసుకెళతారేమోనని భయం వేస్తోందని చెప్పింది.