సాక్షి, ఆదిలాబాద్: పత్తి రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్రమంత్రులు, సీసీఐ అధికారులతో మద్దతు ధరపై చర్చిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన పత్తి కొనుగోళ్లలో 85 శాతం మంది పత్తి రైతులకు మద్దతు ధర రూ.4,320 కంటే అధికంగా రూ.4,400, రూ.4,500 ఇచ్చినట్లు మార్కెటింగ్ శాఖ నివేదికలో వెల్లడైందని తెలిపారు.
పత్తి గింజలపై మార్కెట్ ఫీజు ఎత్తివేయడం, తెలంగాణ ఇండస్ట్రీ పాలసీలో భాగంగా కొత్త జిన్నింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దోహదం చేయడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు పత్తికి మద్దతు ధర కంటే అధికంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు పహాణీల విషయంలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, గిరిజన చట్టాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హరీశ్‌రావు అన్నారు. అందులో భాగంగానే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment