సాక్షి, హైదరాబాద్: ‘పత్తిలో తేమ పెరిగిందని, వరి తడిసిందని రకరకాల కారణాలు చెప్పి మద్దతు ధరలో సగం కూడా రైతులకు ఇవ్వడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. పంటలు తగులబెట్టుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలు వ్యవసాయోత్పత్తులకు బోనస్ చెల్లిస్తుంటే.. మన రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, అసలు ఆ పరిస్థితే లేదని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉంది’అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు రైతులపై రాజద్రోహం కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని శాసనసభలో ప్రభుత్వం తీరును ఎండగట్టింది. వాస్తవాలు గుర్తించైనా రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని కోరింది.
మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరపై కాంగ్రెస్ నేతలు జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ ప్రశ్నించారు.అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందక సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు రైతుల పట్ల ప్రభుత్వం తీరుపై వారు తీవ్ర విమర్శలు చేశారు.
రూ.500 బోనస్ ఇవ్వాలి
రకరకాల కారణాలు చెప్పి ప్రకటించిన మద్దతు ధరలో సగం కూడా రైతులకు అందకుండా ప్రభుత్వం దోపిడీ చేస్తోందని జీవన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. పత్తికి రూ.4,320 మద్దతు ధర ప్రకటిస్తే.. తేమ పేరుతో రూ.2వేల నుంచి రూ.3 వేల లోపే చెల్లిస్తున్నారని, కొన్ని చోట్ల రూ.2 వేల లోపే ఇస్తున్నారని పేర్కొన్నారు. వరికి మద్దతు ధర రూ.1,590 ఉండగా.. ధాన్యంలో నాణ్యత లేదని బాగా తగ్గించి ఇస్తున్నారన్నారు.
సన్నరకం వడ్లకు రూ.1,600 కూడా లభించడం లేదని, మార్కెట్‌లో మాత్రం బియ్యం ధర కిలో రూ.45కు మించి ఉందన్నారు. చత్తీస్‌గఢ్‌లో వరికి రూ.300, గుజరాత్‌లో పత్తికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నారని.. వాటిపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయించి బేడీలేసి లాక్కెళ్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి నాణ్యత దెబ్బతిన్నదని.. అలాంటి సమయంలో ఆదుకోవాల్సిందిపోయి ఇలా చేయటం భావ్యమా అని ప్రశ్నించారు.
వరి, పత్తి, మొక్కజొన్నలకు కనీసం రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలను వైపరీత్యంగా పరిగణించి కేంద్రంతో మాట్లాడి ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పించాలని సూచించారు. పంటల బీమా పథకం ద్వారా నష్టపరిహారం ఇవ్వొచ్చని పేర్కొన్నారు. పంట నాణ్యత తగ్గితే ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి బోనస్ ఇవ్వవచ్చని చెప్పారు.
క్షమాపణ చెప్పాలి
గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కితే రాజద్రోహం కేసులు నమోదు చేశారని కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో ఒకేరోజు 3 దఫాలుగా 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, చేతులకు బేడీలేసి లాక్కెళ్లారని, రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తేసి బేషరతుగా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయోత్పత్తులు ఏ నాణ్యతతో మార్కెట్‌కు వచ్చినా ప్రభుత్వం మద్దతు ధరకే కొనాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కేంద్రంతో మాట్లాడి రూ.500, రాష్ట్రం రూ.500 కలిపి రూ.1,000 బోనస్ ప్రకటించాలన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని గుర్తించాలన్నారు.
అక్రమ కేసులు కాదు
మద్దతు ధర అడిగితే కేసులు నమోదు చేశామనటంలో వాస్తవం లేదని, మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం, సిబ్బందిపై దాడి చేసి విధులకు ఇబ్బంది కలిగించినందుకే కేసులు నమోదు చేశామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో 2010లో జమ్మికుంట మార్కెట్‌లో ముగ్గురిపై, 2012లో దేవరకద్ర మార్కెట్‌లో 16 మందిపై, 2009లో సిద్దిపేటలో ముగ్గురిపై ఈ సెక్షన్‌లతోనే కేసులు నమోదు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 20 శాతం వరకు తేమ ఉన్నా పత్తిని కొనేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరామని, అనుమతి రాగానే కొనేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. దోమపోటుతోనే వరి పంటకు నిప్పు పెట్టడానికి కారణమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment