సాక్షి, హైదరాబాద్: పత్తికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) దక్కడమే కష్టమైపోతుంటే, ఎంతోకొంత వచ్చే ధరకూ కోత పెట్టేలా జీఎస్టీ అమలవుతుండటంతో రైతన్న కుదేలవుతున్నాడు. గతంలో పత్తి లావాదేవీలపై పన్నుండేది కాదని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు.
అలాం టిది 5 శాతం జీఎస్టీ విధించడంతో ఆ భారాన్ని వ్యాపారు లు రైతులపై వేస్తున్నారని అధికారులంటున్నారు. రైతు నుంచి పత్తి కొనుగోలు చేసేప్పుడు 5 శాతం జీఎస్టీని మినహాయించే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు. సాధారణ పత్తి రకానికి క్వింటాలుకు రూ.4 వేలు ధర పలుకుతుందని వ్యాపారి భావిస్తే, దానికి ఐదు శాతం చొప్పున రూ.200 జీఎస్టీ విధించి చివరకు రూ.3,800 ధర ఖరారు చేస్తున్నారని అంటున్నారు.
రైతులకు రూ.100 కోట్ల మేర నష్టం
ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 47.72 లక్షల (114%) ఎకరాల్లో సాగైంది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలతో పత్తి నల్లరంగులోకి మారిపోయింది. గులాబీరంగు పురుగు సోకి నాణ్యత కోల్పోయింది. ఈ పురుగు 10 లక్షల ఎకరాల పంటను నాశనం చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పత్తిని రూ.3,300–4,000 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన పత్తిని ఎంఎస్‌పీ కింద రూ.4,320 కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో 50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. దానికి 5 శాతం జీఎస్టీ కోత విధించి రూ.100 కోట్లకుపైగా రైతుల నుంచి లూటీ చేశారని అంచనా వేస్తున్నారు. పత్తిపై జీఎస్టీ భారం ఉందనే విషయం తమకు తెలిసిందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అన్నారు. దీన్ని ఎలా వేస్తున్నారన్న దానిపై తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment