సాక్షి, హైదరాబాద్ : రైతు సమస్యలపై ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో ఇరు సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) మంగళవారం భేటీ అయింది.
సీఎల్పీ నేత జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి భేటీ వివరాలను ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై భేటీలో చర్చించామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయని ఉత్తమ్ ప్రశ్నించారు. రుణమాఫీ పనికి రాకుండా పోయిందని, ఏ పంటకూ సరైన మద్దతు ధర లేదని, పంట దిగుబడులను కొనుగోలు చేయట్లేదని విమర్శించారు. అసెంబ్లీలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పబ్లిసిటీ తప్ప క్షేత్ర స్థాయిలో ఏదీ సరిగ్గా అమలు కావట్లేదని ఆరోపించారు.
పంటల బీమా సంగతేంటి?
ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ, మండలిలో ఇచ్చిన మాటకే ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. పత్తి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పత్తి రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున సాయం చేయాలని, మొక్కజొన్న రైతులకు ఎకరానికి రూ.15 వేలు, వరి రైతులకు ఎకరానికి రూ.15 వేల రూపాయలు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు జరగట్లేదని, కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారూ నష్టపోయారని, అకాల వర్షానికి సరుకు తడిసిపోయిందని పేర్కొన్నారు. పంటల బీమా మీద పెద్ద పెద్ద ప్రకటనలు చేశారని, కానీ ఒక్క రైతూ లబ్ధి పొందలేదన్నారు.
పంటల కొనుగోలుకు నిధులేవీ?
బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా పంట కొనుగోలుకు కేటాయించలేదని విమర్శించారు. మిషన్ భగీరథ మెషీన్ల కోసం మాత్రం 20 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కేటాయించారని పేర్కొన్నారు. మూడున్నరేళ్ల పాలన పూర్తయినా రైతును ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజలకు మద్యం తాగించడం తప్ప రైతులను పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిపై చర్చ
సీఎల్పీ భేటీలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై చర్చించడంతో పాటు, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అనవసరంగా ఎక్కువ ప్రచారం కల్పించామన్న అంశంపైనా పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment