
పురుగుల మందు తాగబోయిన ముద్రగడ
తనను అరెస్టు చేసే సమయంలో ముద్రగడ పద్మనాభం నిజంగానే పురుగుల మందు తాగబోయారు. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు.
ఈ సమయంలో నిజంగానే పురుగుల మందు తాగేందుకు ఆయన డబ్బా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే లోపలకు వెళ్లిన పోలీసులు డబ్బాను లాగేయడంతో ఆ మందు ఆయన చొక్కా మీద పడినట్లు తెలిసింది. మొత్తానికి ముద్రగడ పురుగుల మందు తాగబోతుంటే పోలీసులు అడ్డుకుని మరీ ఆయనను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సీఐడీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్తారని సమాచారం.