సిర్పూర్ (టి): అతడికి అప్పటికే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమకు నిరాకరించడంతో నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆమెకు పురుగుల మందు తాగించి పరారయ్యాడు. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఓ పదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బుదే దీప (19) ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్‌బాయిల కుమారుడు కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజులుగా కమలాకర్ ప్రేమ పేరుతో దీప వెంటపడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 17న ఆదివారం సాయంత్రం యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని లేకుంటే నిన్ను, నీ కుటుంబం మొత్తాన్నీ చంపుతానని దీపను బెదిరించాడు. అయినప్పటికీ ఆమె ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. దీప కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతిని మొదట సిర్పూర్(టి) ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్యం విషమించడంతో కాగజ్‌నగర్‌కు.. అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత మెరుగైన చికిత్సకోసం కరీంనగర్‌కు తరలించారు. సోమవారం కరీంనగర్‌లో దీప మృతి చెందింది. దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే దీపకు కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగించిన విషయం ఓ పదేళ్ల చిన్నారి ద్వారా మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీంతో సామాజిక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గ్రామంలో స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించారు. కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై రమేశ్ వారికి నచ్చజెప్పారు. పోలీసులు ఆస్పత్రిలోనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment