ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
Published Thu, Feb 16 2017 12:30 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
- ప్రియురాలు మృతి
- ప్రాణాపాయ స్థితిలో ప్రియుడు
- కడుపునొప్పి తాళలేక కుమార్తె
మృతిచెందినట్లు తల్లి ఫిర్యాదు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మండ్లెం(జూపాడుబంగ్లా): పెద్దలను ఒప్పించలేక..ఇద్దరు ప్రేమికులు పురుగు మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా..ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడతన్నాడు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబసభ్యుల తెలిపిన వివరాల మేరకు...మండ్లెం గ్రామానికి చెందిన మాసుం, మౌలాబీ దంపతుల కుమార్తె జరీనా(15), అదే గ్రామానికి చెందిన సుంకన్న కుమారుడు సుధాకర్(17) ప్రేమించుకున్నారు. తండ్రి మరణించటంతో తల్లి అదుపాజ్ఞలో ఉంటూ జరీనా.. పొలం పనులకు వెళ్లేది.
సుధాకర్.. జూపాడుబంగ్లా మోడల్ పాఠశాలలో ఇంటర్ ద్వితీయసంవత్సరం విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాడోదుగా అప్పుడప్పుడు పొలం పనులకు వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో జరీనా, సుధాకర్‌ల మధ్య ఆకర్షణ.. ప్రేమగా మారింది. పెద్దలకు తెలియకుండా ఇద్దరూ.. తిరిగేవారు. మంగళవారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇద్దరూ ఒక చోట కలుసుకొని తమ వివాహం గురించి చర్చించుకున్నారు.
పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకొనే ధైర్యం లేక మంగళవారం సాయంత్రం పురుగుల మందుతాగి ఇంటికి చేరుకున్నారు. తల్లి గమనించè కపోవటంతో జరీనా మృతిచెందగా సుధాకర్ తల్లిదండ్రులు గమనించటంతో అతన్ని చికిత్సనిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం బయటకు పొక్కితే పరువుపోతుందనే ఉద్దేశంతో మౌలాబీ.. తమ కుమార్తె కడుపునొప్పి తాళలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
Advertisement
Advertisement